Telangana: కరీంనగర్ జిల్లాలో పోలీసుల దురుసు ప్రవర్తనపై టీవీ9 ప్రసారం చేసిన కథనానికి అధికారులు స్పందించారు. ఘటనపై కరీంనగర్ ఏసీపీ విచారణ చేపట్టారు. సోషల్ మీడియా పోస్ట్ విషయంలో పవన్ కుమార్‌ను విచక్షణా రహితంగా చితకబాదిన చొప్పదండి ఎస్సై రాజేష్‌ను హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. రెండ్రోజుల క్రితం చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారంటూ రుక్మాపూర్ టీఆర్ఎస్ నేత తొంటి పవన్‌కుమార్‌ను విచారణ పేరుతో స్టేషన్ కు పిలిపించారు ఎస్సై. స్టేషన్ కు వచ్చిన పవన్ కుమార్‌ను విచారణ చేయకుండా కేసు నమోదు చేసి చితకబాదారు. విచక్షణా రహితంగా లాఠీలతో ఇష్టం వచ్చినట్లు కొట్టారని.. అసభ్య పదజాలంతో దూషించారంటూ బాధితుడు పవన్ కుమార్ ఆరోపించారు.
కాగా తాను ఎమ్మెల్యే రవిశంకర్‌ను ఉద్దేశించి ఎలాంటి కామెంట్స్ చేయలేదని చెప్తున్నారు పవన్ కుమార్. తన కులానికి సంబంధించి మాత్రమే పోస్ట్ చేశానని.. అది వివాదాస్పదం కావడంతో వెంటనే డిలీట్ చేశానని చెప్పాడు పవన్ కుమార్. అధికార పార్టీ నేతల మాటలు విని.. తనపై ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఈక్రమంలో పవన్ కుమార్ పై ఎస్ఐ విచక్షణ కోల్పోయి ప్రవర్తించిన తీరుపై టీవీ9 వరుస కథనాలను ప్రచారం చేసింది. దీంతో అధికారులు ఎస్ఐ పై చర్యలు తీసుకున్నారు. హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు ఏసీపీ. ఎవరైనా తప్పులు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి గానీ శారీరకంగా హింసిస్తే ఉపేక్షించే సమస్య లేదని ఏసీపీ కరుణాకర్ రావు తెలిపారు. అలాగే సోషల్ మీడియాలో విద్వేషపూరితమైన పోస్టులు చేసిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..