ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముస్లింల పండుగ రంజాన్ కూడా ఇదే సమయంలో వస్తుండటంతో.. కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఓ ప్రకటన విడుదల చేశారు. రంజాన్ వేళలో కూడా ప్రజలంతా లాక్డౌన్ ఆదేశాలను పాటించాలని.. సోషల్ డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించాలన్నారు. అంతేకాదు.. ప్రార్ధనలు కూడా ఇళ్లలోనే చేసుకోవాలని.. మతపరమైన ఆచారాలన్నింటిని కూడా ఇంట్లోనే చేసుకోవాలన్నారు. దేశంలోని స్టేట్ వక్ఫ్ బోర్డుల నియంత్రణ సంస్థ అయిన సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ చైర్మన్గా కూడా నఖ్వి బాధ్యతలు చేపడుతున్నారు. దేశంలోని ఏడు లక్షలకు పైగా రిజిస్టర్ అయిన మసీదులు, ఈద్గాలు, దర్గాలు.. లాంటి ఇతర మత సంస్థలన్నీ ఈ స్టేట్ వక్ఫ్ బోర్డుల కిందకు వస్తాయని నఖ్వి తెలిపారు.
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతోందని.. ఈ నేపథ్యంలోనే రంజాన్ మాసం వస్తుండటంతో.. ప్రజలంతా.. లాక్డౌన్ పాటిస్తూ.. సోషల్ డిస్టెన్స్ పాటించేలా చూడాలని.. వివిధ మతపెద్దల్ని..అధికారుల్ని, స్టేట్ వక్ఫ్ బోర్డుల ఆఫీసు బేరర్లనందర్నీ కోరినట్లు తెలిపారు. ఇళ్లలోనే ఉంటూ రంజాన్ వేడుకలు జరుపుకునేలా.. ఖచ్చితంగా చూస్తామని మతపెద్దలంతా ఇప్పటికే హామీ ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. పెద్ద నష్టం జరుగుతుందని.. కరోనాను తరిమికొట్టేంత వరకు అధికార యంత్రాగం ఎప్పటికప్పుడు ఇస్తున్న ఆదేశాలను విధిగా పాటించాలని అన్నారు.