కరోనాతో పోరాటం చేస్తూ అమెరికాలో ఇద్దరు భారతీయ సంతతి డాక్టర్ల మృతి..!

కరోనా బారిన పడి అమెరికాలో ఇద్దరు భారతీయ సంతతి డాక్టర్లు మృతి చెందారు. క్లారా మాస్ మెడిక‌ల్ సెంట‌ర్‌లో సత్యేందర్‌ దేవ్‌ ఖన్నా(78)తో పాటు, ఆయన కుమార్తె ప్రియా ఖన్నా(43) చికిత్స తీసుకుంటూ మరణించారు

  • Tv9 Telugu
  • Publish Date - 2:42 pm, Sat, 9 May 20
కరోనాతో పోరాటం చేస్తూ అమెరికాలో ఇద్దరు భారతీయ సంతతి డాక్టర్ల మృతి..!

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విజృంభణ ఆగడం లేదు. 77వేల మంది ఈ వ్యాధితో అక్కడ మృతి చెందారు. తాజాగా న్యూజెర్సీలో ఇద్దరు భారతీయ సంతతి డాక్టర్లు మృతి చెందారు. క్లారా మాస్ మెడిక‌ల్ సెంట‌ర్‌లో సత్యేందర్‌ దేవ్‌ ఖన్నా(78)తో పాటు, ఆయన కుమార్తె ప్రియా ఖన్నా(43) చికిత్స తీసుకుంటూ మరణించారు. దేవ్ ఖన్నా 35 సంవత్సరాలుగా క్లారా మాస్ మెడికల్ సెంట‌ర్‌లో పనిచేస్తున్నారు. ఈ విషయాన్ని న్యూజెర్సీ గవర్నర్‌ ఫిల్‌ మార్ఫీ సోషల్ మీడియాలో వెల్లడిస్తూ.. ‘వారి మరణ వార్త బాధాకరం. ఇతరుల కోసం వారి జీవితాలను అంకితం చేశారు’ అని ప్రశంసించారు. కాగా దశబ్దాల క్రితం అమెరికాలో వైద్యుడిగా స్థిరపడిన సత్యేందర్ దేవ్ ఖన్నా.. న్యూజెర్సీలోని పలు ఆసుపత్రులకు శస్త్ర చికిత్స విభాగానికి అధిపతిగా పని చేశారు. ఇక ఆయన కుమార్తె ప్రియా ఖన్నా కూడా ఆర్‌డబ్ల్యూజే బర్నబాస్‌ ఆరోగ్య విభాగంలో హాస్పిటల్‌ చీఫ్‌ ఆఫ్‌ రెసిడెంట్స్‌గా పనిచేసేవారు. కరోనా నుంచి ఇతరులను కాపాడేందుకు వైద్య సేవలు అందిస్తున్న క్రమంలో వారిద్దరూ ఆ మహమ్మారికి బలైపోయారు, వీరిద్దరి మరణంతో క్లారా మాస్ మెడికల్ సెంట‌ర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Read This Story Also: లాక్‌డౌన్ వేళ.. గుజరాత్‌లో పోలీసులపై రాళ్ల దాడి..