తల్లికి పురుడు పోసిన కూతుళ్లు..

ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా క‌రోనా వైర‌స్ క‌ల్లోల‌మే క‌నిపిస్తోంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతోంది. ఇంటి నుంచి కాలు బ‌య‌ట‌పెట్ట‌లేని దుస్థితి..ఇలాంటి క్లిష్ట ప‌రిస్థితుల‌లో ఓ నిండుగ‌ర్భిణీకి పురుటి నొప్పులు వ‌చ్చాయి...

తల్లికి పురుడు పోసిన కూతుళ్లు..
Follow us

|

Updated on: Mar 28, 2020 | 2:45 PM

ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా క‌రోనా వైర‌స్ క‌ల్లోల‌మే క‌నిపిస్తోంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతోంది. ఇంటి నుంచి కాలు బ‌య‌ట‌పెట్ట‌లేని దుస్థితి..ఇలాంటి క్లిష్ట ప‌రిస్థితుల‌లో ఓ నిండుగ‌ర్భిణీకి పురుటి నొప్పులు వ‌చ్చాయి. ఆస్ప‌త్రికి వెళితే అక్క‌డి డాక్ట‌ర్లంతా ఎవ‌రి విధుల్లో వారు బిజీగా ఉన్నారు. ఆమెను మ‌రో ఆస్ప‌త్రికి వెళ్ల‌మ‌ని చెప్పారు. దీంతో చేసేది లేక ఆమె ఇంటికి వెళిపోయింది. ఆ మ‌ర్నాడు పురిటి నొప్పులు ఎక్కువ‌య్యాయి. గత్యంతరం లేని పరిస్ధితుల్లోతన ముగ్గురు కూతుళ్ల సహాయంతో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది ఆ ఇల్లాలు. సమాచారం తెలుసుకున్న పోలీసులు త‌ల్లీ బిడ్డ‌ను మరోక ఆస్పత్రికి తరలించారు. అనంతరం వారిని ఒక ఆశ్రమానికి తరలించారు. ఈ ఘటన బెంగుళూరులో చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే….

రాయచూరు కు చెందిన లక్ష్మి కుటుంబం ఉపాధి కోసం కొన్నేళ్ల కిందట బెంగుళూరు కు వలస వచ్చింది. స్థానిక బ్యాడ‌ర‌ హళ్లిలో నివాసం ఉండేవారు. వారికి ముగ్గురు కుమార్తెలు. ముగ్గురు పిల్లల తర్వాత లక్ష్మి మరోసారి గర్భం దాల్చింది. ఆ త‌ర్వాత కుటుంబ త‌గాదాల కార‌ణంగా ఆమె భర్త త‌న‌ను వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో ఆమె రోజు వారి కూలిప‌నులు చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటోంది. ఈ క్రమంలో ఆమెకు 9 నెలలు నిండటంతో మార్చి25న పురిటి నొప్పులు ఎక్కువ‌య్యాయి. కుమార్తెలు ఆమెను బెంగళూరులోని కెంగేరి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే అక్కడ కరోనా వైరస్‌ లక్షణాలతో ఉన్నవారు చికిత్స పొందుతున్నందున ప్రసవం చేయలేమని, వేరే ఆస్పత్రికి వెళ్లాలని వైద్యులు చెప్పారు. దిక్కుతోచని స్థితిలో ల‌క్ష్మి త‌న‌ కుమార్తెలతో కలసి తిరిగి ఇంటికి వెళ్లిపోయింది.

మ‌ర్నాడు మార్చి 26న నొప్పులు అధికం కావడంతో తల్లి ఇచ్చిన సూచనలతో ముగ్గురు కుమార్తెలు ప్రసవం చేశారు. పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది లక్ష్మి. స్థానికులు స‌మాచారం మేర‌కు విషయం తెలుసుకున్న పోలీసులు…వెంటనే ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పడంతో వారిని ఓ ఆశ్రమానికి తరలించారు. ల‌క్ష్మి కుటుంబానికి స్థానికులు, పోలీసులు సాయ‌మందించారు.