కాంగ్రెస్‌పై యోగేంద్ర యాదవ్ ఫైర్

ప్రముఖ సెఫాలజిస్టు, స్వరాజ్ ఇండియా చీఫ్ యోగేంద్ర యాదవ్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ చావాల్సిందేనని ఆగ్రహంతో అన్నారు. కాంగ్రెస్ పార్టీని ఎన్నికల ఫలితాలు కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి ప్రత్యామ్నాయాన్ని సృష్టించడంలో అతిపెద్ద అడ్డంకిగా కాంగ్రెస్ మారుతోందని మండిపడ్డారు. అన్ని ఎగ్జిట్ పోల్స్ తిరిగి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ విజయం సాధిస్తుందని వెల్లడించిన నేపథ్యంలో యోగేంద్ర యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల్లో బీజేపీ అనుసరించిన వ్యూహం, చేసిన పనులే విజయానికి కారణమవుతున్నాయని యోగేంద్ర యాదవ్ తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావంలో ముఖ్య పాత్ర పోషించిన యోగేంద్ర యాదవ్ 2015లో పార్టీ నుంచి సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ నేతృత్వంలో కూటమి ఏర్పడాలనే అంశాన్ని తొలినుంచి యోగేంద్ర యాదవ్ వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అప్రజాస్వామ్యం, అవినీతికి ఉదాహరణ అని విమర్శించారు. దేశంలో కాంగ్రెస్సేతర పార్టీలు బలపడాల్సిన అవసరం ఉందని .. కానీ దానికి రాహుల్ గాంధీ లాంటి నేత అడ్డంకులు సృష్టిస్తారని ట్వీట్ చేశారు. అంతేకాదు దేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *