రాజకీయ నాయకులకు సీపీ సజ్జనార్ విజ్ఞప్తి.. ఇన్ని రోజులు సహకరించారు.. ఇప్పుడు కూడా సహకరించండి..

జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా సైబరాబాద్ పరిధిలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు.

రాజకీయ నాయకులకు సీపీ సజ్జనార్ విజ్ఞప్తి.. ఇన్ని రోజులు సహకరించారు.. ఇప్పుడు కూడా సహకరించండి..
Follow us

|

Updated on: Nov 30, 2020 | 5:27 PM

మంగళవారం నాడు జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా సైబరాబాద్ పరిధిలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. పోలింగ్ నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలను మీడియాకు సజ్జనార్ వివరించారు. దాదాపు 12 రోజుల నుండి పార్టీల ప్రచారం జరిగిందని, ఇన్ని రోజులు సైబరాబాద్ పోలీసులకు సహకరించిన రాజకీయ నాయకులందరికీ సీపీ ధన్యవాదాలు తెలిపారు. పోలింగ్ రోజు కూడా ఇలాగే పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్నికల గైడ్‌లైన్స్‌ని ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వాలని సూచించారు. ఎలక్షన్ ఏజెంట్‌కి ప్రత్యేక వాహనం అనుమతి ఉండదని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. అలాగే ఓటర్లను తరలించడం చట్ట విరుద్ధం అని చెప్పిన ఆయన.. ఎవరైనా ఓటర్లను తరలిస్తే సంబంధిత వాహనాలను సీజ్ చేస్తామని తేల్చి చెప్పారు.

ఇదిలాఉండగా, సైబరాబాద్ పరిధిలో మొత్తం 177 రూట్ మొబైల్స్‌తో నిరంతరం మానిటరింగ్ చేస్తున్నామని సీపీ సజ్జనార్ వివరించారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌కు జియో ట్యాగింగ్ చేశామన్నారు. లక్ష సిసి కెమెరాలతో సమస్యాత్మక ప్రాంతాలను మానిటరింగ్ చేస్తున్నామని తెలిపారు. అలాగే 13500 స్పెషల్ ఫోర్స్‌, 10 మంది డీసీపీలు, 10 మంది అడిషనల్ డీసీపీలతో కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. 15 బార్డర్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. ఇక హైపర్ సెన్సిటివ్ ప్రాంతాల్లో 73 పికెట్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలో భాగంగా 587 లైసెన్సుడ్ గన్లను డిపాజిట్ చేయించడం జరిగిందని, 369 మంది రౌడీషీటర్లను బైండోవర్ చేశామని సీపీ చెప్పారు. 250 అత్యంత సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 38 వార్డులు సమస్యాత్మక ప్రాంతాలుగా ఉన్నాయని సీపీ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు సజ్జనార్ తెలిపారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా ఉండే కంటెంట్‌ను షేర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఇక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ. 15 లక్షల విలువ చేసే 369 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని సీపీ సజ్జనార్ వెల్లడించారు.