సమరోత్సాహంతో ఢిల్లీ, గెలిచి తీరాలన్న పట్టుదలతో హైదరాబాద్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు ఊపొచ్చేసింది.. మ్యాచ్‌లన్నీ ఉత్కంఠభరితంగా సాగుతుండటంతో క్రికెట్‌ అభిమానులు టీవీలకు అతుక్కుపోతున్నారు.. ఆఖరి బాల్‌ వరకు కళ్లప్పగించి చూస్తున్నారు..

సమరోత్సాహంతో ఢిల్లీ, గెలిచి తీరాలన్న పట్టుదలతో హైదరాబాద్‌
Follow us

|

Updated on: Sep 29, 2020 | 10:58 AM

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు ఊపొచ్చేసింది.. మ్యాచ్‌లన్నీ ఉత్కంఠభరితంగా సాగుతుండటంతో క్రికెట్‌ అభిమానులు టీవీలకు అతుక్కుపోతున్నారు.. ఆఖరి బాల్‌ వరకు కళ్లప్పగించి చూస్తున్నారు.. అనుకున్నట్టుగానే నిన్న బెంగళూరు, ముంబాయి జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ మనసుదోచుకుంది.. నరాలు తెగిపోయే ఉత్కంఠ చోటు చేసుకున్న ఆ మ్యాచ్‌ హాంగోవర్‌ నుంచి ఇంకా తేరుకోక ముందే ఇవాళ మరో కీలక మ్యాచ్‌కు రెడీ అవుతున్నారు ఫ్యాన్స్‌.. ఢిల్లీ కేపిటల్స్‌ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి మాంచి జోష్‌ మీద ఉంది.. పాయింట్ల పట్టికలోనూ టాప్‌ప్లేస్‌లో నిలిచింది.. మరోవైపు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మాత్రం ఆడిన రెండింటిలోనూ ఓటమిపాలైంది.. పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో ఉంది.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం హైదరాబాద్‌కు ఎంతో అవసరం.. ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకోవాలన్నా గెలుపు ముఖ్యం.. ఢిల్లీ జట్టులో అనుభవజ్ఞులకు కొదవలేదు.. అలాగే వర్ధమాన ఆటగాళ్లు కూడా సత్తా చాటుతున్నారు.. తొలి మ్యాచ్‌లో పంజాబ్‌ను ఓడించిన ఢిల్లీ జట్టు తర్వాత చెన్నైపై గెలుపొందింది. జట్టును విజయపథంలోకి తీసుకెళుతున్న క్రెడిట్‌ కచ్చితంగా కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌కే దక్కుతుంది. బ్యాటింగ్‌ ఆర్డర్‌ కూడా బలంగానే ఉంది.. శిఖర్‌ ధవన్‌, పృథ్వీషా, రిషబ్‌పంత్‌లు కావలసినన్ని పరుగులు సాధించగల సమర్థులే! మరోవైపు బౌలింగ్‌ డిపార్ట్‌మెంట్‌ కూడా స్ట్రాంగ్‌గానే ఉంది. రబాడ, అమిత్‌మిశ్రా, నోర్జెలు చక్కటి బౌలింగ్‌ను ప్రదర్శిస్తున్నారు.. స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, మీడియం పేసర్‌ ఇషాంత్‌ శర్మలు గాయాల నుంచి కోలుకోవడం ఢిల్లీకి కలిసివచ్చే అంశం. గత రెండు మ్యాచ్‌లలో హైదరాబాద్‌ తడబడింది.. మిడిలార్డర్‌ వైఫల్యం హైదరాబాద్‌ను కుంగతీస్తున్నది.. గాయంబారిన పడిన విలియమ్‌సన్‌ కోలుకున్నాడో లేదో తెలియడం లేదు.. విలియమ్‌సన్‌ జట్టులోకి వస్తే హైదరాబాద్‌ కాన్ఫిడెన్స్‌ కచ్చితంగా పెరుగుతుంది. అబుదాబిలో ఇప్పటి వరకు హైదరాబాద్‌ మూడు మ్యాచ్‌లు ఆడింది.. పాపం మూడింటిలోనూ పరాజయమే ఎదురయ్యింది.. ఆడిన ఒకే ఒక్క మ్యాచ్‌లో ఢిల్లీ కూడా ఓడిపోయింది.. కాగా ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు 15 మ్యాచ్‌లు జరిగాయి.. ఇందులో హైదరాబాద్‌ జట్టు ఎనిమిది మ్యాచుల్లో విజయం సాధించింది.. ఢిల్లీ ఆరు మ్యాచ్‌లలో గెలుపొందింది.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ డేవిడ్‌ వార్నర్‌ (కెప్టెన్‌), రషీద్‌ ఖాన్, మిషెల్‌ మార్‌‡్ష, మొహహ్మద్‌ నబీ, ఫాబియాన్‌ అలెన్, బిల్లీ స్టాన్‌లేక్, కేన్‌ విలియమ్సన్, బెయిర్‌స్టో (విదేశీ ఆటగాళ్లు). వృద్ధిమాన్‌ సాహా, సంజయ్‌ యాదవ్, ఖలీల్‌ అహ్మద్, సందీప్‌ శర్మ, అబ్దుల్‌ సమద్, శ్రీవత్స్‌ గోస్వామి, అభిషేక్‌ శర్మ, బాసిల్‌ థంపి, సందీప్‌ బావనక, భువనేశ్వర్, విరాట్‌ సింగ్, టి. నటరాజన్, షహబాజ్‌ నదీమ్, మనీశ్‌ పాండే, విజయ్‌ శంకర్, సిద్ధార్థ్‌ కౌల్, ప్రియమ్‌ గార్గ్‌ (భారత ఆటగాళ్లు)

ఢిల్లీ క్యాపిటల్స్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), ఇషాంత్‌ శర్మ, అజింక్య రహానే, రవిచంద్రన్‌ అశ్విన్, శిఖర్‌ ధావన్, మోహిత్‌ శర్మ, పృథ్వీ షా, లలిత్‌ యాదవ్, అవేశ్‌ ఖాన్, అక్షర్‌ పటేల్, తుషార్‌ దేశ్‌పాండే, రిషభ్‌ పంత్, హర్షల్‌ పటేల్, అమిత్‌ మిశ్రా (భారత ఆటగాళ్లు). కగిసో రబడ, మార్కస్‌ స్టొయినిస్, సందీప్‌ లమిచానే, షిమ్రాన్‌ హెట్‌మైర్, డానియెల్‌ స్యామ్స్, అలెక్స్‌ క్యారీ, అన్రిచ్‌ నోర్జే, కీమోపాల్‌ (విదేశీ ఆటగాళ్లు).