అభ్యంతరాలన్నీ పూర్తయిన తర్వాతే పాస్‌బుక్‌లు జారీ..!

తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ధ‌ర‌ణి పోర్ట‌ల్ ప్రారంభానికి ముహుర్తం ఖరారైంది.

  • Balaraju Goud
  • Publish Date - 3:10 pm, Tue, 27 October 20

తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ధ‌ర‌ణి పోర్ట‌ల్ ప్రారంభానికి ముహుర్తం ఖరారైన విష‌యం తెలిసిందే. ధ‌ర‌ణి పోర్ట‌ల్ ప్రారంభానికి రంగారెడ్డి జిల్లా వేదిక కానుంది. ఈ నెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి పోర్టల్ ను ప్రారంభించ‌నున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

కాగా, ఆస్తుల నమోదులో సేకరించిన వివరాలను తొలుత పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించనున్నారు. తద్వారా తప్పులు సరిదిద్దుకునే అవకాశం పౌరులకు కల్పించబోతున్నట్లు సమాచారం. అభ్యంతరాలన్నీ పూర్తయిన తర్వాతే మెరూన్‌ రంగు పాస్‌ బుక్‌లు జారీ చేయాలని భావిస్తున్నారు. పట్టణాల్లో మాత్రం దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. అధికారుల నిర్లక్ష్యంతో కొన్ని సందర్భాల్లో ఇంటి పేరు తప్పు రావడం, లింగ బేధాలు, విస్తీర్ణంలో తేడాలు వంటి తప్పులు దొర్లితే సరి చేసుకోవడానికి పౌరులు ప్రదక్షిణలు చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో పరిస్థితిని ఊహించిన ప్రభుత్వం సవరణకు అవకాశమిచ్చింది. గడువులోగా నమోదు చేయడమే లక్ష్యంగా ఆస్తుల నమోదు సర్వే సాగింది. పంచాయతీల్లో డోర్‌ లాక్డ్‌ ఇళ్లు మినహా మిగతావాటి గణన దాదాపు పూర్తయింది.

పురపాలక సంఘాల్లో 20.07 లక్షల ఆస్తులను గుర్తించగా సోమవారం నాటికి 18 లక్షల ఆస్తుల సమాచారం సేకరించారు. వర్షాలు, వరదలతో గ్రేటర్‌ హైదరాబాద్‌లో మాత్రం కాస్త అలస్యం జరుగుతుంది. కాగా, పౌరులు చాలామంది సమాచారాన్ని ధరణిలోకి ఎక్కించినా.. సాఫ్ట్‌వేర్‌ సహకరించక అరకొర వివరాలతోనే ముగించారు. విద్యుత్తు కనెక్షన్‌ నంబరు దగ్గర ఆంగ్ల అక్షరం తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైంది. ఆ అక్షరాన్ని వదిలేసి అంకెలు మాత్రమే వేయాల్సి వచ్చింది. ఫ్లాట్ల విస్తీర్ణంలో గజిబిజి నెలకొంది. కొన్ని సమయాల్లో అసలు వివరాలను నమోదు చేయడంలో సాఫ్ట్ వేర్ మొరాయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎలాంటి తప్పులు దొర్లకుండా ఖచ్చితమైన వివరాలను ధరణి సైట్ లో నమోదు చేసేందుకు ప్రభుత్వం పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపడుతోంది.