మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఎదుట తండ్రీ కూతుళ్లు !

DK Shivakumars daughter Aisshwaryas net worth grew from around Rs. 1 crore in 2013 to over Rs. 100 crore in 2018, మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఎదుట తండ్రీ కూతుళ్లు !

మనీ లాండరింగ్ కేసులో కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డి.కె. శివకుమార్ ని ఈడీ సుదీర్ఘంగా విచారిస్తోంది. గత నెలలో మొదలైన విచారణ ఇంకా కొనసాగుతోంది. బుధవారం ఆయనను ఈడీ అధికారులు కొన్ని గంటలపాటు విచారించారు. అయితే ఈ విచారణలో ఆయన చాలావరకు పొంతనలేని సమాధానాలు చెప్పారని, చాలా ప్రశ్నలకు తెలియదంటూ దాటవేశారని వారు తెలిపారు. అటు-శివకుమార్ కుమార్తె 23 ఏళ్ళ ఐశ్వర్యను కూడా బెంగుళూరు నుంచి వారు ఢిల్లీకి పిలిపించారు. ఈ కేసులో ఆమె స్టేట్ మెంటును కూడా రికార్డు చేస్తున్నారు. ఐశ్వర్య ఆస్తులు 2013 లో 1 కోటి రూపాయలమేర ఉండగా.. 2018 నాటికి అవి రూ. 100 కోట్లకు పెరిగినట్టు ఈడీ గుర్తించింది. తన తండ్రికి, ఈమెకు మధ్య జరిగిన ఆర్ధిక లావాదేవీలను అధికారులు నమోదు చేశారు. ఐశ్వర్య కూడా ఈ కేసులో చిక్కుకుందా అన్న విషయాన్ని వారు ఆరా తీస్తున్నారు.
2017 జులైలో శివకుమార్, ఐశ్వర్య ఇద్దరూ కలిసి సింగపూర్ ను విజిట్ చేశారు. ఆ సందర్భంలో కొన్ని సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు. తన తండ్రి ఏర్పాటు చేసిన ఓ ఎడ్యుకేషన్ ట్రస్టుకు ఐశ్వర్య ట్రస్టీగా వ్యవహరిస్తోంది. కోట్లాది రూపాయల విలువైన వాణిజ్య కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఈ ట్రస్ట్.. పలు ఇంజనీరింగ్, ఇతర కళాశాలలను నడుపుతోందని, వీటి నిర్వాణా బాధ్యతలను ఐశ్వర్యే చూస్తోందని తెలిసింది. ఈ కోణంలో హవాలా నిధులతో కూడా ఈమెకు సంబంధం ఉందని అనుమానిస్తున్నారు.
శివకుమార్ అక్రమ లావాదేవీలకు సంబంధించి ఆయనను ఈడీ అరెస్టు చేసిన సంగతి విదితమే.. తనపై గల కేసును రద్దు చేయాలని కోరుతూ ఆయన గతంలో కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. తనను ఈడీ ఆరెస్టు చేయకుండా చూడాలన్న ఆయన అభ్యర్థనను కూడా కోర్టు తోసిపుచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *