కబడ్డీ కోర్టులో షాకింగ్ ఘటన.. కళ్లముందే కుప్పకూలిన ఆటగాడు.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో

కబడ్డీ పోటీలు ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలిగొంది. ఈ హృదయవిధాకర ఘటన చత్తీస్‌గడ్‌ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

  • Balaraju Goud
  • Publish Date - 9:05 pm, Thu, 21 January 21
కబడ్డీ కోర్టులో షాకింగ్ ఘటన.. కళ్లముందే కుప్పకూలిన ఆటగాడు.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో

Man dies during kabaddi : మృత్యువు ఏవైపు నుంచి ముంచుకొస్తుందో ఎవరికీ తెలియదు. కబడ్డీ పోటీలు ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలిగొంది. ఈ హృదయవిధాకర ఘటన చత్తీస్‌గడ్‌ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ధమ్తారి జిల్లాలోని కోకాడి గ్రామంలో నివసించే నరేంద్ర సాహు(20) అనే యువకుడు స్థానికంగా నిర్వహించిన కబడ్డీ పోటీల్లో పాల్గొన్నాడు. ఆటలో కూతకు వెళ్లిన అతడిని ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు ఒడిసిపట్టుకొని కింద పడేశారు. దీంతో అతడు అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన అతన్ని పైకి లేపేందుకు తోటి ఆటగాళ్లు ప్రయత్నించారు. అయితే, అతను అప్పటికే మృత్యువాతపడ్డాడని వైద్యులు నిర్ధారించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఒకరు సోషల్‌ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త ఇప్పుడు వైరల్‌గా మారింది.

ప్లేగ్రౌండ్‌లో కుప్పకూలిన సాహును టోర్నమెంట్ నిర్వహకులు హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే, అతడు అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రాధమిక విచారణలో గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోందని, పోస్టుమార్టం నివేదిక వచ్చాక వివరాలు వెల్లడిస్తామని స్థానిక పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.