సోనీ, నైక్, ఆపిల్ సంస్థలకు తాళం..కారణం ఇదే..

అగ్రరాజ్యం అమెరికాలోనూ కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో లండన్‌లోని తమ ప్రధాన కార్యాలయాలను నైక్, సోని పిక్చర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కంపెనీలు...

సోనీ, నైక్, ఆపిల్ సంస్థలకు తాళం..కారణం ఇదే..
Follow us

|

Updated on: Mar 05, 2020 | 6:17 PM

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. వరల్డ్‌ వైడ్‌గా 95వేల మందికి పైగా ఈ ప్రాణంతక మహమ్మారి బారిన పడ్డారు. మొత్తం 3,283మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్‌ పుట్టిన చైనాలో ఇప్పటివరకు 3,012మంది మృతి చెందారు. మరో 80 వేల మందికి పైగా వైరస్‌ సోకినట్లు గుర్తించారు. ఐతే చైనాలో కాస్త శాంతించిన కోవిడ్‌..చైనాయేతర దేశాలను కబళిస్తోంది. ఇటలీలో 107 మంది, ఇరాన్‌లో 92 మంది కరోనా కాటుకు బలయ్యారు. సౌత్‌ కొరియాలో మృతుల సంఖ్య 35కు చేరింది.

ఇక అగ్రరాజ్యం అమెరికాలోనూ కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. 129 మందికి కోవిడ్‌ సోకగా..ఇప్పటివరకు 11మంది మృతి చెందారు. జపాన్‌లో ఆరుగురు, ఫ్రాన్స్‌లో నలుగురు, స్పెయిన్‌లో ఒకరు హాంకాంగ్‌లో ఇద్దరిని బలి తీసుకుంది ఈ ప్రాణాంతక మహమ్మారి. ఇక అర్జెంటీనాలో తొలి కేసు నమోదైంది. బ్రిటన్‌లో బుధవారం ఒక్క రోజే 36 కరోనా (కొవిడ్‌–19) వైరస్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో అక్కడ ఇప్పటివరకు వైరస్‌ బాధితుల సంఖ్య 87కు పెరిగింది. అత్యంత ప్రమాదకరమైన ఈ వ్యాధి వల్ల మృత్యువాత పడే అవకాశం ఉందంటూ ఇంగ్లండ్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ క్రిస్‌ విట్టీ గురువారం దేశ పౌరులను హెచ్చరించారు. వైరస్‌ విస్తరించకుండా సరైన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ నేపథ్యంలో లండన్‌లోని తమ ప్రధాన కార్యాలయాలను నైక్, సోని పిక్చర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కంపెనీలు మూసివేశాయి. ఇంటి నుంచి పనిచేయాల్సిందిగా సోని కంపెనీ తమ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. బెల్‌ఫాస్ట్‌లోని ఆపిల్‌ స్టోర్‌లో ఓ ఉద్యోగికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ కావడంతో బుధవారం కార్యాలయాన్ని, ఆ కార్యాలయం ఉన్న మైఫేర్‌ భవనాన్ని పూర్తిగా శుద్ధి చేశారు. కొంతకాలంపాటు తమ స్టోర్‌ను మూసివేస్తున్నట్లు ఆపిల్‌ ప్రకటించింది. లండన్‌లోని డిలాయిట్‌ ఉద్యోగికి, గోల్డ్‌స్మిత్స్‌ యూనివర్శిటీలో ఓ విద్యార్థికి కరోనా వైరస్‌ సోకినట్లు సమాచారం. ఎవరికైనా కరోనా వైరస్‌ లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించాలని మొదటి రోజు నుంచే సిక్‌ లీవుకు పూర్తి వేతనాలు చెల్లిస్తామని కూడా బ్రిటన్‌ అధికారులు ప్రకటించారు.