రహనేకు బంపరాఫర్.. ఐపీఎల్‌లో ఇకపై..

Delhi Capitals eyeing Ajinkya Rahane for IPL 2020

ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఎంఎస్‌ ధోని పర్యాయ పదంగా మారినట్టే.. రాజస్తాన్‌ రాయల్స్‌కు అజింక్యా రహానే మారుపేరుగా నిలిచాడు. సుదీర్ఘ కాలంగా రాజస్తాన్‌కు వెన్నంటి నిలిచినా రహానే.. వచ్చే సీజన్‌లో ఫ్రాంచైజీ మారబోతున్నాడా అంటే అవుననే చెబుతున్నాయి క్రీడా వర్గాలు. ఐపీఎల్‌ 2020 సీజన్‌ కోసం ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇప్పట్నుంచే కసరత్తులు ప్రారంభించింది. ఐపీఎల్‌ 12లో శ్రేయాస్‌ అయ్యర్‌ సారథ్యంలోని యువ ఆటగాళ్లు దుమ్ము దులిపారు. దీంతో 2012 అనంతరం తొలిసారి ఐపీఎల్‌ 12లో ప్లేఆఫ్‌కు చేరింది.

అయితే వచ్చే సీజన్‌కు అనుభవం, యువతతో మిళితమై ఉండేలా ఢిల్లీ క్యాపిటల్స్‌ జాగ్రత్తలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా సీనియర్‌ ఆటగాడు, కెప్టెన్‌గా అనుభవం ఉన్న అజింక్యా రహానేను జట్టులోకి చేర్చుకోవాలని ఢిల్లీ ఆరాటపడుతోంది. ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. దీనికోసం రహానేకు భారీ మొత్తంలో ఆఫర్‌ ఇచ్చినట్టు సమాచారం. అయితే దీనిపై ఇప్పటివరకు రహానే, ఢిల్లీ అధికారిక ప్రకటన చేయలేదు. అయితే అన్నీ కుదిరితే వచ్చే సీజన్‌లో రహానే ఢిల్లీ తరుపున ఆడే అవకాశం ఉన్నట్లు క్రీడా విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు.

ఇక ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను గతేడాది జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ చేజిక్కించుకున్న వెంటనే జట్టులో సమూల మార్పులు చేసింది. పేరుతో సహా ఆటగాళ్లను, కోచింగ్‌ బృందాన్ని మార్చింది. తాజాగా ఐపీఎల్‌ 13 కోసం మరిన్ని మార్పులు చేయడానికి ఢిల్లీ పూనుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *