విషాదంః వెంటాడిన క‌రోనా..వారం రోజుల బాలింత మృతి

విషాదంః వెంటాడిన క‌రోనా..వారం రోజుల బాలింత మృతి

క‌రోనా నేప‌థ్యంలో జ‌రుగుతున్న కొన్ని సంఘ‌ట‌న‌లు వ‌ణుకుపుట్టిస్తున్నాయి. వైర‌స్ భ‌యంతో ప్ర‌జ‌లు హ‌డ‌లెత్తిపోతున్నారు. ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన త‌రుణంలో కొన్ని ప్రైవేటు ఆస్ప‌త్రి వ‌ర్గాలు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి...

Jyothi Gadda

|

Apr 11, 2020 | 4:36 PM

క‌రోనా భ‌యంః
క‌రోనా నేప‌థ్యంలో జ‌రుగుతున్న కొన్ని సంఘ‌ట‌న‌లు వ‌ణుకుపుట్టిస్తున్నాయి. వైర‌స్ భ‌యంతో ప్ర‌జ‌లు హ‌డ‌లెత్తిపోతున్నారు. ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన త‌రుణంలో కొన్ని ప్రైవేటు ఆస్ప‌త్రి వ‌ర్గాలు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. క‌రోనా పోలిన ల‌క్ష‌ణాలు క‌నిపించినంత‌నే వారికి కోవిడ్‌-19 వైర‌స్ సోకింద‌ని భ‌య‌పెడుతూ..వారి ప్రాణాలు హ‌రింప‌జేస్తున్నారు. హైద‌రాబాద్‌లో చోటు చేసుకున్న ఓ సంఘ‌ట‌న అంద‌రినీ క‌ల‌చి వేసింది. క‌రోనా వైర‌స్ అపోహ‌తో రోజుల బాలింత అత్యంత ద‌య‌నీయ స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. వివ‌రాల్లోకి వెళితే..
క‌రోనా ల‌క్ష‌ణాలుః
న‌గ‌ర శివారు కీస‌ర స‌మీపంలో నివ‌సిస్తున్న ర‌ఫియా బేగం అనే మ‌హిళ  స్థానికంగా ఉన్న‌ ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో ఏప్రిల్ 2 మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. అప్పుడు త‌ల్లిబిడ్డా క్షేమంగానే ఉన్నారు. ఆ త‌ర్వాత ఏప్రిల్ 6న ఆమెకు ఊపిరితిత్తులు, గుండెకు సంబంధించిన‌ స‌మ‌స్య ఉన్న‌ట్లుగా ఆమెకు డెలీవ‌రి చేసిన వైద్యులు గుర్తించారు. అనంత‌రం ఏప్రిల్ 8న ఆమెను ఆస్ప‌త్రి నుంచి డిశార్చి చేశారు. ఈ క్ర‌మంలోనే ఆమెకు ద‌గ్గు, ఆయాసం, ఊపిరి తీసుకోవ‌టం క‌ష్టంగా ఉండ‌టంతో అక్క‌డ్నుంచి గాంధీ ఆస్ప‌త్రికి వెళ్లారు. ర‌ఫీయాను ప‌రీక్షించిన వైద్యులు ఆమె రిపోర్ట్స్‌ని ప‌రిశీలించారు. కానీ, అక్క‌డ క‌రోనా వైర‌స్ పెషేంట్లు ఎక్కువ‌గా ఉండ‌టంతో..కేవ‌లం పాజిటివ్ కేసుల‌కు మాత్ర‌మే ట్రీట్ చేస్తున్నామ‌ని చెప్పారు. ర‌ఫియా బాలింత  కావ‌టంతో ఆమెను మ‌రో ఆస్ప‌త్రికి వెళ్లాల‌ని గాంధీ వైద్యులు సూచించారు.
వైద్యుల నిర్ల‌క్ష్యంః
ర‌ఫియాను..ఆమె భ‌ర్త‌, కుటుంబ స‌భ్యులు క‌లిసి గాంధీ ఆస్ప‌త్రి నుంచి ఉస్మానియాకు తీసుకువెళ్లారు. అక్క‌డ కూడా సేమ్ సీన్ ఎదురైంది. దీంతో వారు మ‌రో ప్రైవేట్ ఆస్ప‌త్రిని ఆశ్ర‌యించారు. అక్క‌డ ఆమెను ప‌రీక్షించిన ప్రైవేట్ ఆస్ప‌త్రి సిబ్బంది..త‌న‌కు క‌రోనా వైర‌స్ సోకిన‌ట్లుగా భావించి తిరిగి గాంధీకి వెళ్ల‌మ‌ని చెప్పారు. ఇలా.. గాంధీ ఆస్ప‌త్రికి నాలుగు సార్లు, ఉస్మానియాకు రెండు సార్లు, కింగ్‌కోఠి, ఇంకా అనేక ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌కు క‌లిపి ఒక్క రోజులోనే  మొత్తం 10 ఆస్ప‌త్రుల‌కు తిరిగారు.
ఆస్ప‌త్రుల చుట్టూ చ‌క్క‌ర్లుః
ఏప్రిల్ 8న ఉద‌యం 10గంట‌ల‌కు ప్రైవేట్ ఆస్ప‌త్రి నుంచి డిశార్చి అయిన‌ ర‌ఫీయా బేగం చంటిబిడ్డ‌తో క‌లిసి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు ఆస్ప‌తుల చుట్టూ తిరుగుతూనే ఉంది. సికింద్రాబాద్‌,  మినిస్ట‌ర్స్ రోడ్‌, హైద‌ర్ గూడ‌, మెహిదీప‌ట్నంలోని ఆస్ప‌త్రుల‌ చుట్టూ చ‌క్క‌ర్లు కొడుతూనే ఉన్నారు. చివ‌ర‌కు తిరిగి ఉస్మానియా ఆస్ప‌త్రిలోని సిబ్బందితో పోరాడి మ‌రీ..ఆమెను ఆస్ప‌త్రిలో చేర్పించారు. చికిత్స మొద‌లు పెట్టిన అర్ధ‌గంట‌లోనే బాధితురాలు మృతిచెందింది. రోజంతా మృత్యువుతో పోరాడి అలిసిపోయి చివ‌ర‌కు ప్రాణాలు విడిచింది. క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌టంతో ఆమె శాంపిల్స్‌ని టెస్ట్‌కు పంపించారు. ఆమె మ‌ర‌ణానంత‌రం వ‌చ్చిన రిపోర్ట్‌లో ఆమెకు వైర‌స్ నెగేటివ్‌గా తేలింది. దీంతో ఉస్మానియా సిబ్బంది ఆమె మృత‌దేహాన్ని కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించారు.
కుటుంబ నేప‌థ్యంః న‌గ‌ర శివారు కీస‌ర స‌మీపంలో నివ‌సిస్తున్న మృతురాలి కుటుంబానికి ఎటువంటి ట్రావెల్ హిస్ట‌రీ లేదు. క‌రోనా ల‌క్ష‌ణాలున్న ఎవ‌రితోనూ సంబంధాలు లేవు. ఆమె భ‌ర్త నాగారంలో బైక్ మెకానిక్ గా ప‌నిచేస్తున్నాడు. వీరికి 9ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ క్ర‌మంలోనే నిండుగ‌ర్భిణీగా ఉన్న ర‌ఫియా.. పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన ఆరు రోజుల వ్య‌వ‌ధిలోనే క‌రోనా భ‌యం, ప్రైవేట్ ఆస్ప‌తుల నిర్ల‌క్ష్యం కార‌ణంగా ప్రాణాలు కోల్పోయింది. అనంత‌రం మృతురాలి భ‌ర్త‌, పిల్ల‌లు, కుటుంబ స‌భ్యుల‌ను రాజేంద్ర‌న‌గ‌ర్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు త‌ర‌లించారు.
నెటిజ‌న్ల ఆగ్ర‌హంః
కాగా, హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో చోటు చేసుకున్న ఈ సంఘ‌ట‌న వైర‌ల్‌గా మారింది. సోష‌ల్ మీడియా వేదిక‌గా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేట్ ఆస్ప‌త్రుల తీరుపై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. క‌రోనాపై ప్ర‌భుత్వాలు ఇంత పెద్ద ఎత్తున అవ‌గాహ‌న క‌ల్పిస్తున్న‌ప్ప‌టికీ ఇలా సంఘ‌ట‌న‌లు చోటు చేసుకోవ‌డం ప‌ట్ల నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇటువంటి సంఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా ఉండేందుకు బాధ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu