15 కోట్ల మంది తీవ్ర పేదరికంలోకి జారుకునే ప్రమాదం

కంటికి కూడా కనిపించని కరోనా వైరస్‌ ప్రాణాలను బలితీసుకోవడమే కాదు.. భవిష్యత్తుపై తీవ్రమైన ఆందోళన కలిగిస్తుంది.. ఆ వైరస్‌ సృష్టిస్తోన్న మహా విలయం కారణంగా వచ్చే ఏడాదికి ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల మంది తీవ్ర పేదరికంలోకి వెళ్లిపోతారంటూ

15 కోట్ల మంది తీవ్ర పేదరికంలోకి జారుకునే ప్రమాదం
Follow us

|

Updated on: Oct 08, 2020 | 1:52 PM

కంటికి కూడా కనిపించని కరోనా వైరస్‌ ప్రాణాలను బలితీసుకోవడమే కాదు.. భవిష్యత్తుపై తీవ్రమైన ఆందోళన కలిగిస్తుంది.. ఆ వైరస్‌ సృష్టిస్తోన్న మహా విలయం కారణంగా వచ్చే ఏడాదికి ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల మంది తీవ్ర పేదరికంలోకి వెళ్లిపోతారంటూ ప్రపంచబ్యాంక్‌ హెచ్చరిస్తోంది.. అమెరికా వంటి అగ్రరాజ్యమే కరోనాతో కకావిలకం అయ్యింది.. ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది.. మిగతా దేశాలు కూడా అంతే! అందుకే లాక్‌డౌన్‌ను ఎక్కువ కాలం కొనసాగించకుండా నెమ్మదిగా నిబంధనలను సడలిస్తూ వస్తున్నాయి.. అన్ని రంగాలలో సాధారణ స్థితి నెలకొనేలా కృషి చేస్తున్నాయి.. ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే .. విభిన్న ఆర్ధికవ్యవస్థలను రూపొందించాల్సిన ఆవశ్యకతను వివరించింది ప్రపంచబ్యాంక్‌. వివిధ రంగాల్లో మూలధనం, శ్రమ, నైపుణ్యాలతోపాటు కొత్త కొత్త ఆవిష్కరణలతో నూతన వ్యాపార పద్ధతులను అవలంబించాలని సూచించింది. కరోనా వైరస్‌ ప్రపంచానికి సవాల్‌ విసురుతోందని, ఈ ఒక్క ఏడాదే కొత్తగా దాదాపు ఎనిమిది నుంచి 11 కోట్ల మంది తీవ్ర పేదరికంలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని వరల్డ్‌ బ్యాంక్‌ తెలిపింది. వచ్చే ఏడాది నాటికి ఈ సంఖ్య 15 కోట్లకు చేరినా ఆశ్చర్యపడాల్సిన పని లేదని చెప్పింది. ప్రపంచ జనాభాలో సుమారు 1.4 శాతం మంది తీవ్ర పేదరికంలోకి జారుకుంటారని తెలిపింది. ఇప్పటికే పేదరికంలో మగ్గిపోతున్న మధ్య ఆదాయ దేశాలకు రాబోయే రోజులు మరింత కష్టాలను కలిగిస్తాయన్న ఆందోళన వ్యక్తం చేసింది వరల్డ్‌బ్యాంక్‌. పేదరికం విషయంలో భారత్‌కు సంబంధించిన సమాచారం లేకపోవడం శోచనీయమని తెలిపింది వరల్డ్‌ బ్యాంక్‌.. నిరుపేదలు ఎక్కువగా ఉండే ఇండియాలో ఈ సమాచారం లేకపోవడం కారణంగానే ప్రస్తుత ప్రపంచ పేదరికాన్ని అంచనా వేయలేకపోతున్నామని ప్రపంచబ్యాంక్‌ స్పష్టం చేసింది. ముంబాయిలోని ధారావి మురికివాడలో కరోనా వైరస్‌ వ్యాప్తి కాకుండా అధికారులు పాటుపడ్డారంటూ వారిని ప్రశసించింది.. భారీ సంఖ్యలో కరోనా పరీక్షలను నిర్వహించడమే కాకుండా ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారని ప్రపంచబ్యాంక్‌ శ్లాఘించింది.