మవోయిస్టుల అంతానికి పోలీసుల పంతం

పచ్చని పల్లెల్లో అలజడి మొదలైంది. ప్రశాంతంగా ఉన్న అటవీ ప్రాంతం ఒక్కసారిగా మారిపోయింది. ఏజెన్సీ నివురుగప్పిన నిప్పులా మారింది..

మవోయిస్టుల అంతానికి పోలీసుల పంతం
Follow us

|

Updated on: Oct 09, 2020 | 8:31 AM

భీకర పోరుకు బారీ వ్యూహం సిద్ధమవుతోంది.. మావోలను మట్టికరిపించేందుకు త్రిముఖ వ్యూహం అమలుకు కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు సన్నద్ధమవుతున్నాయా…? అసలు స్కెచ్ ఏంటీ..? ఎవరి కెప్టెన్సీలో మావోల ఏరివేతకు వ్యూహాలు రచిస్తున్నారు..? ఐదు రాష్ట్రాల పోలీస్ ఉన్నతాధికారుల భేటీ వెనుక ఆంతర్యమేంటీ…? ఏజెన్సీలో ఏం జరుగుతోంది..? ఏం జరగబోతుంది..?

పచ్చని పల్లెల్లో అలజడి మొదలైంది. ప్రశాంతంగా ఉన్న అటవీ ప్రాంతం ఒక్కసారిగా మారిపోయింది. ఏజెన్సీ నివురుగప్పిన నిప్పులా మారింది.. పట్టుకోసం పాకులాడుతున్న మావోయిస్టులు కొత్త చేరికలతో నూతన ఉత్సాహాన్ని నింపు కుంటుంటే.. మావోలను పూర్తిగా నామరూపాలు లేకుండా చేసేందుకు కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు బారీ వ్యూహ రచనకు సిద్ధమైనట్లు సమాచారం. ఇందులో భాగంగానే అన్ని రాష్ట్రాలను సమన్వయం చేస్తూ మావోల ఏరివేతకు సీఆర్పీఎఫ్ డీజీ విజయ్ కుమార్ కెప్టెన్సీ వహించనున్నట్లు తెలుస్తుంది.. గంధపు చక్కల స్మగ్లర్ వీరప్పన్ ను పక్కా స్కెచ్ వేసి మట్టుబెట్టిన విజయ్ కుమార్ ఇప్పుడు మావోయిస్టు అగ్రనేతలే టార్గెట్ గా త్రిముఖ వ్యూహంతో తన ఫ్లాన్ అమలుచేస్తున్నట్లు పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి..

తన వ్యూహరచన అమలులో భాగంగా మూడు రోజుల క్రితం రాష్ట్రంలోనే అత్యంత నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన చెత్తిస్ గఢ్- తెలంగాణ సరిహద్దులోని ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ స్టేషన్లో అత్యవసర భేటీ అయినట్లు సమాచారం.. ఆగమేఘాల మీద హెలికాప్టర్లలో వాలిపోయారు.. ఈ సమావేశంలో తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు, అయిదు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు, ఇంటలిజెన్స్ విభాగం అధికారులు పాల్గొన్నారు.. ఈ సమీక్షలో మావోయిస్టులను మట్టికరిపించే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట్లు సమాచారం..

ఈ అత్యవసర సమావేశం దాదాపు ఐదు గంటలపాటు సాగింది. ఇందులో పలు కీలక విషయాలు చర్చకు వచ్చనట్లు సమాచారం…కొద్ది రోజుల క్రితం పోలీస్ డ్రోన్ కెమెరాకు చిక్కిన దృశ్యాల ఆధారంగా మావోయిస్టులు పెద్ద సంఖ్యలో మహారాష్ట్ర, చత్తిస్ గఢ్ నుండి తెలంగాణ వైపు వచ్చినట్లు భావిస్తున్నారు.. ఈ నేపథ్యంలో ముఖ్యంగా మావోయిస్టులకు ఆశ్రయం కల్పించే గిరిజన తండాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.. ఇన్ఫర్మేషన్ వ్యవస్థను అప్రమత్తం చేయడం తోపాటు, టెక్నాలజీ ఆధారంగా కీలకనేతల సమాచారం సేకరించి వారిని మట్టుబెట్టడానికి త్రిముక వ్యూహం అమలు చేయనున్నట్లు తెలుస్తోంది..

ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో నాలుగు ఎన్ కౌంటర్లు జరిగాయి.. ఎనిమిది మంది మావోయిస్టులు ఈ ఎన్ కౌంటర్ల లో మృతి చెందారు.. మృతులంతా చోటామోటా దళ సభ్యులే.. అగ్రనేతలే టార్గెట్ గా పోలీస్ బలగాలు రంగంలోకి దిగినప్పటికీ వారు తప్పించుకు పోతున్నారు.. పక్కా సమాచారంతో మెరుపు దాడులు చేసినప్పటికీ పోలీసుల టార్గెట్ గురి తప్పుతుంది..

ఇదిలా ఉంటే మావోయిస్టులు చాపకింద నీరులా విస్తరిస్తున్నారు.. ఈ మధ్యకాలంలో కొత్త రిక్రూట్మెంట్ పై దృష్టి సారించనట్లు సమాచారం… ఈ నేపథ్యంలో కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు మావోలను మరింత పకడ్బందీగా ఎదుర్కొనేందుకు పక్కా స్కెచ్ వేశాయి.. అయితే, తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలను పసిగట్టడంలో…వారిని మట్టుబెట్టడంలో తెలంగాణ పోలీసులు దాదాపుగా సఫలీకృతులవుతున్నారు.. నేరుగా డీజీపీ, వరంగల్- కరీంనగర్ రేంజ్ ఐజీ, డీఐజీలు ఏజెన్సీలో తిష్ఠవేసి మావోయిస్టులను మట్టు బెట్టడంలో వారి వ్యూహాలు అమలుచేస్తున్నారు.. తెలంగాణ పోలీసులు అమలుచేస్తున్న వ్యూహాలనే చత్తిస్ గఢ్, మహారాష్ట్ర,ఒరిస్సా రాష్ట్రాల లో కూడా అమలు పరిచేందుకు సీఆర్పీఎఫ్ డీజీ వ్యూహాలు రచిస్తున్నారని మరో చర్చ జరుగుతుంది..

అయితే, వరంగల్- కరీంనగర్ – ఖమ్మం ఏజెన్సీలో మావోయిస్టులను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న పోలీసులు… పక్కా సమాచారంతో మెరుపు దాడులు చేస్తున్నప్పటికీ అగ్రనేతలు తప్పించుకుంటు న్నారని.. ఏజెన్సీలో పోలీస్ బలగాలు నిర్విరామంగా కూంబింగ్ నిర్వహిస్తూ మావోల వేటలో శ్రమిస్తున్నాయంటున్నారు పోలీసు ఉన్నతాధికారులు. మొత్తంమీద తుఫానుకు ముందు ప్రశాంత వాతావరణం లా ఏజెన్సీ మొత్తం నీవురుగప్పిన నిప్పులా మారింది.. దండకారణ్యంలో యుద్ధ మేఘాలు అలముకున్నాయి.. ఏ క్షణాన ఏం జరుగుతోందో అర్థంకాక మారుమూల గ్రామాల ప్రజలు మాత్రం భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు.