తెలుగు రాష్ట్రాల్లో కాక పుట్టిస్తోన్న డేటా యుద్ధం

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో డేటా యుద్ధం తీవ్రంగా మారింది. మొదట ఇది ఒక కంపెనీపై తెలంగాణ పోలీసుల చర్యగా మొదలై తర్వాత రెండు రాష్ట్రాలు మధ్య గొడవ, మూడు నాలుగు పార్టీల మధ్య యుద్ధంగా మారింది. డేటా వార్ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో ఉద్రిక్తంగా మారింది. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఐటీ గ్రిడ్ అనే కంపెనీ ఏపీ ఓటర్ల డేటాను దుర్వినియోగం చేస్తోందని తెలంగాణ పోలీసులు కంపెనీపై దాడి చేసి నలుగురు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న […]

తెలుగు రాష్ట్రాల్లో కాక పుట్టిస్తోన్న డేటా యుద్ధం
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 1:48 PM

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో డేటా యుద్ధం తీవ్రంగా మారింది. మొదట ఇది ఒక కంపెనీపై తెలంగాణ పోలీసుల చర్యగా మొదలై తర్వాత రెండు రాష్ట్రాలు మధ్య గొడవ, మూడు నాలుగు పార్టీల మధ్య యుద్ధంగా మారింది. డేటా వార్ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో ఉద్రిక్తంగా మారింది.

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఐటీ గ్రిడ్ అనే కంపెనీ ఏపీ ఓటర్ల డేటాను దుర్వినియోగం చేస్తోందని తెలంగాణ పోలీసులు కంపెనీపై దాడి చేసి నలుగురు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న ఏపీకి చెందిన లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి మొదట మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం వైసీపీ యుత్ విభాగం నాయకుడు రాంరెడ్డి ఇదే విషయంపై ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

దీంతో విచారణ ప్రారంభించిన తెలంగాణ సైబరాబాద్ పోలీసులు ఐటీ గ్రిడ్ సంస్థపై దాడి చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారిని కోర్టు ముందు హాజరుపరిచారు.

ఇంతకీ అసలు ఆరోపణ ఏమిటి? ఏపీ ప్రజలకు చెందిన రహస్య డేటా, ఏపీ ప్రభుత్వం వద్ద సురక్షితంగా ఉండాల్సిన ప్రజల సమాచారం హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్ అనే సంస్థకు ఎందుకు వెళ్లింది? ఈ సంస్థ టీడీపీ పార్టీ కోసం పని చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం ప్రభుత్వ డేటాను ఈ కంపెనీ వినియోగిస్తోందనేది ఆరోపణ.

చంద్రబాబు ఏమంటున్నారు? ఈ విషయంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందిస్తూ ఏపీకి సంబంధించిన అంశంపై కేసును ఏపీకి బదలాయించకుండా ఉండటాన్ని తప్పు పట్టారు. ఏపీకి డేటా మీ వద్ద ఉందంటే మాకు పంపించండి దాని సంగతి మేము చూసుకుంటామని అన్నారు.

టీడీపీ ఏమంటోంది? ఐటీ గ్రిడ్ టీడీపీ పార్టీ కోసం పని చేస్తోందని, ఆ సంస్థ వద్ద ఉన్న సమాచారం టీడీపీ సొంతమని చెబుతోంది. ఇంటింటికి టీడీపీ వంటి కార్యక్రమాల ద్వారా గత నాలుగేళ్లుగా సేకరించిన సమాచారమని అంటోంది. ఇలాంటి డేటా పరంగా టీడీపీ మిగిలిన పార్టీలన్నింటి కన్నా చాలా ఎక్కువ స్థితిలో ఉంది. జాతీయ స్థాయి నుంచి ప్రతి ప్రాంతీయ పార్టీకీ ఈ విధంగా డేటా ఉంటుంది. అయితే తమ డేటాను ఎవరో ఫిర్యాదు చేశారని చెప్పి ఎలాంటి ఆధారాలు లేకుండా తెలంగాణ పోలీసుల చేత టీఆర్ఎస్ సేకరించి వైసీపీకి లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తోంది. ప్రభుత్వ డేటా లీక్ అయ్యేందుకు ఆస్కారం లేదని, అవసరమైతే డేటా ఫొరెన్సిక్ చేస్తే అన్ని విషయాలు తెలుస్తాయని సవాల్ చేస్తోంది.

డేటా అనేది ప్రతి పార్టీకీ అవసరమే. సేవా మిత్ర ఆప్ ఏమీ రహస్యం కాదని, గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని టీడీపీ చెబుతోంది. ఎలక్షన్ కమిషన్ సైతం ఓటర్ల లిస్ట్‌ను పబ్లిక్ డొమైన్‌లో ఉంచుతుందని అలాంటిది టీడీపీ వద్ద ఉన్న సమాచారంలో తప్పేంటని ప్రశ్నిస్తోంది. ఒకవేళ ఆధార్ డేటా లీక్ అయ్యిందని తెలిస్తే ఆ విషయం జాతీయ స్థాయిలో ఆధార్ సర్వర్లను నిర్వహిస్తున్న వారికి తేలికగా తెలిసిపోతుందని చెబుతోంది.

వైసీపీ ఆరోపణలు ఏమిటి? ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందుతున్న వారి వివరాలను ప్రభుత్వం తన సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటోంది. ఏపీ ఓటర్లను నాలుగు రకాలుగా విభిజించింది. టీడీపీ మద్దతుదారులు, వైసీపీ మద్దతుదారులు, మధ్యస్తంగా ఉండేవారు, నాన్ లోకల్స్. వీటితో పాటు కులాలు, ఆసక్తులు, ఇతర సమాచారం ఆధారంగా టీడీపీ మద్దతుదారులను కాపాడుతూ వ్యతిరేకుల ఓట్లను తొలగిస్తుంది. మధ్యస్తంగా ఉండేవాళ్లకు ఏదో రకంగా ఆకర్షించేందుకు వ్యూహాలు పన్నుతోంది. నాన్ లోకల్స్‌కు మరో ప్లాన్‌ సిద్ధం చేసిందంటై వైసీపీ ఆరోపిస్తోంది.

కేటీఆర్ ఏమంటున్నారు? ఈ డేటా దుర్వినియోగం విషయంలో తమ పోలీసులు తప్పకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెబుతున్నారు. ఏపీకి సంబంధించిన డేటా హైదరాబాద్‌లో దుర్వినియోగం అవుతుందని హైదరాబాద్‌లో ఉంటున్న ఏపీకి చెందిన వ్యక్తి తమ పోలీసులకు ఫిర్యాదు చేశారని, తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. ఏ తప్పూ లేనప్పుడు ఎందుకు మీరు అడ్డుపడుతున్నారని టీడీపీని ప్రశ్నించారు.

ప్రజల వ్యక్తిగత సమాచారం పబ్లిక్‌లో ఉంచకూడదని, దుర్వినియోగం కాకూడదని సుప్రీం కోర్టు చెబుతోంది. గతంలో ఫేస్‌బుక్ తమ వద్ద ఉన్న వినియోగదారుల సమాచారాన్ని రాజకీయ పార్టీలకు అప్పగిస్తోందంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం అంతర్జాతీయంగా పెద్ద చర్చను లేవనెత్తింది. ఈ నేపథ్యంలో ఒక వేళ ఐటీ గ్రిడ్ సంస్థ కూడా అలాంటి చర్యలకు పాల్పడితే తప్పేనని, లేకపోతే కేవలం టీడీపీకి సంబంధించిన సమాచారంతోనే పని చేస్తుంటే అది తప్పులేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న ఈ డేటా వార్ ఎలాంటి మలుపులు తీసుకుంటుందోనని తెలుగు ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.