రెచ్చిపోయిన ఆకతాయి.. పోలీసులకే ముచ్చెమటలు పట్టించాడు.. రాత్రంతా కంటిమీద కునుకు లేకుండా చేశాడు..!

ఎవరివైనా వస్తువులు దోపిడీకి గురైతే నేరుగా పోలీసులను ఆశ్రయిస్తారు. మరి పోలీసులకు చెందిన వస్తువులే పోతే..? చిన్న చిన్న వస్తువులు కాకుండా ఏకంగా వాహనాలే చోరీకి గురైతే..? పోలీసులు ఎవరిని ఆశ్రయిస్తారు? వారి పరిస్థితి ఎలా ఉంటుంది..?

రెచ్చిపోయిన ఆకతాయి.. పోలీసులకే ముచ్చెమటలు పట్టించాడు.. రాత్రంతా కంటిమీద కునుకు లేకుండా చేశాడు..!
Follow us

|

Updated on: Dec 13, 2020 | 8:09 PM

ఎవరివైనా వస్తువులు దోపిడీకి గురైతే నేరుగా పోలీసులను ఆశ్రయిస్తారు. మరి పోలీసులకు చెందిన వస్తువులే పోతే..? చిన్న చిన్న వస్తువులు కాకుండా ఏకంగా వాహనాలే చోరీకి గురైతే..? పోలీసులు ఎవరిని ఆశ్రయిస్తారు? వారి పరిస్థితి ఎలా ఉంటుంది..? దీనికి నిదర్శనమైన ఘటనే వరంగల్‌లో చోటు చేసుకుంది.

వరంగల్‌ జిల్లాలో ఓ ఆకతాయి రెచ్చిపోయాడు. ఏకంగా పోలీసులకే ముచ్చెమటలు పట్టించాడు. రాత్రంతా వారికి కంటిమీద కునుకు లేకుండా చేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ట్రాఫిక్ ఎస్ఐ సమ్మయ్య తన సిబ్బందితో కలిసి శనివారం రాత్రి కాజీపేట చౌరస్తాలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. అయితే, మందు బాబులను పట్టుకోవడం కోసం పోలీస్ జీపును కాస్త దూరంలో పెట్టారు. ఆసమయంలో జీపు తాళం చెవిని కూడా దానికే ఉంచారు. ఎస్ఐ సహా సిబ్బంది మొత్తం వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. ఇంతలో ఓ ఆకతాయి గుట్టుచప్పుడు కాకుండా వచ్చి.. ఖాకీలకు ఝలక్ ఇస్తూ జీపును అపహరించుకుపోయాడు. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్‌ టెస్ట్‌లో తలమునకలైన పోలీసులు ఈ చోరీని గుర్తించలేదు. కాసేపటి తరువాత జీపు కనిపించకపోవడం ఎస్ఐ సహా సిబ్బంది కంగుతిన్నారు. జీపులో ఎస్ఐ టోపీ, ప్రభుత్వ ఫోన్‌తో పాటు ఇతర వస్తువులు ఉండటంతో హడలిపోయారు. వెంటనే జీపును వెతుక్కుంటూ మరో వాహనంలో గాలింపు చేపట్టారు. కాజీపేట సివిల్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా రాత్రంతా జీపు కోసం వెతికారు. చివరకు అపహరణకు గురైన జీపు కోమటిపల్లి తండా సమీపంలో గుర్తించారు. జీపును దొంగిలించిన వ్యక్తి కూడా అక్కడే ఉండటంతో అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ వ్యక్తి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని పోలీసులు గుర్తించారు.

కాగా, పోలీస్ జీపును అపహరించిన వ్యక్తి జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామానికి చెందిన భిక్షపతిగా పోలీసులు గుర్తించారు. భిక్షపతి గతంలో ఆర్టీసీలో కాంట్రాక్ట్ డ్రైవర్‌గా విధిలు నిర్వర్తించాడు. అతని ప్రవర్తన సరిగా లేకపోవడంతో విధుల్లోంచి తొలగించారు. కాగా, పాలకుర్తి మండలంలోని ముత్తారం గ్రామానికి చెందిన ఓ అమ్మాయితో భిక్షపతికి వివాహం అవగా, కుటుంబ కలహాల వల్ల 8 సంవత్సరాల క్రితం విడిపోయారు. అప్పటి నుంచి భిక్షపతి సైకోలా ప్రవర్తిస్తుంటాడని అతని తల్లిదండ్రులు చెబుతున్నారు. మొత్తం మీద జీపు చోరీ కేసులో భిక్షపతిపై పోలీసులు కేసు నమోదు చేశారు.