గంగమ్మ నగలతో దొంగ రుణాలు.. కుప్పంలో స్కామ్

దేవాలయం కలెక్షన్లను, ఆ గుడిలోని దేవత నగలను బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఏకంగా వాటిపైనే ఫోర్జరీ సంతకాలతో లోన్లు తీసుకొని, ఎగ్గొట్టిన అక్రమార్కుల చేతివాటం చిత్తూరు జిల్లాలో వెలుగుచూసింది. కుప్పం నియోజకవర్గంలోని టౌన్ బ్యాంకులో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.

గంగమ్మ నగలతో దొంగ రుణాలు.. కుప్పంలో స్కామ్
Follow us

|

Updated on: Apr 28, 2020 | 1:59 PM

దేవాలయం కలెక్షన్లను, ఆ గుడిలోని దేవత నగలను బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఏకంగా వాటిపైనే ఫోర్జరీ సంతకాలతో లోన్లు తీసుకొని, ఎగ్గొట్టిన అక్రమార్కుల చేతివాటం చిత్తూరు జిల్లాలో వెలుగుచూసింది. కుప్పం నియోజకవర్గంలోని టౌన్ బ్యాంకులో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఆలయ పాలకవర్గం ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.

కుప్పంలోని గంగమ్మ ఆలయం పేరుతో స్థానిక టౌన్ బ్యాంకులో అకౌంట్ ఉంది. గంగమ్మ ఆలయం పేరిట వచ్చిన విరాళాలు, అమ్మవారికి చేయించిన నగలను టౌన్ బ్యాంకు అకౌంటులో డిపాజిట్ చేశారు. అయితే గంగమ్మ దేవాలయం డిపాజిట్లను బంగారు నగలను తనఖా పెట్టి 10 లక్షల రూపాయల రుణాలు కొట్టేసారు బ్యాంకు సిబ్బంది. 10 లక్షల రూపాయల రుణాలు ఆలయం అకౌంట్ పేరుతో ఉండడాన్ని గుర్తించిన దేవాలయం పాలకవర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఫోర్జరీ సంతకాలతో టౌన్ బ్యాంకు సిబ్బంది 10 లక్షల రూపాయల రుణం తీసుకొని నిధులను స్వాహా చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. బంగారు నగలపై రుణాల పేరిట సుమారు కోటి రూపాయలు కొట్టేసిన ఉదంతం ఇదే బ్యాంకులో ఇటీవల బయటపడింది. తాజాగా గంగమ్మ ఆలయానికి సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్లు, నగలపై రుణాలు తీసుకున్న ఉదంతాన్ని టెంపుల్ కమిటీ గుర్తించి ఫిర్యాదు చేయడంతో కుంభకోణం వెలుగు చూసింది. మొత్తం టౌన్ బ్యాంకు వ్యవహారాలపై దర్యాప్తు చేసేందుకు రంగంలోకి దిగారు స్థానిక పోలీసులు.