ప్రపంచ దేశాలన్నింటిని కరోనా మహమ్మారి గజగజ వణికిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వైరస్ సోకిన వారి సంఖ్య నలభై లక్షలు దాటింది. వీరిలో దాదాపు రెండున్నర లక్షలకు పైగా ప్రాణాలు కోల్పోగా.. మరో పన్నెండు లక్షల మందికి పైగా కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే కరోనా విషయంలో ఆలస్యంగా చర్యలు ప్రారంభించిన రష్యా.. తీవ్రంగా నష్టపోతున్నట్లు తెలుస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు రష్యాలో వేలల్లో నమోదవుతున్నాయి. ఇప్పటికే రెండు లక్షల మార్క్‌ను దాటేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 11,012 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,09,668కు చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 88 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనా మహమ్మారితో మరణించిన వారి సంఖ్య 1,915కి చేరుకుంది.
కాగా.. దేశ రాజధాని మాస్కో నగరంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ప్రస్తుతం రష్యా అత్యధికంగా కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో ఐదో స్థానంలో నిలిచిందంటే అక్కడి పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు.