రెండో విడత కరోనా వ్యాప్తితో జర్మనీ విలవిల.. 10 లక్షల మార్క్ దాటి పాజిటివ్ కేసులు..

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారితో ప్రపంచం మొత్తం కకావికలమవుతోంది. నిత్యం లక్షలాది కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. మొదటివిడతలో విరుచుకుపడ్డ కరోనా సెకండ్ వేవ్ లోనూ అంతేస్థాయిలో విరుచుకుపడుతోంది.

  • Balaraju Goud
  • Publish Date - 7:59 pm, Fri, 27 November 20

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారితో ప్రపంచం మొత్తం కకావికలమవుతోంది. నిత్యం లక్షలాది కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. మొదటివిడతలో విరుచుకుపడ్డ కరోనా సెకండ్ వేవ్ లోనూ అంతేస్థాయిలో విరుచుకుపడుతోంది. జర్మనీలో మహమ్మారి కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. నిత్యం నమోదవుతున్న కొత్త కేసులతో సతమతమవుతోంది. తాజాగా శుక్రవారం దేశవ్యాప్తంగా కరోనా కేసులు మిలియన్ మార్క్‌ను దాటాయి. దేశవ్యాప్తంగా ఇవాళ ఒక్కరోజే 22,806 కొత్త కేసులు నమోదైనట్లు రాబర్ట్ కొచ్ ఇన్స్టిట్యూట్ పేర్కొంది. దీంతో ఇప్పటివరకు కొవిడ్ బారినపడ్డ వారి సంఖ్య 10,06,394కు చేరింది. అలాగే శుక్రవారం ఒకేరోజు 426 మంది కరోనా బారినపడి ప్రాణాలొదిలారు. దీంతో మొత్తం మరణించిన వారిసంఖ్య 15,586కు చేరింది. కొన్ని వారాల క్రితం వరకు వందల సంఖ్యలో నమోదైన పాజిటివ్ కేసులు కాస్త అమాంతం పెరిగిపోయాయి. ఇప్పుడు వేల సంఖ్యలోకి చేరడం ఆందోళన కలిగించే విషయమని ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు.

ఇక దేశంలో కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి ప్రధానంగా జనాభా అధికంగా ఉండే నార్త్ రైన్-వెస్ట్‌ఫాలియా రాష్ట్రంలోనే నాల్గో వంతు పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత బవేరియాలో 1,98,000 కేసులు, బెర్లిన్‌లో 62,000 కేసులు నమోదయ్యాయి. కాగా, దేశవ్యాప్తంగా వైరస్ తీవ్రత కొనసాగుతున్నందున కొవిడ్ ఆంక్షలను జనవరి ఆరంభం వరకు పొడిగిస్తున్నట్లు ఛాన్సలర్ ఏంజెలా మోర్కెల్ తాజాగా ప్రకటించారు. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలకు కూడా ఆంక్షల విధిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.