ప్రణబ్‌ కుమార్తెకు, మీరా కుమార్‌ తనయుడికి కీలక బాధ్యతలు..హస్తం వ్యూహం అదేనా?

Congress Promotes Pranab Mukherjee’s Daughter and Meira Kumar’s Son As National Spokespersons, ప్రణబ్‌ కుమార్తెకు, మీరా కుమార్‌ తనయుడికి కీలక బాధ్యతలు..హస్తం వ్యూహం అదేనా?

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ, లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరా కుమార్‌ తనయుడు అన్షుల్‌ కుమార్‌కు కాంగ్రెస్‌ పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధులుగా నియమించింది. వీరిద్దరినీ నియమిస్తూ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారని పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా ఓ ప్రకటనలో వెల్లడించారు. శర్మిష్ఠ ముఖర్జి ఢిల్లీ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. తనను పార్టీ అధికార ప్రతినిధిగా నియమించినందుకు ఆమె సోనియాగాంధీకి కృతజ్ఞతలు చెప్పారు.

గత ఎన్నికల్లో ఉహించని ఓటమిని ఎదుర్కొన్న కాంగ్రెస్ ప్రక్షాలన దిశగా అడుగులు ముందుకు వేస్తోంది. అందుకు తగ్గట్టుగానే పాతవారికి ఉద్వాసన పలికి కొత్తవారికి పార్టీలో పదవులు కట్టబెడుతోంది. పార్టీలో సీనియర్ల వారసులను నేరుగా జాతీయ అధికార ప్రతినిధులుగా ఎంపిక చేసిన వైనం చూస్తుంటే…  ఇకపై యువతకు పార్టీలో పెద్ద పీటే దక్కడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది.

యువనేతల నేపథ్యం:

ప్రణబ్ ముఖర్జీ గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. మొదట్నుంచి  కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిన ఈ సీనియర్ రాజకీయవేత్త కేంద్ర మంత్రిగా తనదైన శైలి ముద్ర వేశారు. యూపీఏ1 టైమ్ లో పలు శాఖల మంత్రిగా వ్యవహరించిన ప్రణబ్… పార్టీలో ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా… పార్టీ అధిష్ఠానం తరుపున ట్రబుల్ షూటర్‌గా వ్యవహరించి..పలు సంక్షోబాలను తెలివిగా అణగదొక్కారు. ఆయన పార్టీకి చేసిన సేవలకుగానూ ప్రణబ్‌ను రాష్ట్రపతి చైర్‌లో కూర్చోబెట్టి గౌరవించింది కాంగ్రెస్. తన తండ్రి కొనసాగిన కాంగ్రెస్ పార్టీ నుంచే తన పొలిటికల్ కెరీర్ ను మొదలెట్టిన షర్మిష్ట… 2015లో డిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో గ్రేటర్ కైలాష్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగినా… ఓటమిపాలయ్యారు. ఓటమితో ఏమాత్రం కుంగిపోకుండా పార్టీ తరఫున యాక్టివ్ పాత్ర పోషిస్తున్న షర్మిష్ట… పార్టీ నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాలుపంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమెను ఢిల్లీ కాంగ్రెస్ శాఖ మహిళా విభాగం అధ్యక్షురాలిగా నియమించిన పార్టీ.. ఇప్పుడు కొత్తగా ఆమెను పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమించింది.

ఇక మీరా కుమార్ విషయానికి వస్తే… దిగువ సామాజిక వర్గం నుంచి ఎదిగిన నేతగా ఆమెకు మంచి పేరుంది.  లోక్ సభ మొట్టమొదటి మహిళా  స్పీకర్‌గా, కేంద్రమంత్రిగా ఆమె కీలక పాత్రలు పోషించారు. కాగా ప్రస్తుతం ఆమె ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే పార్టీకి ఆమె చేసిన సేవలను అధిష్ఠానం ఎన్నడూ మరిచిపోలేదన్న వాదన వినిపించింది. ఈ క్రమంలోనే ఆమె కుమారుడు – పార్టీ యువనేత అన్షుల్ కుమార్ ను పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమించింది కాంగ్రెస్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *