సొంతగూటికి చేరుతున్న ఫైర్ బ్రాండ్.. కండువా కప్పుకునేందుకు డేట్ ఫిక్స్

కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఆమె ఫైర్ బ్రాండ్. అంతకు ముందు టీఆర్ఎస్‌లో కీలక నాయకురాలిగా పనిచేశారు. దాని కంటే ముందు తల్లి తెలంగాణ పేరుతో ఓ సొంత పార్టీ స్థాపించి వ్యవస్థాపక అధ్యక్షురాలిగా కొనసాగారు...

  • Sanjay Kasula
  • Publish Date - 12:16 am, Wed, 2 December 20
సొంతగూటికి చేరుతున్న ఫైర్ బ్రాండ్.. కండువా కప్పుకునేందుకు డేట్ ఫిక్స్

కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఆమె ఫైర్ బ్రాండ్. అంతకు ముందు టీఆర్ఎస్‌లో కీలక నాయకురాలిగా పనిచేశారు. దాని కంటే ముందు తల్లి తెలంగాణ పేరుతో ఓ సొంత పార్టీ స్థాపించి వ్యవస్థాపక అధ్యక్షురాలిగా కొనసాగారు. ఇదంతా సినీ నటి విజయశాంతి పాత స్టోరీ. అందరికి తెలిసిన విషయమే. కాకపోతే ఇప్పుడు ఆమె వేస్తున్న స్టెప్పే రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. రాములమ్మ బీజేపీలో చేరుతున్నారు. ఇందుకు ముహుర్తం కూడా ఫిక్సైంది. డిసెంబర్‌ 7న స్వయంగా ఢిల్లీ వెళ్లి జాతీయ అధ్యక్షుడి సమక్షంలోనే కాషాయం కండువా కప్పుకోనున్నారు .

నిన్న, మొన్నటి వరకు కాంగ్రెస్‌ పార్టీలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు నచ్చక కొంతకాలంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ వచ్చారు. బీజేపీలో చేరాలన్న ఆలోచనతోనే కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసారు. దుబ్బాక ఉపఎన్నిక జరుగుతున్న సమయంలోనే విజయశాంతి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భేటీ కావడంతో ఆమె కమలదళంలోకి చేరుతున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. చివరకు ఆ అవే నిజమయ్యాయి.

కొద్ది రోజులుగా వియజశాంతి పలు ప్రెస్‌నోట్లు రిలీజ్ చేసి… బీజేపీని పొగడ్తలతో ముంచుతూ…కాంగ్రెస్ బలహీనపడుతోందని… సొంత పార్టీని ఇరకాటంలో పెడుతూ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీతో పాటు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై పలుమార్లు పంచ్‌లు కూడా పేల్చారు. రాములమ్మను సముదాయించేందుకు ఏకంగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ మాణిక్యం ఠాగూర్ రంగంలోకి దిగారు. స్వయంగా ఆమెను కలిసి సమస్యలేంటో తెలుసుకున్నారు. అయినా రాములమ్మ శాంతించలేదని తెలుస్తోంది.

గతంలో పనిచేసిన పార్టీలోకే రాములమ్మ రీఎంట్రీ ఇవ్వనుండటంతో ఆమెకు కీలక పదవులు అప్పగించవచ్చని కమలనాధులు భావిస్తున్నారు. విజయశాంతికి పార్టీ అధిష్టానం జాతీయ స్థాయిపదవి ఇస్తుందా లేక రాష్ట్ర స్థాయి పదవులతో సరిపెడతారా అనే ఆమె అనుచరుల్లో చర్చ మొదలైంది.