ఇంటిగ్రేటెడ్ చిప్‌లతో దగా.. భారీగా బయటపడ్డ పెట్రోల్ బంక్ మోసాలు..

ఆధునిక టెక్నాల‌జీతో పెట్రోల్ బంకుల్లో వాహ‌న‌దారుల‌ను మోసం చేస్తున్న ముఠాను అరెస్టు చేసిన‌ట్లు సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ వెల్ల‌డించారు. పెట్రోల్ బంకుల్లోని పంపుల్లో ఇంటిగ్రేటెడ్ చిప్‌లు అమ‌ర్చి మోసం చేస్తున్నట్లు గుర్తించినట్లు ఆయన తెలిపారు

ఇంటిగ్రేటెడ్ చిప్‌లతో దగా.. భారీగా బయటపడ్డ పెట్రోల్ బంక్ మోసాలు..
Follow us

|

Updated on: Sep 05, 2020 | 5:27 PM

ఆధునిక టెక్నాల‌జీతో పెట్రోల్ బంకుల్లో వాహ‌న‌దారుల‌ను మోసం చేస్తున్న ముఠాను అరెస్టు చేసిన‌ట్లు సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ వెల్ల‌డించారు. పెట్రోల్ బంకుల్లోని పంపుల్లో ఇంటిగ్రేటెడ్ చిప్‌లు అమ‌ర్చి మోసం చేస్తున్నట్లు గుర్తించినట్లు ఆయన తెలిపారు. లీట‌ర్ పెట్రోల్ పోయించుకుంటే 970 మి.లీ. మాత్ర‌మే వ‌స్తోంద‌ని తెలిపారు. వాహ‌న‌దారుల ఫిర్యాదుతో తూనిక‌ల కొల‌త‌ల శాఖ అధికారుల‌తో క‌లిసి సైబరాబాద్ పరిధిలో వ‌రుస దాడులు నిర్వహించామ‌న్నారు. వ‌రుస‌గా దాడులు చేయ‌డంతో మోసం వెలుగులోకి వ‌చ్చింద‌న్నారు.

తెలంగాణ‌లో 11, ఏపీలో 22 పెట్రోల్ బంక్‌ల్లో అక్రమాలను గుర్తించి సీజ్ చేశామ‌ని సీపీ సజ్జనార్ తెలిపారు. ఏడాది నుంచి ఈ త‌ర‌హా మోసాల‌కు పాల్ప‌డుతున్నారని.. దాదాపు రూ. కోట్ల‌ల్లో మోసాల‌కు పాల్ప‌డిన‌ట్లు సీపీ పేర్కొన్నారు. తెలంగాణ‌లో చిప్‌లు అమ‌ర్చిన న‌లుగురితో పాటు 9 పెట్రోల్ బంకుల య‌జ‌మానుల‌ను అరెస్టు చేశామ‌న్నారు. నిందితుల నుంచి 14 చిప్‌లు, 8 డిస్‌ప్లే బోర్డులు, మ‌ద‌ర్ బోర్డుతో పాటు ఓ కారును స్వాధీనం చేసుకున్నామ‌ని తెలిపారు.

చిప్‌లు అమ‌ర్చ‌డంతో సుభాని బాషా ప్ర‌ధాన నిందితుడు అని సీపీ స్ప‌ష్టం చేశారు. ముంబైకి చెందిన సాంకేతిక నిపుణులతో క‌లిసి ఈ చిప్‌లు త‌యారు చేశారని.. పెట్రోల్ పోసే బాక్సుల్లో చిప్‌లు అమ‌ర్చి మోసం చేస్తున్నారని సీపీ తెలిపారు. ఒక చిప్ అమ‌ర్చినందుకు రూ. 80 వేల నుంచి రూ. ల‌క్షా 20 వేల వ‌ర‌కు వసూలు చేస్తున్నట్లు సీపీ వివరించారు. అధికారులు వ‌చ్చిన‌ప్పుడు విద్యుత్ స‌ర‌ఫ‌రాను నిలిపేసేవారు. విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిపివేయ‌డం వ‌ల్ల ఒరిజిన‌ల్ సిస్టంకు వెళ్లిపోతోంది. ఈ విధంగా చిప్‌లు ఏర్పాటు చేసి అధికారుల‌కు దొర‌క్క‌కుండా జాగ్ర‌త్త ప‌డేవారు. పెట్రోల్ బంకుల్లో రెండు పంపులు పెడుతారు. క్యాన్స్, బాటిల్స్ లో పెట్రోలో పోసే స‌మ‌యాల్లో ఒరిజిన‌ల్ పంపు నుంచి పోస్తారు. వాహ‌నంలో పెట్రోల్ నింపే స‌మ‌యంలో మోసాల‌కు పాల్ప‌డుతున్నట్లు గుర్తించినట్లు సీపీ సజ్జనార్ వెల్లడించారు.

నిందితుల మోసాల‌పై అన్ని కార్పొరేష‌న్ల‌ను అప్ర‌మ‌త్తం చేశామ‌ని సీపీ తెలిపారు. నిందితుల‌పై పీడీ యాక్ట్ కూడా న‌మోదు చేస్తున్నట్లు తెలిపిన సీపీ.. ముఠా వెనుక ఎవ‌రున్నారు అనే కోణంలో విచార‌ణ జ‌రుపుతున్నామ‌ని పేర్కొన్నారు. తెలంగాణ‌, ఏపీతో స‌హా ఇత‌ర రాష్ట్రాల్లో కూడా మోసాలు చేసి ఉంటార‌ని భావిస్తున్నామ‌ని సీపీ స‌జ్జ‌నార్ పేర్కొన్నారు.