Corona Vaccine Launch LIVE: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్..

| Edited By: Sanjay Kasula

Updated on: Jan 16, 2021 | 8:35 PM

Corona Vaccine Launch LIVE: అందరూ ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. కరోనా కష్టాలకు ఇవాళ్టి నుంచి విముక్తి లభిస్తోంది. భారతదేశ వ్యాప్తంగా ఇవాళ  కోవిడ్ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు.

Corona Vaccine Launch LIVE: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్..

Corona Vaccine Launch LIVE: అందరూ ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. కరోనా కష్టాలకు ఇవాళ్టి నుంచి విముక్తి లభిస్తోంది. భారతదేశ వ్యాప్తంగా ఇవాళ  కోవిడ్ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ఉదయం గం. 10.30 కు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేశారు. టీకా పంపిణీకి దేశవ్యాప్తంగా విస్తృత ఏర్పాట్లు చేశారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 3006 వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. తొలి రోజు ప్రతి సెంటర్లో 100 మందికి టీకా ఇవ్వాలని నిర్ణయించారు. వైద్య సిబ్బంది దేశవ్యాప్తంగా 1075 కాల్ సెంటర్ ద్వారా కోవిడ్ – టీకా పంపిణీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. తగినన్ని డోసుల ‘కోవిషీల్డ్’, ‘కోవాగ్జిన్’ సిద్ధంగా ఉందని ప్రభుత్వం ప్రకటించింది. తొలి దశలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల వైద్యులు, వైద్య సిబ్బందికి టీకా వేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు, దేశ వ్యాప్తంగా టీకా వేసేందుకు జరుగుతోన్న ఏర్పాట్ల లైవ్ అప్డేడ్స్  మినిట్ టు మినిట్ ఈ దిగువున చూడొచ్చు.

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 332 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ

ఇక, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 332 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. తొలి విడతలో రాష్ట్రంలో సుమారు 3 లక్షల 80 వేల మంది వైద్య, ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్‌ వేయనున్నారు. మొత్తం 332 కేంద్రాలకు గాను తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 33 కేంద్రాలు నెలకొల్పగా, విజయనగరం జిల్లాలో అతి తక్కువగా 15 కేంద్రాలను ఏర్పాటు చేశారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో కోవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రక్రియను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలించారు.

తెలంగాణలో 1213 కేంద్రాల్లో టీకా కార్యక్రమం

తెలంగాణలో 1213 కేంద్రాల్లో టీకా వేస్తున్నారు. నిమ్స్‌లో రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ టీకా వేశారు. తిలక్‌నగర్‌లో కరోనా టీకా ప్రక్రియను మున్సిపల్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. గాంధీ ఆసుపత్రి, నార్సింగిలోని పీహెచ్‌సీలో సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు ప్రధాని మోదీ.

టీకా తీసుకునే సమయంలో కండిషన్స్ అప్లై..

కోవిడ్ టీకా తీసుకునే వాళ్ల కోసం ప్రత్యేక నిబంధనలతో పాటు జాగ్రత్తలు తీసుకుంది వైద్య, ఆరోగ్యశాఖ. టీకా ఇచ్చే గదిలో 30 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. మాస్కు ధరించడంతో పాటు ఒక్కొక్కరికి మధ్య 6 అడుగుల దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. చేతులు శుభ్రం చేసుకునేందుకు శానిటైజర్‌ వంటిని ఏర్పాటు చేశారు. టీకా వేసే ప్రతి ఒక్కరికి గుర్తుగా పేషెంట్‌ ఎడమ చేతి వేలిపై ఎన్నికల్లో వినియోగించే సిరా చుక్క వేస్తున్నారు. టీకా వల్ల రియాక్షన్ వచ్చే అవకాశమున్న 18 ఏళ్ల లోపు వారికి, గర్భిణులతో పాటు పాలిచ్చే తల్లులకు టీకాలివ్వరు. కోవిడ్ పాజిటివ్ కాని వాళ్లకు టీకా వేయరు. టీకా వేసుకున్న వాళ్లలో ఎవరికైనా రియాక్షన్ వస్తే ట్రీట్‌మెంట్‌ అందించేందుకు రాష్ట్రస్థాయిలో నోడల్‌ అధికారులను నియమించారు.

హైదరాబాద్ తిలక్ నగర్‌లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న కేటీఆర్

హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో తొలి టీకాను పారిశుధ్య కార్మికుడికి ఇస్తారు. తిలక్‌నగర్‌లో కరోనా టీకా వేసే కార్యక్రమాన్ని మున్సిపల్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభిస్తారు. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, హెల్త్ వైద్యశాఖ ఉన్నతాధికారులు టీకా పంపిణీ చేస్తారు.

లక్షలాది మందిని బలిగొన్ని మహమ్మారిని అంతం చేసే ఆయుధం

భారతదేశానికి ఇప్పుడు టీకా వేసుకునే టైమొచ్చింది. 9 నెలలుగా కరోనాతో దేశ ప్రజల్లో నెలకొన్న భయం మరికొన్ని నిమిషాల్లో శాశ్వతంగా తొలగి పోనుంది. లక్షలాది మందిని బలిగొన్ని మహమ్మారిని అంతం చేసే ఆయుధాన్ని అన్ని చోట్ల ప్రయోగించనున్నారు. వైరస్‌ విరుగుడు మందు చరిత్రలో నిలిచిపోనుంది. తొమ్మిదేళ్ల పాటు నిర్విరామంగా శ్రమించిన శాస్త్రవేత్తల కృషికి నేటినుంచి ఫలితం దక్కబోతోంది.

కరోనా టీకా తీసుకొనే ప్రక్రియలో మొదటి మెట్టు

కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు … ముందుగా యాప్‌లో ఇన్‌స్టాల్ చేసుకొని అందులో తమ వివరాలు నమోదు చేసుకోవాలి. ఏ రోజున.. ఏ టైమ్‌కి… ఏ వ్యాక్సినేషన్‌ సెంటర్‌లో టీకా తీసుకోవాలనుకున్నారో డిటెయిల్డ్‌గా ఎంటర్ చేసి…టైమ్ స్లాట్ ప్రకారం ఆ వ్యాక్సినేషన్‌ సెంటర్‌కు వెళ్లాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ తీసుకోవాలనుకున్న వాళ్లంతా తమ టైమ్‌ స్లాట్ వచ్చే వరకు వైద్య సిబ్బంది ఏర్పాటు చేసిన వెయిటింగ్‌ రూమ్‌లో 6అడుగుల సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కూర్చోవాలి. మాస్క్‌ ధరించడంతో పాటు…చేతులు శుభ్రంగా శానిటైజ్ చేసుకోవాలి. ఇదంతా స్టెప్‌1లో జరిగే ప్రక్రియ.

కరోనా టీకా తీసుకొనే ప్రక్రియలో రెండవ మెట్టు

ఆ తర్వాత … రిజిస్ట్రేషన్‌ రూమ్‌లోకి వెళ్లి యాప్‌లో రిజిస్ట్రైన నెంబర్‌ చూపించాలి. వ్యాక్సిన్‌ తీసుకోవాల్సిన వాళ్లు తమ ఫోటో గుర్తింపు కలిగిన ఆధార్‌, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్‌, పాన్ కార్డ్‌, బ్యాంక్ అకౌంట్‌ పాస్‌ బుక్‌, ఉద్యోగస్తుల ఐడీ కార్డు, రేషన్‌ కార్డు వంటి సుమారు 12 రకాల ఫోటో గుర్తింపు కార్డులలో ఏదోకటి చూపించాలి. నమోదు చేసుకున్న వివరాల ప్రకారం రిజిస్ట్రేషన్‌ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఇది స్టెప్‌2లో జరిగే ప్రాసెస్.

కరోనా టీకా తీసుకొనే ప్రక్రియలో మూడవ మెట్టు

వ్యాక్సిన్ తీసుకోవాల్సిన వ్యక్తి రిజిస్ట్రేషన్ పూర్తవగానే …క్యూ పద్దతిలో వ్యాక్సినేషన్‌ రూమ్‌లోకి ఎంటరై…అక్కడ వైద్యుల సూచన ప్రకారం నామమాత్రపు టెస్ట్‌లు పూర్తి చేసుకోవాలి. ఆతర్వాత ఎడమ చేతి వేలుపై ఎన్నికల పోలింగ్ సమయంలో వేసే సిరా చుక్కను వేస్తారు. ఆ తర్వాత కరోనా టీకా వేస్తారు. టీకా వేయించుకోగానే కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి అవదు. ఇంటికి వెళ్లడం కుదరదు.

కరోనా టీకా తీసుకొనే ప్రక్రియలో మూడవ, చివరి మెట్టు

చివరగా టీకా వేసుకున్న వ్యక్తులు వ్యాక్సినేషన్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన అబ్జర్వేషన్‌ రూమ్‌లో వెయిట్‌ చేయాల్సి ఉంటుంది. డాక్టర్ల పర్యవేక్షణలో 30 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో వార్డులో 20 మంది రెస్ట్‌ తీసుకునే విధంగా అబ్జర్వేషన్‌ రూమ్స్ ఉంటాయి. వ్యాక్సిన్‌ వల్ల ఏవైనా రియాక్షన్ వస్తే…అక్కడున్న వైద్యులు వెంటనే ట్రీట్‌మెంట్ అందిస్తారు. దీన్నంతటినీ పర్యవేక్షించడానికి ఓ నోడల్ అధికారి కూడా ఉంటారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 16 Jan 2021 08:35 PM (IST)

    దేశవ్యాప్తంగా తొలిరోజు వ్యాక్సినేషన్‌ విజయవంతం – కేంద్ర ఆరోగ్యశాఖ

    దేశవ్యాప్తంగా తొలిరోజు వ్యాక్సినేషన్‌ విజయవంతమైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. తొలిరోజు దేశవ్యాప్తంగా లక్షా 65 వేల 714 మందికి టీకా వేసినట్టు వెల్లడించింది. ఇది సాయంత్రం 5 గంటల వరకు అందిన సమాచారం మాత్రమే అని వెల్లడించారు ఆరోగ్యశాఖ అధికారులు. దేశంలో వ్యాక్సిన్‌ తీసుకున్న వాళ్లలో ఎలాంటి ఆరోగ్యసమస్యలు రాలేదని వివరించారు.

    తొలిరోజు 3 లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇస్తామని కేంద్రం ప్రకటించింది. 16755 మంది వ్యాక్సినేటర్లు విధులు నిర్వహించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కోవిషీల్డ్‌ టీకాతో పాటు 12 రాష్ట్రాల్లో కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ను వినియోగించినట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా 3351 కేంద్రాల్లో వ్యాక్సిన్‌ పంపిణీ జరిగినట్టు వెల్లడించారు.

  • 16 Jan 2021 06:37 PM (IST)

    మంత్రి ఈటల రాజేందర్‌ హోమ్‌టౌన్‌ వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమాలాపూర్‌లో కరోనా వ్యాక్సిన్‌..

    మంత్రి ఈటల రాజేందర్‌ హోమ్‌టౌన్‌ వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమాలాపూర్‌లో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ల్యాబ్‌ టెక్నీషియన్‌ చంద్రమౌళికి మొదట టీకాను ఇచ్చారు.ఆస్పత్రి ప్రాంగణంలో ప్రధాని మోది ప్రసంగాన్ని వీక్షించారు. కరోనాపై పోరాడిన స్పూర్తితో ప్రతీ ఒక్కరూ బాధ్యతగా టీకా వేయించుకోవాలన్నారు బస్వరాజు సారయ్య . వ్యాక్సిన్‌తో ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్‌ వుండవన్నారు ఆస్పత్రి సూపరింటిండెంట్‌ డాక్టర్‌ హర్షిణిప్రియ.

  • 16 Jan 2021 06:23 PM (IST)

    మరిన్ని స్వదేశీ వ్యాక్సిన్లు వస్తాయి..-కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

    భారతదేశం త్వరలోనే కరోనా-19 వ్యాక్సిన్ ఎగుమతి కార్యక్రమం ప్రారంభిస్తుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. లక్నోలో కొత్తగా నిర్మించనున్న సెంట్రల్ కమాండ్ హాస్పిటల్‌కు శనివారం ఆయన శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే హాజరయ్యారు.

    రెండు దేశీయ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. మరిన్ని కూడా వస్తున్నాయని తెలిపారు. వ్యాక్సిన్‌ను పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని త్వరలోనే వ్యాక్సిన్ ఎగుమతిని ప్రారంభించామని తెలిపారు. వసుధైక కుటుంబం, సర్వేజనా సుఖినోభవంతు అనే సిద్ధాంతాన్ని మనం బలంగా నమ్ముతాం. అశోక చక్రవర్తి కాలం నుంచి ఇప్పటి వరకూ మనుషులతో పాటు సర్వ జంతుజాలం పట్ల మనం కరుణ చూపిస్తున్నామని అన్నారు.

  • 16 Jan 2021 06:09 PM (IST)

    ఒంగోలు జిల్లాలో తొలి టీకా వేసుకున్న జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరాములు..

    ఒంగోలు జిల్లాలో మొదటి కొవిడ్ టీకాను జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరాములు వేయించుకున్నారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గంలోని కేంద్రాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, వైద్యులు కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రాల వద్ద వాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు.

  • 16 Jan 2021 06:07 PM (IST)

    ప్రకాశం జిల్లాలో 22 కేంద్రాలలో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ...

    గత కొంత కాలంగా కరోనా మహమ్మారితో ప్రపంచం మొత్తం అతలాకుతలం అయింది. అగ్రదేశాలకు ధీటుగా భారతదేశం కరోనా నియంత్రణకు వ్యాక్సిన్ తయారు చేసింది. ప్రకాశం జిల్లాలో 22 కేంద్రాలలో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగింది. జిల్లాలో మొత్తం 24,000 మందికి టీకా ఇచ్చేందుకు గుర్తించామని.. అయితే తొలి రోజు 20 శాతం మంది దాదాపు 967 మందికే వాక్సిన్ ఇచ్చామని తెలిపారు.

  • 16 Jan 2021 05:59 PM (IST)

    ఏడాది కాలంగా దేశం కోవిడ్-19తో పోరాడుతోంది.. - కేంద్ర మంత్రి అమిత్ షా

    కోవిడ్-19తో యుద్ధం మానవ చరిత్రలో అతి కష్టమైనదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రపంచం మొత్తం ఈ ఏడాది కరోనా రక్కిసిపై పోరాటం చేసిందని.. అయితే ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో కోవిడ్‌పై విజయవంతంగా యుద్ధం చేసి గెలిచామని అన్నారు. శనివారం కర్ణాటక రాష్ట్రంలోని భద్రావతిలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ కేంద్రానికి శ్రీకారం చుట్టారు.

    ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా ఈరోజు కోవిడ్-19 టీకా డ్రైవ్ ప్రారంభమైన సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ ‘‘ ఈఏడాది కాలంగా దేశం కోవిడ్-19తో పోరాడుతోంది. చాలా మంది ప్రజలు చనిపోయారు. ప్రపంచ మానవ చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన యుద్ధం చేస్తున్నాం. కానీ నేను మీతో ఒక విషయాన్ని ఆనందంగా చెప్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో మనం కోవిడ్-19పై యుద్ధం గెలవబోతున్నాం. పూర్తి స్వదేశీయైన రెండు వ్యాక్సీన్లతో ఈ కరోనా యుద్ధాన్ని ముగింపుకు తీసుకువెళ్లామని భారత ప్రజలందరికీ నేను ఎంతో సంతోషంతో తెలియజేస్తున్నాను’’ అని అన్నారు.

  • 16 Jan 2021 05:55 PM (IST)

    బెంగాల్‌లో మహిళా పోలీసుకు టీకాను వేసిన వైద్యులు

    బెంగాల్ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియా సాఫీగా సాగింది. కోవిడ్‌పై ముందు వరుసలో ఉండి పోరాడిన కరోనా వారియర్స్‌కు ఈ టీకాను అందించారు. ఇందులో భాగంగా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఓ యువ మహిళా పోలీసుకు కూడా టీకాను ఇచ్చారు.

  • 16 Jan 2021 05:51 PM (IST)

    ఇవాళ 102 మంది ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్ వేస్తున్నాం- సీఎం యోగి

    ఉత్తర్​ప్రదేశ్​లో కరోనా​ వ్యాక్సినేషన్​ జరుగుతోంది. లఖ్​నవూలోని బలరాంపుర్​ ఆసుపత్రిలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ సమక్షంలో టీకాలను వేశారు. ఈ ఆసుపత్రిలో ఇవాళ 102 మంది ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్​ వేస్తున్నట్లుగా సీఎం యోగి తెలిపారు.

  • 16 Jan 2021 05:30 PM (IST)

    తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్‌ విజయవంతం..-హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్

    తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్‌ విజయవంతమైందని హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ వెల్లడించారు. గాంధీలో క్రిష్ణమ్మ, నార్సింగ్‌లో జయమ్మ తొలి టీకా వేసుకున్నారని అన్నారు. వాక్సిన్ వేసుకున్న వాళ్లంతా రోల్ మోడల్స్ అని చెప్పుకొచ్చారు. వాక్సిన్ పూర్తి సేఫ్ అని తేలిపోయిందన్నారు. 20 మందికి టీకా వేసుకున్న చోట ఎర్రబడిందని, ఇది సమస్య కాదని చెప్పారు. వాక్సిన్ వేసుకున్నవారి ఆరోగ్యాన్ని ట్రాక్‌ చేస్తామని తెలిపారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల వాళ్లకు వచ్చేవారంలో టీకా వేస్తామని శ్రీనివాస్‌ ప్రకటించారు. వాక్సిన్ వేసుకున్న వాళ్లు కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇవాళ తెలంగాణలో 3,530 మంది వాక్సిన్ తీసుకున్నారని శ్రీనివాస్‌ తెలిపారు.

  • 16 Jan 2021 05:06 PM (IST)

    తమిళనాడులో ఆరోగ్య కార్తకర్తలకు కరోనా టీకా వేసిన వైద్యులు

    తమిళనాడులో కోవిడ్ వ్యాక్సినేషన్​ ప్రక్రియ కొనసాగుతోంది. చెన్నైలోని రాజీవ్​ గాంధీ జనరల్​ ఆసుపత్రిలో ఆరోగ్య కార్తకర్తలకు టీకాలను అందించారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ఆ సమయంలో అక్కడే ఉండి వారిలో ధైర్యం నింపారు.

  • 16 Jan 2021 05:00 PM (IST)

    కోవిడ్ వ్యాక్సిన్ రాకను పండుగలా చేసుకున్న ఛత్తీస్గఢ్ ప్రజలు

    కోవిడ్ వ్యాక్సిన్ రాకను ఛత్తీస్గఢ్ ప్రజలు పండుగలా నిర్వహించుకున్నారు. జాస్‌పూర్ జిల్లా కేంద్రంలోకి వచ్చిన వ్యాక్సిన్ ట్రక్కును ఘనంగా స్వాగతం పలికారు. బాణసంచా కాల్చారు. పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు.

  • 16 Jan 2021 04:48 PM (IST)

    జమ్ముకశ్మీర్‌లో తొలి టీకా వేయించుకున్న వాలంటీర్...

    జమ్ముకశ్మీర్ శ్రీనగర్​లోని షేర్​-ఐ-కశ్మీర్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్సెస్​లో వ్యాక్సినేషన్​ ప్రక్రియా మొదలైంది. తొలి టీకా డోసును అందుకున్న వాలంటీర్​ హర్షం వ్యక్తం చేశారు. తొలి డోసు తీసుకొని ఇతరులను ప్రోత్సహిస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు.

  • 16 Jan 2021 04:44 PM (IST)

    వాక్సిన్‌పై వదంతులు నమ్మొద్దు.. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్

    కోవిడ్ వ్యాక్సిన్లపై వస్తున్న వదంతులను నమ్మవద్దని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రజలకు కోరారు. కరోనా వ్యాక్సిన్ అత్యంత సురక్షితమైనదని అన్నారు. వైద్య నిపుణుల మాటలపై భరోసా ఉంచాలన్నారు. దేశవ్యప్తంగా ఇవాళ్టి నుంచి టీకా పంపిణీ ప్రారంభమైన సంగతి తెలిసిందే.. ఈ సందర్భంగా లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రిలో జరిగిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఢిల్లీ సీఎం పర్యవేక్షించారు.

  • 16 Jan 2021 04:23 PM (IST)

    భారతదేశంలో తొలి కోవిడ్ టీకా వేయించుకున్న వ్యక్తిగా మనీష్ కుమార్..

    భారతదేశంలో తొలి కరోనా టీకా వేయించుకున్న వ్యక్తిగా మనీష్ కుమార్ నిలిచారు. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో పారిశుద్ధ్య కార్మికుడు మనీష్ కుమార్ ముందుగా టీకా వేయించుకున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ సమక్షంలో ఆయనకు తొలి వ్యాక్సిన్ ఇచ్చారు. వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం తన అనుభవాన్ని మనీష్ కుమార్ మీడియాకు వివరించారు. చాలా మంచి అనుభవం ఇది. వాక్సిన్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఎవరూ భయపడవద్దు అని మనీష్ కుమార్ వివరించారు.

  • 16 Jan 2021 04:16 PM (IST)

    ‌ఢిల్లీలోని 81 వ్యాక్సినేష‌న్ సెంట‌ర్ల‌లో మొత్తం 8,100 మంది కొవిడ్-19 వ్యాక్సిన్...

    ‌ఢిల్లీలోని 81 వ్యాక్సినేష‌న్ సెంట‌ర్ల‌లో ఇవాళ‌ మొత్తం 8,100 మంది కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకుంటున్నార‌ని అక్క‌డి ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రివాల్ చెప్పారు. ఢిల్లీ ఆర్‌ఎంఎల్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎకె సింగ్ రానాకు వ్యాక్సిన్ తీసుకున్నారు.

  • 16 Jan 2021 03:50 PM (IST)

    టీకా వేయించుకున్న సీరమ్ అధినేత అదర్‌ పూనావాలా

    కోవిడ్-19 వైరస్‌ను దేశం నుంచి తరిమికొట్టే కార్యక్రమం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. తొలిరోజు.. కరోనాపై పోరులో ముందున్న ఆరోగ్య కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులకు ఆయా రాష్ట్రాల్లో టీకాలు వేస్తున్నారు. వ్యాక్సిన్‌ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి దేశానికి తొలి టీకా అందించిన సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా అధినేత అదర్‌ పూనావాలా కూడా టీకా తీసుకున్నారు.

    ఈ వివరాలను అదర్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద టీకా పంపిణీ కార్యక్రమంలో ప్రధాని మోదీ, యావత్‌ భారతావని విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ చారిత్రక ఘట్టంలో ‘కొవిషీల్డ్‌’ కూడా భాగస్వామికావడం నాకు మరింత గర్వంగా ఉంది. టీకా భద్రత, సమర్థతపై ప్రజలకు మరింత విశ్వాసం కలిగించేందుకు ఆరోగ్య కార్యకర్తలతో పాటు నేను కూడా వ్యాక్సిన్‌ తీసుకున్నా’ అని పేర్కొన్నారు. టీకా తీసుకున్న వీడియోను ఆయన పంచుకున్నారు.

  • 16 Jan 2021 02:33 PM (IST)

    శ్రీకాకుళం జిల్లాలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ధర్మాన, తమ్మినేని

    శ్రీకాకుళం జిల్లాలో మొదటి విడత కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణదాస్, రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం ప్రారంభించారు. శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దేశ ప్రధాని నరేంద్రమోడి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన కార్యక్రమాన్ని ఆన్‌లైన్ ద్వారా ఆస్పత్రి దగ్గర ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ధర్మాన ప్రసాద రావు, జిల్లా కలెక్టర్ జె నివాస్, వార్డు, గ్రామ సచివాలయ విభాగం జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్.ఏ.కృష్ణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

  • 16 Jan 2021 02:27 PM (IST)

    టీకా వచ్చిందికదాని నిర్లక్ష్యం వద్దు: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, నిర్మల్ జిల్లా ఏరియా ఆస్పత్రిలో వ్యాక్సినేషన్ కు శ్రీకారం

    నిర్మల్ జిల్లా ఏరియా ఆసుపత్రిలో కోవిడ్ వాక్సిన్ పంపిణీ ప్రారంభకార్యక్రమాన్ని అటవీ, పర్యావరణ న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా టీకాకోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఎదురుచూశారని, కరోనా వైరస్‌కు చెక్‌ పెట్టేందుకు శాస్త్రవేత్తలు చేసిన కృషి వల్ల వ్యాక్సినేషన్‌ అందుబాటులోకి వచ్చిందన్నారు. కోవిడ్ టీకా వచ్చింది కదా అని ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని ఆయన సూచించారు. కోవిడ్ టీకా తీసుకున్న తర్వాత కూడా సరైన జాగ్రత్తలను తీసుకోవాలన్నారు. మాస్క్‌లు ధరించడం, సోషల్ డిస్టాన్స్ పాటించడం మానవద్దని ఆయన కోరారు.

  • 16 Jan 2021 01:41 PM (IST)

    గతంలో పొలియోకి వ్యాక్సిన్ వచ్చినప్పుడు కూడా ఇదే పరిస్థితి: రుయా ఆస్పత్రి సూపరిండెంట్ భారతి

    వ్యాక్సిన్ కోసం కేంద్రాలకు రావడానికి సిబ్బంది ఆసక్తి చూపడం లేదన్నారు తిరుపతి రుయా ఆసుపత్రి సూపరిండెంట్ భారతి. రుయాలో ఉదయం నుంచి ఇప్పటివరకూ కేవలం పదమూడు మందికి మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చామన్నారు. వ్యాక్సిన్ అంటే జనాలు భయపడుతున్నారు అని ఆమె చెప్పారు. రియాక్షన్ వస్తుందేమోనని అపోహ, భయం కొంతమేర ప్రజల్లో ఉందన్నారు. వ్యాక్సిన్ వేయించుకోమని అందరికీ ఫోన్లు చేసి విజ్ఞప్తి చేస్తున్నామని, వ్యాక్సిన్ వేయించుకున్న వారితో కూడా ఫోన్లు చేయించి ధైర్యం చెబుతున్నామన్నారు. అయినా సరే వ్యాక్సిన్ కోసం సిబ్బంది ముందుకు రావడం లేదన్నారు. తాము ఇంకా ఊర్లో ఉన్నామని అందుబాటులో లేమని రకరకాల కారణాలతో తప్పించుకుంటున్నారని ఆమె వెల్లడించారు. గతంలో పొలియోకి వ్యాక్సిన్ వచ్చినపుడు కూడా ఇదే పరిస్థితి ఏర్పడిందన్నారు రుయా సూపరిండెంట్ భారతి.

  • 16 Jan 2021 01:26 PM (IST)

    ముందుగా మేమే వ్యాక్సిన్ తీసుకుంటామంటూ ముందుకొచ్చిన ఒంగోలు రిమ్స్ సూరింటెండెంట్, డాక్టర్లు

    ప్రకాశంజిల్లాలో విజయవంతంగా కరోనా వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది. తొలివిడతగా డాక్టర్లు, వైద్య సిబ్బందికి వ్యాక్సిన్‌ వేస్తున్నారు. తొలి టీకా ఒంగోలు రిమ్స్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీరాములు తీసుకున్నారు. అనంతరం డాక్టర్‌ మురళీకృష్ణారెడ్డి, డాక్టర్‌ నామినేని కిరణ్‌, ఇతర వైద్య సిబ్బందికి టీకాలు వేశారు. టీకాలు వేసిన అనంతరం డాక్టర్లు, వైద్య సిబ్బందిని అరగంట పాటు అబ్జర్వేషన్‌లో ఉంచారు. టీకాలు వేసుకున్న డాక్టర్లకు, సిబ్బందికి ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్‌లు రాకపోవడంతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టీకాలు వేసుకునే విషయంలో ప్రజల్లో అపోహలు ఉండే అవకాశం ఉండటంతో తొలిడోసును డాక్టర్లు, వైద్య సిబ్బందికి వేస్తున్నామని, తాము కూడా వ్యాక్సిన్‌ వేయించుకున్నామని, ఎలాంటి ఇబ్బంది లేదని వ్యాక్సినేషన్‌ వేసుకున్న డాక్టర్లు చెబుతున్నారు. ముందు ముందు ప్రజలు కూడా ఎలాంటి భయాలు లేకుండా వ్యాక్సినేషన్‌ చేయించుకోవాలని సూచిస్తున్నారు.

  • 16 Jan 2021 01:11 PM (IST)

    నార్సింగిలో వ్యాక్సినేషన్ ప్రారంభించిన మంత్రి సబిత

    రంగారెడ్డి జిల్లా నార్సింగి లో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారు ఎవరికైనా.. సైడ్ ఎఫెక్ట్స్‌ ఉంటే.. వైద్యులను సంప్రదించాలని ఆమె సూచించారు. ధైర్యంగా అందరూ ముందుకొచ్చి కొవిడ్ టీకా తీసుకోవచ్చని ఆమె అన్నారు.

  • 16 Jan 2021 01:08 PM (IST)

    ప్రధాని సూచనల మేరకు చివరిగా వ్యాక్సిన్ తీసుకుంటాం: కేటీఆర్

    భాగ్యనగరం హైదరాబాద్ ప్రపంచానికి వ్యాక్సిన్ హబ్‌గా మారిందన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. ప్రధాని సూచనల మేరకు ప్రజాప్రతినిధులుగా తాము, చివరకు వ్యాక్సిన్ తీసుకుంటామన్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. హైదరాబాద్‌ తిలక్‌ నగర్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించిన మంత్రి, అందరికి వ్యాక్సిన్ వచ్చే వరకు ఓపిక పట్టాలన్నారు.

  • 16 Jan 2021 12:58 PM (IST)

    భయంలేదు, రండి.. తిరుపతిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం, లిస్టులో తర్వాత ఉన్న వారితో షురూ

    ఆధ్యాత్మక నగరం తిరుపతిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. వ్యాక్సిన్ వేసుకున్న అరగంట తర్వాత వ్యాక్సినేషన్ కేంద్రాల నుంచి సిబ్బందిని బయటకు పంపుతున్నారు. అరగంట ముగిశాక కూడా వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత చాలామంది ఇళ్లకు వెళ్లిపోతున్నారు. లిస్టులో మొదట ఉన్నవారు వ్యాక్సిన్ కేంద్రాలకు రావడానికి భయపడటంతో లిస్టులో తర్వాత ఉన్న వారిని పిలిపించి వారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తమకు ఎలాంటి ఇబ్బందీ లేదని అందరూ ధైర్యంగా ముందుకు రావాలని చెబుతున్నారు వ్యాక్సిన్ తీసుకున్న సిబ్బంది.

  • 16 Jan 2021 12:43 PM (IST)

    కుషాయిగూడ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ 19 టీకా కార్యక్రమం

    మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం కుషాయిగూడ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ 19 టీకా పంపిణీ కార్యక్రమాన్ని  ఆసుపత్రి వైద్యాధికారిని స్వప్నారెడ్డి  వైద్య సిబ్బందితో కలిసి ప్రారంభించారు. మొట్టమొదటగా కుషాయిగూడ ఆరోగ్య కేంద్రంలో పనిచేసే 30 మంది వైద్య సిబ్బందికి టీకాను ఇచ్చారు. రేపు వంద మందికి, రానున్న రోజుల్లో అందరికీ టీకాను ఇస్తామని, ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పజ్జురి పావని మణిపాల్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, తదితరులు నాయకులు పాల్గొన్నారు.

  • 16 Jan 2021 12:31 PM (IST)

    పటాన్ చెరు ఏరియా హాస్పిటల్‌లో కొండల్‌కు ఫస్ట్ వ్యాక్సిన్

    సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో వ్యాక్సిన్ సెంటర్ ను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి ప్రారంభించారు. మొట్టమొదటగా ఆసుపత్రి సిబ్బంది అయిన కొండల్ కు ఈ వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ వ్యాక్సిన్ చేసుకున్నప్పటికీ నిర్లక్ష్యంగా ఉండకుండా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్కు ధరించాలని అన్నారు. సెంటర్ కి 123 వ్యాక్సిన్లు వచ్చాయని, దానిలో భాగంగా ఈరోజు 30 మందికి ఈ వ్యాక్సిన్ అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, స్థానిక జడ్పిటిసి, ఎంపీపీలు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

  • 16 Jan 2021 12:25 PM (IST)

    వరంగల్‌లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

    వరంగల్ అర్బన్ ఎంజీఎం అకాడమిక్ హాల్‌లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. జిల్లా అధికారులు, ఎంజిఎం వైద్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లో ప్రధాని ఫోటో లేకపోవడంతో బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • 16 Jan 2021 12:18 PM (IST)

    ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 22 కేంద్రాల్లో కరోనా టీకాలు

    ప్రకాశం జిల్లాలో తొలిదశలో ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సిబ్బంది 24 వేల మందికి టీకా వేయనున్నారు. ఇందుకుగాను తొలివిడతగా జిల్లాలో 22 కేంద్రాలు ఎంపిక చేశారు. ఒక్కో కేంద్రంలో రోజుకు 15 నుంచి 20 మందికి మాత్రమే టీకాలు వేస్తారు. ఈ నెల 19వ తేదీ లోగా 2 వేల మందికి టీకాలు వేసేందుకు ఏర్పాట్లు చేశారు. తర్వాత మిగిలిన వారికి వేసేలా ప్రణాళిక రూపొందించారు. జిల్లాకు 31వేల డోసుల వ్యాక్సిన్‌ టీకాలను ప్రభుత్వం కేటాయించింది. మొత్తం 24 వేల మందితో తొలి జాబితా తయారు చేశారు. వీరికి ఒకేసారి కాకుండా విడతల వారీగా వేయాలని నిర్ణయించారు. రెండు కంపెనీలకు చెందిన టీకా జిల్లాకు చేరుకుంది. వీటిని ఆయా కేంద్రాలకు పంపించారు. ఈరోజు నుంచి ప్రభుత్వ వైద్య సిబ్బందికి టీకాలు వేస్తున్నారు. ఎంపికచేసిన వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బందికి ఇప్పటికే సమాచారం పంపించారు.

  • 16 Jan 2021 12:18 PM (IST)

    ఒంగోలు జిజిహెచ్‌లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభించిన కలెక్టర్

    ప్రకాశం జిల్లా ఒంగోలు జిజిహెచ్‌లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ప్రారంభించారు‌. కలెక్టర్‌ పోలా భాస్కర్‌, సంయుక్త కలెక్టర్‌ చేతన్‌లు వైద్యాధికారులతో కలిసి తొలి టీకాను ఒంగోలు జిజిహెచ్‌లో వైద్యకార్యకర్తకు వేశారు. ఒంగోలులోని జీజీహెచ్‌తో పాటు బాలాజీనగర్‌ అర్భన్‌ హెల్త్‌సెంటర్‌, మద్దిపాడు, కొరిశపాడు, మార్టూరు, పర్చూరు, చీరాల, చినగంజాం, అద్దంకి, దర్శి, తూర్పు గంగవరం, సింగరాయకొండ, చాకిచర్ల, కందుకూరు, కనిగిరి, మార్కాపురంలో రెండు, కంభం, క్రిష్టంశెట్టిపల్లి, త్రిపురాంతకం, యర్రగొండపాలెం, చీమకుర్తి ప్రాంతాల్లో టీకాలను వేయనున్నట్టు కలెక్టర్‌ పోలా భాస్కర్‌ తెలిపారు.

  • 16 Jan 2021 12:01 PM (IST)

    విజయవాడలో తొలి టీకా వేయించుకున్న పారిశుద్ధ్య కార్మికురాలు బి.పుష్పకుమారి

    ఆంధ్రప్రదేశ్ లో తొలి టీకా పారిశుద్ధ్య కార్మికురాలు బి.పుష్పకుమారి వేయించుకున్నారు. విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సీఎం వైఎస్ జగన్ తొలి టీకా అందించారు. దీంతో ఆంధ్రరాష్ట్రవ్యాప్తంగా మొదటి విడత కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభమైంది. విజయవాడ జీజీహెచ్‌ పారిశుద్ధ్య విభాగంలో మహిళా ఉద్యోగి పుష్పకుమారికి తొలి టీకా ఇవ్వడం విశేషం.దీంతో ఏపీలో తొలి టీకా వేయించుకున్న ఆమెగా బి.పుష్పకుమారి నిలిచారు.

  • 16 Jan 2021 12:01 PM (IST)

    గురజాడ మాటల్ని పలికిన ప్రధాని మోదీ

    సొంతలాభం కొంతమానుకొని పొరుగువాడికి సాయపడవోయ్, దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్ అంటూ మహాకవి గురజాడ అప్పారావు చెప్పిన మాటల్ని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. ఇలా కష్టపడిన మూలంగానే భారతదేశం కరోనా టీకాను రికార్డు సమయంలో తేగలిగిందని మోదీ చెప్పారు. ఇది భారతీయుల జీవన విధానం గొప్పతనమని మోదీ కీర్తించారు. కరోనా టీకా తీసుకున్న వాళ్లు రెండు డోస్ లు తప్పనిసరిగా తీసుకోవాలని, మరిచిపోవద్దని మోదీ దేశప్రజలకు సూచించారు. ప్రపంచంలో వందదేశాలలో జనాభా 3 కోట్ల లోపే.. కాని భారత్‌ జనాభా 130 కోట్లు. ప్రస్తుతం 3 కోట్ల మందికే వ్యాక్సిన్ అందుబాటులో ఉందన్న ప్రధాని.. దీన్ని 30 కోట్లకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. 30 కోట్లమందికి వ్యాక్సిన్ ఇవ్వగల సామర్ధ్యం.. ఇండియా, చైనా, అమెరికాలకు మాత్రమే ఉందన్నారు.

  • 16 Jan 2021 11:29 AM (IST)

    నిమ్స్‌లో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించిన గవర్నర్ తమిళిసై

    హైదరాబాద్‌లోని నిమ్స్‌లో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌, తిలక్‌నగర్‌లోని యూపీహెచ్‌సీలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. మిగిలిన జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు టీకాల ప్రక్రియను ప్రారంభించారు. టీకా వేసినట్లు గుర్తింపుగా లబ్ధిదారుడి ఎడమచేతి బొటనవేలికి సిరా చుక్కను గుర్తుగా వేస్తున్నారు. ఇవాళ మొత్తం పారిశుద్ధ్య కార్మికులకే టీకా ఇస్తున్నారు. కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో మొత్తం 50 వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారు.

  • 16 Jan 2021 11:23 AM (IST)

    హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో మొదట వ్యాక్సిన్ తీసుకున్న సఫాయి కార్మికురాలు కృషమ్మ

    గాంధీ ఆస్పత్రిలో వ్యాక్సిన్‌ పంపిణీని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రారంభించారు. వ్యాక్సిన్‌ పంపిణీకి ముందు ప్రధాని మోదీ ఇచ్చిన సందేశాన్ని వారంతా విన్నారు. మొదటి టీకా హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో పనిచేసే సఫాయి కార్మికురాలు కృషమ్మ మొదటి వ్యాక్సిన్ తీసుకున్నారు.

  • 16 Jan 2021 11:05 AM (IST)

    కరోనా వ్యాక్సిన్లతో భారత్‌ సత్తా ప్రపంచానికి తెలిసింది : మోదీ

    మహమ్మారి కరోనా వైరస్ ను తుదముట్టించేందుకు వ్యాక్సిన్‌ కోసం దేశమంతా ఎదురుచూసిందని మోదీ అన్నారు. టీకా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ అడిగారని, ఆ రోజు వచ్చేసిందని మోదీ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీకా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేస్తున్నానని మోదీ పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ రూపకల్పనకు శాస్త్రవేత్తలు రేయింబవళ్లు కష్టపడ్డారని, సాధారణంగా టీకాల తయారీకి ఏళ్లు పడుతుందని మోదీ చెప్పారు. కానీ మన శాస్త్రవేత్తలు అతి తక్కువ సమయంలోనే అభివృద్ధి చేశారన్నారు. వారి కృషి ఫలితంగా నేడు ఒకటి కాదు రెండు మేడిన్ ఇండియా టీకాలు అందుబాటులోకి వచ్చాయని మోదీ చెప్పుకొచ్చారు.

  • 16 Jan 2021 10:57 AM (IST)

    శాస్త్రవేత్తల కృషి వల్ల చాలా తక్కువ సమయంలోనే టీకా వచ్చింది : మోదీ

    శాస్త్రవేత్తల కృషి వల్ల భారతదేశంలో రెండు వ్యాక్సినేషన్ లు అనతికాలంలోనే వచ్చాయని మోదీ చెప్పారు. సైంటిస్టులు రాత్రింబవళ్లు వ్యాక్సిన్ కోసం పని చేశారన్నారు. మరికొన్ని వ్యాక్సిన్లు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని కూడా మోదీ చెప్పారు. మనుషుల సంకల్పం ముందు బండలు కరుగుతాయని, రామాయణకాలంలో అప్పుడు రుజవైందని, మళ్లీ ఇప్పుడు రుజువైందన్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది తొలి టీకాకు హక్కుదారులన్నారు. మొదటి టీకా తీసుకున్న తర్వాత..రెండో డోస్ ఎప్పుడు తీసుకోవాలనే సమాచారం వారి వారి ఫోన్ ల ద్వారా సమాచారం అందివ్వడం జరుగుతుందన్నారు.

  • 16 Jan 2021 10:54 AM (IST)

    కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

    అందరూ ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. కొవిడ్ 19 వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం దేశవ్యాప్తంగా మొదలైంది. 2021, జనవరి 16వ తేదీ శనివారం ఉదయం 10.30 వ్యాక్సినేషన్ వర్చువల్ విధానం ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. వ్యాక్సిన్ పంపిణీ ఖర్చంతా కేంద్రానిదేనని స్పష్టం చేశారు. కొన్ని నెలల నుంచి కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నామని, ఇప్పుడా ఆ సమయం వచ్చిందన్నారు.

  • 16 Jan 2021 10:44 AM (IST)

    తిరుపతి రుయా ఆసుపత్రిలో విచిత్రమైన పరిస్థితి, ముందుకు రాని ఫ్రంట్ లైన్ వారియర్స్

    తిరుపతి రుయా ఆసుపత్రిలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. వ్యాక్సిన్ కోసం ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరూ ఇంతవరకూ ముందుకు రాలేదు. ముందుగా వాక్సిన్ తీసుకొనేందుకోసం రిజిస్ట్రేషన్ చేయించుకుని కూడా ఇవాళ వ్యాక్సిన్ కోసం ఎవరూ ముందుకు రాని పరిస్థితి కనిపిస్తోంది. రిజిస్ట్రేషన్ చేయించుకున్న సిబ్బందికి ఒక్కొక్కరికి ఫోన్లు చేసి వ్యాక్సిన్ కు రావాలని బతిమలుతున్నారు వైద్య సిబ్బంది.

  • 16 Jan 2021 10:44 AM (IST)

    శ్రీకాకుళం జిల్లాలో కరోనా టీకా, తెల్లవారుజామునే కేంద్రాలకు వ్యాక్సిన్ తరలింపు, 18 కేంద్రాల్లో 21,800 మందికి వ్యాక్సినేషన్ ప్రోగ్రాం

    సిక్కోలు జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ కు రంగం సిద్ధమైంది. నేడు జిల్లా వ్యాప్తంగా 18 కేంద్రాల్లో 21,800 మంది వైద్యులు, వైద్య సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ వేసే ప్రక్రియ ఇవాళ షురూ కానుంది. ఇందుకు గానూ శ్రీకాకుళం, టెక్కలి పట్టణ పరిధిలోని కుటుంబ సంక్షేమ కేంద్రాలను సిద్దం చేశారు. రాజాం, పాలకొండ ఏరియా ఆసుపత్రిలోను, పాతపట్నం, కొత్తూరు, నరసన్నపేట, పలాస, ఇచ్ఛాపురం సి.హెచ్.సి లను వేదిక చేసారు. శ్రీకూర్మం, ఆమదాలవలస, సరుబుజ్జిలి, ఎచ్చెర్ల, రణస్ధలం, సంతకవిటి, వీరఘట్టాం, జలుమూరు, మందస పి.హెచ్.సి ల్లో కరోనా వ్యాక్సిన్ వేయనున్నారు. ఇందుకు గానూ నిర్ధేశించిన వైద్యులు, సచివాలయం కమ్యూనిటీ పోలీసులు, ఆశా వర్కర్లు ఈ వ్యాక్సిన్ పంపిణీ విధుల్లో పాల్గోనున్నారు. కట్టు దిట్టమైన పోలీసు బందోబస్తు మధ్య జిల్లా కేంద్రంలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి ఈ వ్యాక్సిన్ ను ఆయా కేంద్రాలకు తెల్లవారుజామున తరలించారు. ఒక్కో కేంద్రంలో సుమారు 150 మంది ఫ్రెంట్ లైన్ వర్కర్స్ కి ఈ వ్యాక్సిన్ ను వేయనున్నారు.

  • 16 Jan 2021 10:43 AM (IST)

    ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు 530 వాయిల్స్‌, 17 కేంద్రాల్లో తొలిరోజు 30 మంది చొప్పున మాత్రమే కరోనా టీకాలు

    ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కరోనా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ వైద్యులు, వైద్య సిబ్బందికి మొదటి విడతలో టీకా ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా 17 కేంద్రాల్లో కరోనా టీకాలు ఇవ్వనున్నారు. ఏర్పాట్లను ఆయా జిల్లాల కలెక్టర్లు, వైద్యాధికారులు పర్యవేక్షిస్తున్నారు. తొలిడోస్‌ 0.5 ఎం.ఎల్‌ ఇస్తారు, తర్వాత 28 రోజులకు రెండో డోస్‌ కూడా అదే మోతాదులో ఇస్తారు. ఒక్కో కేంద్రంలో తొలి రోజు కేవలం 30 మంది వైద్య సిబ్బందికి మాత్రమే వ్యాక్సినేషన్‌ ఇస్తారు. అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 510 మందికి టీకా వేస్తారు. ఆ తర్వాత ఆది, బుధ, శనివారాలు, ప్రభుత్వ సెలవు రోజులు మినహాయించి, సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో రోజుకు 50 మందికి చొప్పున టీకా ఇవ్వనున్నారు. టీకా ఇచ్చాక దుష్ప్రభావం ఉంటే అందుకు విరుగుడుకు సంబంధించి కిట్‌ సైతం అందుబాటులో ఉంచారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఇప్పటి వరకు 530 వాయిల్స్‌ వచ్చాయి. ఒక్కో వాయిల్‌లోని టీకాను పది మందికి వేయవచ్చు. దీన్ని బట్టి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 5,300 మందికి వ్యాక్సినేషన్‌ చేయడానికి డోసులు అందుబాటులో ఉన్నాయి.

  • 16 Jan 2021 10:43 AM (IST)

    28 రోజుల తర్వాత రెండో డోసు

    మొదటి డోసు టీకా ప్రక్రియ సుమారు 15 రోజుల పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత 28 రోజులకు రెండో డోసు ఇస్తారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4.7 లక్షల కోవిషీల్డ్, 20 వేల కోవాక్సిన్‌ టీకా డోసులు వచ్చాయి. ప్రతి సెంటర్‌ వద్ద డాక్టర్‌ పర్యవేక్షణ ఉంటుంది. వ్యాక్సినేషన్‌ కేంద్రం వద్ద భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి సెంటర్‌లో ఆరుగురు సిబ్బంది పనిచేస్తారు. ఒక్కో వార్డులో 20 పడకలు ఏర్పాటు చేశారు. మండల స్థాయిలో తహసీల్దార్లు, జిల్లాస్థాయిలో కలెక్టర్లు, రాష్ట్రస్థాయిలో కుటుంబ సంక్షేమశాఖ అధికారులు టీకా కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.

  • 16 Jan 2021 10:42 AM (IST)

    విశాఖలో 32 కేంద్రాలు, చినవాల్తేరు అర్బన్ సెంటర్లో మోదీ డైరెక్ట్ టాక్

    విశాఖ జిల్లాలో వ్యాక్సినేషన్ కు సర్వం సిధ్ధమైంది. 32 కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు అధికారులు. మరికాసేపట్లో ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ప్రధాన మంత్రి మోదీ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనేలా చినవాల్తేరు అర్బన్ సెంటర్ లో ఏర్పాట్లు చేశారు. ఏపీలో విజయవాడతో పాటు విశాఖలోని ఈ కేంద్రంలోనే మోదీ వీడియో కాన్ఫరెన్స్ లో స్వయంగా మాట్లాడేలా చర్యలు చేపట్టారు.

  • 16 Jan 2021 10:42 AM (IST)

    తూర్పుగోదావరి జిల్లాలో 33 కేంద్రాల్లో ఏర్పాట్లు, వ్యాక్సిన్ వేసిన అనంతరం రెండు గంటల పాటు వైద్యుల పర్యవేక్షణ

    తూర్పుగోదావరిజిల్లాలో నేటి నుంచి ఐదు రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సిబ్బందికి కోవిడ్ వ్యాక్సినేషన్ జరుగుతుంది. రాజమండ్రి, కాకినాడ, అమలాపురం సహా 33 కేంద్రాల్లో వ్యాక్సిన్ వేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు వైద్యారోగ్యశాఖ అధికారులు. ఇప్పటికే జిల్లా కేంద్రం కాకినాడకు 34 వేల 500 ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు చేరుకున్నాయి. ఒక్కో వ్యాక్సిన్ సెంటర్ లో రోజుకు వంద మందికి వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించారు. వ్యాక్సిన్ వేసిన అనంతరం రెండు గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉండేలా చర్యలు చేపట్టారు.

Follow us
దేవర మూవీ అప్డేట్.. గోవాలో జూనియర్ ఎన్టీఆర్ పై ఫైట్ సీక్వెన్స్
దేవర మూవీ అప్డేట్.. గోవాలో జూనియర్ ఎన్టీఆర్ పై ఫైట్ సీక్వెన్స్
'ఫూల్ మఖానా vs పాప్‌కార్న్' వీటిల్లో ఏది ఎక్కువ ఆరోగ్యకరం?
'ఫూల్ మఖానా vs పాప్‌కార్న్' వీటిల్లో ఏది ఎక్కువ ఆరోగ్యకరం?
అక్కడుంది మెగా పవర్ స్టార్.. ఫ్యాన్స్‌ దెబ్బకు అల్ల కల్లోలమైన...
అక్కడుంది మెగా పవర్ స్టార్.. ఫ్యాన్స్‌ దెబ్బకు అల్ల కల్లోలమైన...
కొత్త కెప్టెన్ రాకతో సన్‌రైజర్స్ హైదరాబాద్ అదృష్టం మారేనా..
కొత్త కెప్టెన్ రాకతో సన్‌రైజర్స్ హైదరాబాద్ అదృష్టం మారేనా..
పాదాల్లో కనిపించే ఈ లక్షణాలు.. గుండెపోటుకు సంకేతం కావొచ్చు..
పాదాల్లో కనిపించే ఈ లక్షణాలు.. గుండెపోటుకు సంకేతం కావొచ్చు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బాక్సులు తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బాక్సులు తెరిచి చూడగా.!
తక్కువ ధరల్లో మతి పోగొట్టే ఎయిర్‌టెల్‌ కొత్త ప్లాన్‌..
తక్కువ ధరల్లో మతి పోగొట్టే ఎయిర్‌టెల్‌ కొత్త ప్లాన్‌..
సారీ..! నేను సెక్సీ కాదు.. షాకిచ్చిన సమంత.. అంతమాట అనేసిందేంటీ..
సారీ..! నేను సెక్సీ కాదు.. షాకిచ్చిన సమంత.. అంతమాట అనేసిందేంటీ..
మీరు తెలివైనవాళ్లా.. ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో 'M'లు కనిపెట్టండి!
మీరు తెలివైనవాళ్లా.. ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో 'M'లు కనిపెట్టండి!
సాయి పల్లవికి పక్కలో బల్లెంలా మారిన మమితా..
సాయి పల్లవికి పక్కలో బల్లెంలా మారిన మమితా..
అక్కడుంది మెగా పవర్ స్టార్.. ఫ్యాన్స్‌ దెబ్బకు అల్ల కల్లోలమైన...
అక్కడుంది మెగా పవర్ స్టార్.. ఫ్యాన్స్‌ దెబ్బకు అల్ల కల్లోలమైన...
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బాక్సులు తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బాక్సులు తెరిచి చూడగా.!
సారీ..! నేను సెక్సీ కాదు.. షాకిచ్చిన సమంత.. అంతమాట అనేసిందేంటీ..
సారీ..! నేను సెక్సీ కాదు.. షాకిచ్చిన సమంత.. అంతమాట అనేసిందేంటీ..
సాయి పల్లవికి పక్కలో బల్లెంలా మారిన మమితా..
సాయి పల్లవికి పక్కలో బల్లెంలా మారిన మమితా..
జూ పార్కులో 125 ఏళ్ల రాక్షసుడు అనార్యోగంతో మృతి.!
జూ పార్కులో 125 ఏళ్ల రాక్షసుడు అనార్యోగంతో మృతి.!
వీడో పిట్టల దొర.. వినేవారుంటే గంటలు తరబడి కథలు చెబుతూనే ఉంటాడు.
వీడో పిట్టల దొర.. వినేవారుంటే గంటలు తరబడి కథలు చెబుతూనే ఉంటాడు.
రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న కుటుంబం.. వారి కళ్లముందే క్షణాల్లో
రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న కుటుంబం.. వారి కళ్లముందే క్షణాల్లో
సముద్ర మార్గంలో సాయం.. గాజాకు 200 టన్నుల ఆహారం.
సముద్ర మార్గంలో సాయం.. గాజాకు 200 టన్నుల ఆహారం.
డేంజర్ అలర్ట్.! భూమికి దగ్గరగా భారీ గ్రహశకలం.. అప్రమత్తమైన నాసా.!
డేంజర్ అలర్ట్.! భూమికి దగ్గరగా భారీ గ్రహశకలం.. అప్రమత్తమైన నాసా.!
ఇద్దరు మనుషులు.! రెండే కాళ్లు.. 22 ఏళ్లుగా సాగుతున్న జీవనం.
ఇద్దరు మనుషులు.! రెండే కాళ్లు.. 22 ఏళ్లుగా సాగుతున్న జీవనం.