టీఆర్ఎస్‌లో అసంతృప్తి సెగలు… నేతల హాట్ కామెంట్స్!

Denied cabinet berths trs seniors expressed their displeasure out in open, టీఆర్ఎస్‌లో అసంతృప్తి సెగలు… నేతల హాట్ కామెంట్స్!

టీఆర్‌ఎస్‌లో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయంటూ వార్తలు గుప్పుమంటున్న నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన నేతలు మీడియా ముందుకు వచ్చి తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. మంత్రి పదవులు దక్కక నేతలు పార్టీ అధిష్ఠానంపై అసమ్మతి గళం వినిపిస్తున్నారు. ఇన్నాళ్లు చప్పుడు చేయకుండా ఉన్న నేతలంతా పదవులు దక్కకపోవడంతో దాచుకున్న అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యల తర్వాత పార్టీలో అసమ్మతి స్వరం గళమెత్తిందని చెబుతున్నారు. ఓ సభలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేసిన వ్యాఖ్యలు కూడా అందుకు అద్దం పడుతున్నాయి. అంతకుముందు హరీష్ రావుకు మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన వర్గం కూడా సీఎం కేసీఆర్ తీరుపై అసహనంతో ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతేకాదు.. ఒకానొక దశలో హరీష్ రావు బీజేపీలోకి వెళ్లే అవకాశాలున్నట్లు కూడా ఊహాగానాలు గుప్పుమన్నాయి.

అయితే, తాజాగా హరీష్ రావుకు మంత్రి పదవి దక్కడంతో ఆ ఊహాగానాలు పటాపంచలు అయ్యాయని టీఆర్‌ఎస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరున్న హరీష్ రావుకు మంత్రి పదవి దక్కడం గులాబీ శ్రేణుల్లో మరింత జోష్ పెరిగిందని కూడా వెల్లడించాయి. అయితే, రాష్ట్ర మంత్రి వర్గంలో తమకు చోటు దక్కుతుందని చాలా మంది సీనియర్లు ఆశతో ఎదురు చూశారు. కానీ.. నిరాశే ఎదురుకావడంతో తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మంత్రి వర్గ విస్తరణ తర్వాత మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఏకంగా కేసీఆర్ నిజ స్వరూపం బయటపడిందని వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. తాజాగా, మాజీ మంత్రి జోగు రామన్న తన గన్‌మెన్లను వెనక్కిపంపడం కూడా అందులో భాగమేనని స్పష్టం చేస్తున్నారు.

ఆయనతో పాటు అరికెపూడి గాంధీ కూడా తన గన్‌మెన్లను వెనక్కి పంపారు. విప్ పదవిని ఆశించిన ఆయన అది రాకపోవడంతో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. పదవులు రాకే అలక వహించి ఇలా వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. అయితే, ఇవన్నీ పుకార్లేనని పలువురు పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. మాజీ మంత్రి రాజయ్య, జూపల్ల కృష్ణారావు.. తదితర నేతలు పార్టీలో అసంతృప్తి లేదని తేల్చి చెప్పారు.

కాగా… నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ… తాను నిఖార్సయిన టీఆర్‌ఎస్ పార్టీ నాయకుడినని, పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం మంత్రి పదవినే త్యాగం చేశానని తెలిపారు. తాను గులాబీ పార్టీలోనే ఉంటానని, పార్టీ మారతానంటూ సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మొద్దని చెప్పారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి కూడా స్పందించారు. తన నాయకుడు కేసీఆరేనని, ఆయనతోనే తాను చివరి వరకు ఉంటానని తేల్చి చెప్పారు. తనపై సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని అన్నారు.

మరోవైపు, మాజీ మంత్రి రాజయ్య కూడా టీఆర్‌ఎస్‌పై తన గళం వినిపించారు. దళితులకు పదవి రాలేదని మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య మీడియా చిట్‌చాట్‌లో అన్నట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో స్వయంగా మాజీ మంత్రి రాజయ్య మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చారు. తాను అనని మాటలను మీడియాలో చూపించడం బాధ కలిగించిందని చెప్పారు. కేసీఆరే తమ నాయకుడని.. న్యాయం జరుగుతుందన్న నమ్మకం తమకు ఉందని స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్ తనకు ఎన్నో అవకాశాలు ఇచ్చారని స్పష్టంచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *