మరో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఆన్‌లైన్ గేమ్.. చేసిన అప్పులు తీర్చలేక సీఏ విద్యార్థి ఆత్మహత్య

ఆన్‌లైన్‌ గేమ్స్‌కు మరో నిండు ప్రాణం బలైంది. ఉన్నత చదువుల్లో రాణించిన ఓ విద్యార్థి బ్రతుకు జీవితంలో ఓడిపోయాడు.

మరో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఆన్‌లైన్ గేమ్.. చేసిన అప్పులు తీర్చలేక సీఏ విద్యార్థి ఆత్మహత్య
Follow us

|

Updated on: Dec 29, 2020 | 7:12 AM

Student Commits Suicide: ఆన్‌లైన్‌ గేమ్స్‌కు మరో నిండు ప్రాణం బలైంది. ఉన్నత చదువుల్లో రాణించిన ఓ విద్యార్థి బ్రతుకు జీవితంలో ఓడిపోయాడు. మరికొద్ది రోజుల్లో సీఏ పూర్తి చేసి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాల్సిన ఆ విద్యార్థి జీవితాన్ని ఆన్‌లైన్‌ రమ్మీ గేమ్ మిగేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లాలోని సీసీసీ నస్పూర్‌కు చెందిన సీపతి అభిలాష్‌ (25) సీఏ చదువుతున్నాడు. అభిలాష్‌ తండ్రి మరణించడంతో తల్లి కుటుంబాన్ని నడిపిస్తోంది. తల్లి లలిత, సోదరుడు ఆకాశ్‌ మొబైల్‌ క్యాంటిన్‌ నడిపిస్తూ జీవిస్తున్నారు. అయితే, గత కొద్దిరోజులుగా ఆన్‌లైన్‌లో రమ్మి ఆటకు అభిలాష్ అలవాటుపడ్డాడు. తన వద్ద ఉన్న డబ్బులతో పాటు కుటుంబసభ్యులకు చెందిన సొమ్మును సైతం తగలేశాడు. అంతేకాదు, తెలిసినవారి వద్ద లక్షల రూపాయలు అప్పుచేశాడు. ఈ పరిస్థితుల్లో తీవ్ర మానసిక ఆందోళనకు గురైన అభిలాష్ ఇరవై రోజుల కిందట ఎవరికీ కనిపించకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు.

కాగా, ఆదివారం తిరిగి ఇంటికి చేరుకున్నాడు. చేసిన అప్పులు తిరిగి చెల్లించాలంటూ తీవ్ర ఒత్తిడి పెరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థి.. మంచిర్యాలలోని సాయికుంట.. గోదావరి తీరంలో విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అతని చేతిపై సోదరుడు ఆకాశ్‌ సెల్‌ నంబరు రాసి ఉండటంతో పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.