క‌రోనా ఎఫెక్ట్‌: క్వారంటైన్‌లో వ్యక్తి మృతి.. అధికారుల స‌మ‌క్షంలో అంత్య‌క్రియ‌లు

నిజామాబాద్ జిల్లాలో క‌రోనా క‌ల్లోలం రేపుతోంది. ఎట్నుంచి మ‌హ‌మ్మారి విరుచుకుప‌డుతుందోన‌ని జిల్లావాసులు హ‌డ‌లెత్తిపోతున్నారు. ఈ క్ర‌మంలోనే హోమ్ క్వారంటైన్లో ఉన్న ఓ వ్య‌క్తి హ‌ఠాత్తుగా మ‌ర‌ణించాడు. దీంతో స్థానిక ప్ర‌జ‌లు మ‌రింత భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. పైగా మృతుడి అంత్య‌క్రియ‌ల‌ను అధికారులే ద‌గ్గ‌రుండి..క‌రోనా మృతుల‌కు చేసిన విధంగానే నిర్వ‌హించ‌టంతో మ‌రింత క‌ల‌క‌లం రేపుతోంది. పూర్తి వివ‌రాలు ప‌రిశీలించ‌గా… నిజామాబాద్ జిల్లా మోపాల్‌ మండలంలోని కంజర్‌ గ్రామానికి చెందిన 48 ఏళ్ల ఓ వ్యక్తి ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లాడు. […]

  • Jyothi Gadda
  • Publish Date - 1:49 pm, Mon, 6 April 20
క‌రోనా ఎఫెక్ట్‌: క్వారంటైన్‌లో వ్యక్తి మృతి.. అధికారుల స‌మ‌క్షంలో అంత్య‌క్రియ‌లు
నిజామాబాద్ జిల్లాలో క‌రోనా క‌ల్లోలం రేపుతోంది. ఎట్నుంచి మ‌హ‌మ్మారి విరుచుకుప‌డుతుందోన‌ని జిల్లావాసులు హ‌డ‌లెత్తిపోతున్నారు. ఈ క్ర‌మంలోనే హోమ్ క్వారంటైన్లో ఉన్న ఓ వ్య‌క్తి హ‌ఠాత్తుగా మ‌ర‌ణించాడు. దీంతో స్థానిక ప్ర‌జ‌లు మ‌రింత భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. పైగా మృతుడి అంత్య‌క్రియ‌ల‌ను అధికారులే ద‌గ్గ‌రుండి..క‌రోనా మృతుల‌కు చేసిన విధంగానే నిర్వ‌హించ‌టంతో మ‌రింత క‌ల‌క‌లం రేపుతోంది. పూర్తి వివ‌రాలు ప‌రిశీలించ‌గా…
నిజామాబాద్ జిల్లా మోపాల్‌ మండలంలోని కంజర్‌ గ్రామానికి చెందిన 48 ఏళ్ల ఓ వ్యక్తి ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లాడు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో మార్చి 23న స్వగ్రామమైన కంజర్‌కు తిరిగి వచ్చాడు. అతడు గ్రామానికి చేరుకున్నాడనే విషయం తెలుసుకున్న అధికారులు అతడి ఇంటికి వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించారు. 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. నాటి నుంచి వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు రోజూ వచ్చి అతడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
ఈ క్రమంలో ఏప్రిల్ 4న ఉదయం బాధిత వ్యక్తి తనకు ఛాతీలో నొప్పి వస్తుందని ఇంటికి వచ్చిన వైద్య సిబ్బందితో చెప్పాడు. వారు అందుకు కొన్ని మాత్రలను అందజేసి వెళ్లిపోయారు. అదే రోజు అర్ధరాత్రి తర్వాత అతడు గుండెపోటుతో మరణించాడు. అతడికి విధించిన 14 రోజుల హోం క్వారంటైన్‌ గడువు ఆదివారంతో ముగుస్తుందనగా మృతి చెందాడు. అయితే.. దుబాయ్ నుంచి వచ్చిన నాటి నుంచి అతడు క్వారంటైన్‌లో ఉండటం.. అకస్మాత్తుగా మరణించడంతో కరోనా సోకి మృతి చెంది ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు అతడి మృతదేహాన్ని కవర్లతో చుట్టి, రసాయనాలు చల్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఇది గ్రామస్థులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. అయితే.. అతడు గుండెపోటుతోనే మృతి చెందాడని వైద్యాధికారి డాక్టర్‌ నవీన్‌ తెలిపారు. రోజూ వైద్య సిబ్బంది ఆయన ఆరోగ్య పరిస్థితిని పరీక్షించే వారని.. ఎలాంటి కరోనా లక్షణాలు బయటపడలేదని స్పష్టం చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం.. అతడు హోం క్వారంటైన్‌లో ఉండటం వల్ల కరోనా సోకిన వారికి ఎలాగైతే అంత్యక్రియలు నిర్వహిస్తారో అలాగే పూర్తి చేశామని డాక్టర్ నవీన్ వివరించారు. అధికారుల ఆదేశాల ప్రకారం కుటుంబ సభ్యుల నుంచి కూడా నమూనాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. బాధిత వ్యక్తికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.