వెయ్యి డిపాజిట్‌కు పదివేల రుణం.. నిండా ముంచిన వైనం

సేవ ముసుగులో.. కుచ్చుటోపీ! ఇలాంటివి మనం తరచూ వింటూ వుంటాం... పేపర్లలో చూస్తూ వుంటాం. అయినా మళ్ళీ మళ్ళీ మోసపోతూ వుంటాం. తాజాగా కేబీ ఫౌండేషన్‌ పేరుతో కోట్లలో మోసం చేసిన విషయమొకటి...

  • Rajesh Sharma
  • Publish Date - 6:40 pm, Thu, 24 September 20
వెయ్యి డిపాజిట్‌కు పదివేల రుణం.. నిండా ముంచిన వైనం

సేవ ముసుగులో.. కుచ్చుటోపీ! ఇలాంటివి మనం తరచూ వింటూ వుంటాం… పేపర్లలో చూస్తూ వుంటాం. అయినా మళ్ళీ మళ్ళీ మోసపోతూ వుంటాం. తాజాగా కేబీ ఫౌండేషన్‌ పేరుతో కోట్లలో మోసం చేసిన విషయమొకటి వెలుగులోకి వచ్చింది కృష్ణా జిల్లాలో.

కైకలూరు టౌన్ పోలీసు స్టేషన్‌లో కే.వీరాస్వామి ఇచ్చిన ఫిర్యాదుతో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ముఖ్యమంత్రి జగన్ బాటలో నడుస్తున్నామంటూ సేవా కార్యక్రమాల పేరుతో కైకలూరు కేంద్రంగా చైన్ లింక్ ద్వారా అమాయక ప్రజలకు కోట్లలో కుచ్చు టోపి పెట్టిన ఘరానా మోసగాళ్ల కథ ఇది.

జగనన్న స్ఫూర్తితో కిరణన్న నడుస్తాడంటూ సీఎం ఫొటోలతో బ్యానర్లు ఏర్పాటు చేసి, లాక్‌డౌన్‌ సమయంలో కేబీ ఫౌండేషన్‌ పేరుతో పేదలకు బియ్యం పంపిణీ, గర్భిణీలకు సీమంతాలు, పిల్లల ఓణీల ఫంక్షన్ల వంటివి నిర్వహించారు. ఆ పరిచయాలతో తమ ఫౌండేషన్‌లో వేయి రూపాయలు డిపాజిట్‌ చేస్తే పది వేల రూపాయలు వడ్డీలేని రుణం ఇస్తామంటూ ప్రజల నుంచి కోట్లలో వసూలు చేశారు. ఆ తర్వాత కుచ్చుటోపీ పెట్టారు.

తాము జరపాలనుకున్న వేడుకలకు అనువైన ఇళ్ల వివరాలను వాలంటీర్ల ద్వారా సేకరించిన ఫౌండేషన్‌ నిర్వాహకులు.. ఆ తర్వాత తెలివిగా కోట్లు కొల్లగొట్టారు. కైకలూరు మండలం వేమవరప్పాడుకు చెందిన బొడ్డు కిరణ్‌కుమార్‌ హైదరాబాద్‌లో ఉంటూ, కేబీ ఫౌండేషన్‌ పేరుతో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ప్రచారం చేసుకున్నారు.

ఆ ఫౌండేషన్‌ పేరుతోనే లాక్‌డౌన్‌లో కైకలూరులోని బంధువుల ద్వారా పేదలకు బియ్యం, వారి ఇళ్లల్లో జరిగే సీమంతాలు, ఓణీల వేడుకలకు వెళ్లి వస్త్రాలను, గాజులను ఇచ్చేవారు. తాజాగా వీరాస్వామి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగడంతో మోసగాళ్ళు పరారయ్యారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.