కరోనా రాకాసితో అల్లాడుతున్న బ్రిటన్ దేశానికి ఇండియా 30 లక్షల పారాసిటిమాల్ డోసులను పంపనుంది. ఈ మందుతో కూడిన విమానం ఆదివారం లండన్ వెళ్లనుంది. ఆ దేశానికి ఇది మన తొలి విడత సాయం అని ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఈ సంక్షోభ సమయంలో బ్రిటన్, భారత దేశాలు పరస్పరం చేతులు కలిపి సహకరించుకోవలసిన అవసరం ఏర్పడిందని బ్రిటన్ మంత్రి తారిఖ్ అహ్మద్ అన్నారు. మా ప్రభుత్వం తరఫున ఇండియాకు ఎంతో కృతజ్ఞత తెలుపుతున్నామన్నారు. ఇదే సమయంలో భారత్ లో చిక్కుబడిన బ్రిటిషర్లను తమ దేశానికి తరలించేందుకు తాము లండన్ లోని ఇండియన్ హైకమిషన్ అధికారులతోను, ఢిల్లీలోని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖతోను సంప్రదింపులు జరుపుతున్నామని తారిఖ్ అహ్మద్ చెప్పారు. రానున్న వారాల్లో గోవా, ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్ తదితర నగరాల్లో ఉంటున్న బ్రిటిషర్లను కొచ్చి, హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై నగరాల ద్వారా విమానాల్లో వారి స్వదేశానికి తరలించనున్నారు. కాగా.. బ్రిటన్ లో కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 8 వేలకు చేరింది. 65 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.