లాక్‌డౌన్‌ ఉల్లంఘిస్తూ హీరో పెళ్లి.. సర్వత్రా విమర్శలు..!

కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ను అందరూ కచ్చితంగా పాటించాలని అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తూనే ఉన్నాయి.

  • Tv9 Telugu
  • Publish Date - 5:14 pm, Fri, 17 April 20
లాక్‌డౌన్‌ ఉల్లంఘిస్తూ హీరో పెళ్లి.. సర్వత్రా విమర్శలు..!

కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ను అందరూ కచ్చితంగా పాటించాలని అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తూనే ఉన్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు ఇదే ఉత్తమ మార్గమని.. లాక్‌డౌన్‌ నియమాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కూడా వారు హెచ్చరిస్తున్నారు. అయితే ఎవరెన్ని చెబుతున్నా.. లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తున్నారు. కరోనాపై సరైన అవగాహన లేని సామాన్యులే కాదు.. అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన ప్రముఖులు సైతం లాక్‌డౌన్‌ నియమాలను తుంగలో తొక్కుతున్నారు.

కాగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు, హీరో నిఖిల్ వివాహం శుక్రవారం జరిగిన విషయం తెలిసిందే. బెంగళూరు సమీపంలోని రామనగరలోని ఫాంహౌస్‌లో ఈ వివాహం జరగ్గా.. అందులో లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లఘించారు. పెళ్లికి వచ్చిన చాలా మంది మాస్క్‌ ధరించలేదు. అంతేకాదు కనీస భౌతిక దూరాన్ని కూడా పాటించలేదు. దీంతో ఈ పెళ్లిపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

లాక్‌డౌన్ కొనసాతున్న నేపథ్యంలో అట్టహాసంగా పెళ్లి చేసుకోవడం ఏంటని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి మండిపడ్డారు. ఆదర్శంగా ఉండాల్సిన మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామి లాక్‌డౌన్ సమయంలో తమ ఇంట్లో వివాహం జరిపించడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పెళ్లిళ్లు వాయిదా వేసుకోవడం మంచిదని ఆయన సూచించారు. ఇక నిఖిల్ పెళ్లిపై బాలీవుడ్ నటి రవీనా టాండెన్ కూడా ఫైర్ అయ్యారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోన్న సమయంలో వివాహ వేడుక నిర్వహించడం ఏంటని ఆమె మండిపడ్డారు. కరోనా సంక్షోభంలో పేదలు తమ కుటుంబ సభ్యులను చేరుకోలేకపోతున్నారు. ఆకలితో అలమటిస్తున్నారు. కానీ ధనవంతులు మాత్రం నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. సామాన్యుల కష్టాలు వారికి తెలీడం లేదు అంటూ ఆమె ఫైర్ అయ్యారు. మరోవైపు సామాజిక దూరం పాటించాలన్న ప్రభుత్వ ఆదేశాలకు పాటించకుండా ఈ వివాహం జరిపించారని అధికార బీజేపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో వివాహ వేడుకపై విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప ఆదేశించారు.

Read This Story Also: దర్శకనిర్మాతలు ప్రకటించికముందే.. లీక్‌ చేసిన మెగా బ్రదర్..!