రూ.6 కోట్లతో పరారైన కిలాడీ జంట చిక్కింది

Couple Scam 6 Crore in Chit Business, రూ.6 కోట్లతో పరారైన కిలాడీ జంట చిక్కింది

పశ్చిమగోదావరి జిల్లాలో చిట్టీల పేరుతో పలువురిని మోసం చేసి సుమారుగా రూ.6 కోట్ల వరకు టోకరా వేసి పరారైన కిలాడీ జంట ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. వారి వద్ద నుండి 450 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు నరసాపురం డీఎస్పీ కె. నాగేశ్వరరావు తెలిపారు. కంచన రమేష్‌, దివ్య దంపతులు విలాసాలకు అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించేందుకు చిట్‌ఫండ్‌ వ్యాపారం మొదలు పెట్టారు. చీటీలతో పాటు అధిక వడ్డీలు ఆశ చూపి పలువురు నుండి కోట్లాది రూపాయలు వసూలు చేశారు. వీరిలో కొందరికి వడ్డీలు కూడా కట్టకుండా వారి పేరుపై చీటీలు కడుతున్నట్లు నమ్మించారు. ఈ విధంగా మోసాలకు పాల్పడిన వీరు..వసూలు చేసిన సొమ్ముతో జల్సాలు, విలాసవంతమైన జీవితం గడిపారు. ఆ దంపతుల విలాసవంతమైన జీవితం చూసిన స్థానికులు కోట్ల రూపాయలు వడ్డీలకు ఇవ్వడంతో పాటు బంగారు ఆభరణాలు కూడా ఇచ్చారు. చివరకు బాకీదారులను నుండి వత్తిడి పెరగడంతో పరారీ ప్లాన్‌ వేసుకున్నట్లుగా పోలీసులు తేల్చారు.  అలా పథకం ప్రకారం బంధువులు, స్నేహితుల వద్దకు వెళ్లి.. శుభకార్యానికి వెళుతున్నాము..మీ నగలు కావాలని, రాగానే ఇచ్చేస్తామని నమ్మబలికి, పలువురి నుండి విలువైన  బంగారు వస్తువులను తీసుకుని వాటిని పలు ప్రైవేట్‌ఫైనాన్స్‌ కంపెనీలలో తాకట్టు పెట్టారు. వచ్చిన లక్షలాది రూపాయలు తీసుకుని పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు, జిల్లా ఎస్పీ నవదీప్‌ సింగ్‌ గ్రావెల్‌ ఆదేశాలతో వీరిని పట్టుకునేందుకు పోలీసు బృందాలతో విస్తృత గాలింపు చేపట్టారు. చివరకు తూర్పుగోదావరి జిల్లా శివకోడులో రమేష్‌, దివ్య ఉన్నారనే పక్కా సమాచారంతో పోలీసులు ఆ కిలాడీ జంటను అదుపులోకి తీసుకున్నారు. వీరి సమీప బందువు వరద సూరజ్‌ వీరికి సహకరించినట్లుగా గుర్తించిన పోలీసులు అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టి  బాధితులకు తగిన న్యాయం చేస్తామని డీఎస్పీ నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

Couple Scam 6 Crore in Chit Business, రూ.6 కోట్లతో పరారైన కిలాడీ జంట చిక్కింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *