‘అప్పుల ఊబిలో ఉన్నాం…కనికరించండి’.. ప్రపంచ దేశాలకు ఇమ్రాన్ ఖాన్ మొర

'అప్పుల ఊబిలో ఉన్నాం...కనికరించండి'.. ప్రపంచ దేశాలకు ఇమ్రాన్ ఖాన్ మొర

కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించినందున తమ దేశం ఆర్థికంగా దారుణ పరిస్థితులనెదుర్కొంటోందని, అందువల్ల అప్పుల భారం నుంచి తమను విముక్తులను చేయాలని  పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్  ప్రపంచ దేశాలను, అంతర్జాతీయ ద్రవ్య సంస్థలను కోరారు.

Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Apr 13, 2020 | 4:21 PM

కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించినందున తమ దేశం ఆర్థికంగా దారుణ పరిస్థితులనెదుర్కొంటోందని, అందువల్ల అప్పుల భారం నుంచి తమను విముక్తులను చేయాలని  పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్  ప్రపంచ దేశాలను, అంతర్జాతీయ ద్రవ్య సంస్థలను కోరారు. మాలాంటి వర్ధమాన దేశాలకు మీరే దిక్కు అని చేతులెత్తి మొక్కినంత పని చేశారు. పాక్ లో 5,183 కరోనా కేసులు నమోదు కాగా.. సుమారు 90 మంది కరోనా  రోగులు మృతి చెందారు. ఇప్పటికే లాక్ డౌన్ల కారణంగా మా దేశం తీవ్ర ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అనేకమంది నిరుద్యోగులుగా మారారు. పరిశ్రమలు మూతబడ్డాయి. ప్రజలు ఆకలి చావులకు గురయ్యే ప్రమాదం ఉందని ఇమ్రాన్ ఖాన్ ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితిలోని సేవా విభాగాలు, అంతర్జాతీయ ద్రవ్య నిధి వంటి సంస్థలు ఈ తరుణంలో మా మొరను ఆలకించాలన్నారు. ఆరోగ్యం, సామాజిక రంగాల్లో మా వంటి వర్ధమాన దేశాలు తగినంతగా ఖర్చు పెట్టలేని స్థితిలో ఉన్నాయని, రుణ మాఫీ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విదేశీ సంస్థలకు పాకిస్తాన్ ప్రభుత్వం 100 బిలియన్ డాలర్ల రుణాన్ని చెల్లించవలసి ఉంది. ఇటీవలే కోటీ ఇరవై లక్షల మంది పేద కుటుంబాలకు ఆర్ధిక సాయం చేసేందుకు 900 మిలియన్ డాలర్లను వ్యయం చేసింది. కరోనా రాకాసిని ఎదుర్కోవడానికి తమకు తగినన్నినిధులను మంజూరు చేయాలనీ, తమను ఆదుకోవాలని ఇమ్రాన్ ఖాన్ అభ్యర్థించారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu