పందెం కోళ్లది గెలుపుకోసం పోరాటం-పందెంరాయుళ్లది పరువు కోసం ఆరాటం, ప్రపంచమంతటా కనిపిస్తోన్న కోళ్ల పందాలు!

అదో సమరాంగణం. వేలాది మంది కవ్వింపులు, కేరింతల మధ్య సాగే భీకర రణం. పరువు ప్రతిష్టలకు, పౌరుషరోషాలకు సంబంధించిన యుద్ధం.

పందెం కోళ్లది  గెలుపుకోసం పోరాటం-పందెంరాయుళ్లది పరువు కోసం ఆరాటం, ప్రపంచమంతటా కనిపిస్తోన్న కోళ్ల పందాలు!
Follow us

|

Updated on: Jan 13, 2021 | 3:49 PM

అదో సమరాంగణం. వేలాది మంది కవ్వింపులు, కేరింతల మధ్య సాగే భీకర రణం. పరువు ప్రతిష్టలకు, పౌరుషరోషాలకు సంబంధించిన యుద్ధం. కోట్లాది రూపాయలతో ముడిపడిన పందెం. కణతల దగ్గర సుతారంగా ఊది ముక్కులు కలిపి వాటిని కింద వదలిపెట్టడం ఆలస్యం- అప్పటిదాక నాజూకుగా కనిపించిన ఆ పుంజులు మెడ మీద ఈకలను కర్కశంగా రిక్కించి, చురకత్తితో కుత్తుక తెంచడానికి కలియపడతాయి. పందెం కోళ్లది గెలుపుకోసం పోరాటం-పందెంరాయుళ్లది పరువు కోసం ఆరాటం. డబ్బులక్కడ జబ్బలు చరుచుకుంటాయి. నోట్ల కట్టలు కట్టలు తెంచుకుంటాయి. అదృష్ట రేఖకు అటు ఇటు ఊగిసలాడతాయి. అమీరును గరీబు చేస్తాయి. గరీబును గద్దెనెక్కిస్తాయి. సంక్రాంతి పండుగ సంప్రదాయంలో ఇదో సంబరం. కోడిపందాలు కోస్తా పల్లెటూళ్లకే పరిమితం కాదు. ప్రపంచమంతా కనిపిస్తుంది. ఇప్పుడిది అంతర్జాతీయ క్రీడ.సంక్రాంతి వెంటపెట్టుకుని వచ్చే సంబరాల్లో కోళ్లపందాలకే కోస్తా పల్లెలు ప్రాధాన్యమిస్తాయి. అలాగని ఇది అచ్చంగా మన సంప్రదాయమేనని విర్రవీగిపోవద్దు. అనకాలపల్లి నుంచి అమెరికా వరకు అంతటా వుంది. కోడిని కోసుకు తిన్నట్టే, కోడి గుడ్డును అట్టేసుకున్నట్టే, కోడిని పందాలకు దింపడమనేది కామనైపోయింది. సప్తవ్యవసాల్లో ఇది నీచాతినీచమని తెలిసీ పందాలకు దిగేవారు ప్రపంచమంతా వున్నారు. నిషేధించే దేశాలు నిషేధించాయి. ప్రోత్సహించేవి ప్రోత్సహిస్తూనే వున్నాయి. ఇంకొన్ని ఈ యుద్ధ క్రీడకు స్వస్తి చెప్పాలనుకుంటున్నాయి. మరికొన్ని చట్ట విరుద్ధమే అయినా చూసి చూడనట్టు వదిలేస్తున్నాయి. మనమే నయం. పండుగలకు పబ్బాలకు మాత్రమే కోడి పందాలను జోరుగా కానిస్తాం. మిగతా దేశాల్లో అయితే ఏడాది పొడవునా పందాలు పసందుగా సాగుతాయి. మన దగ్గర ఇంతకు ముందు బహిరంగంగానే కోడి పందాలు జరిగాయి. పౌరుష ప్రతాపాలకు, ఆవేశకావేశాలకు ప్రతీకలయ్యాయి. పచ్చటి పల్లెల్లో చిచ్చు పెట్టాయి. ఇంత జరిగాకే ప్రభుత్వం కోడి పందాలను నిషేధించింది. ఇప్పుడు జరగడం లేదని కాదు. రహస్యంగా జరుగుతున్నాయి. సంక్రాంతికి మొదలయ్యే ఈ యుద్ధ క్రీడ ఉగాది వరకు కొనసాగుతోంది. చెప్పుకోకూడదు కానీ, కోళ్ల పందాల ముందు గుర్రప్పందాలు బలాదూర్‌. లక్షలు కోట్లు పందెం కాస్తున్నారు. రాత్రికి రాత్రి కోటీశ్వరులవుతున్నారు. ఉన్నదంతా ఊడ్చి పెట్టుకుపోయి బికారులవుతున్నారు.ఒకప్పుడు పండుగ వాతావరణంలో సరదాగా సాగిన కోడి పందాలు ఇప్పుడు జూదంగా, వ్యసనంగా మారాయి. ప్రభుత్వం నిషేధించింది కూడా ఇందుకే! అయితేనేం, ప్రతీ ఏడాది ఠంచనుగా సాగుతున్నాయి… ఎమ్మెల్యేలే దగ్గరుండి మరీ పందాల్లో పాల్గొంటుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? పందెంలో పాల్గొనేందుకు కొంత మంది బడా నాయకులు హెలికాఫ్టర్‌ వేసుకుని రావడం కూడా చూశాం! కోళ్ల పందాలను ఛస్తే జరగనివ్వమని పోలీసులు ప్రతీ ఏడాది చెబుతూనే ఉంటారు. ఈసారి మరింత గట్టిగా చెప్పారు. కోడి కత్తులను స్వాధీనం చేసుకుంటున్నారు.. పందాలు జరుగుతాయనుకున్న చోట్ల నిఘా పెంచారు. పందెంరాయుళ్లను హెచ్చరించారు. కాకపోతే పేరున్న వారు, పలుకుబడి ఉన్న రాజకీయవేత్తలు రంగంలోకి దిగిన తర్వాత పోలీసులు కోళ్ల బేరానికి రాక తప్పదు. బ్యాంకాక్‌, మలేషియా, మయన్మార్‌, వియత్నాం, ఫిలిప్పీన్స్‌, పాకిస్తాన్‌, జపాన్‌ వంటి దేశాల్లో కోడి పందాలపై ఎలాంటి రిస్ట్రిక్షన్లు లేవు. హాలిడే వచ్చిదంటే చాలు పందాలు షురూ! బ్యాంకాక్‌ ప్రభుత్వానికెందుకో కానీ కోడి పందాలపై మహా ఇంట్రస్టు. పందెంరాయుళ్లు ఇబ్బంది పడకుండా వుండేందుకు ఏకంగా స్టేడియాలనే నిర్మించింది. కోడి పందాలు నిత్యకృత్యమయ్యాక స్టేడియాలు కట్టాల్సి వచ్చింది మరి! ఆయా ప్రాంత వాసుల డిమాండ్‌ను బట్టి వాటి సంఖ్యను పెంచుకుంటూ పోతోంది. అప్పుడెప్పుడో బర్డ్‌ఫ్లూ వచ్చేసి కాక్‌లన్నీ బిక్క చచ్చి నిజంగానే చచ్చిపోయాక బ్యాంకాక్‌ సర్కార్‌ కాస్త స్ట్రిక్ట్‌ చేసింది. పందెం పుంజుల వివరాలను రిజిస్టర్‌ చేయించుకోవాలని, వాటికి ఆరోగ్య పరీక్షలు గట్రాలు నిర్వహించిన తర్వాతే పందెంలోకి దింపాలని ఆర్డరేసి పారేసింది.కోడి పందాలలో ఫిలిప్పీన్స్‌ది ప్రత్యేక స్థానం. ఏటా కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారుతుంటాయి. ఏటా కొన్ని వేల పుంజులు వీర మరణం పొందుతుంటాయి. ఫిలిప్పీన్స్‌ కోడి పందాలకు దాదాపు అయిదు వందల సంవత్సరాల చరిత్ర వుంది. పదహారో శతాబ్దంలో స్పెయిన్‌ వలస రాజ్యంగా వుండేదీ దేశం. నిజానికి కోడి పందాలను పరిచయం చేసింది వారే! బుల్‌ఫైట్లను స్పెయిన్‌ వారుంచేసుకుని కోడి పందాల పిచ్చిని తమ వలస దేశాలకు అంటించారు. అందుకేనేమో బుల్‌ఫైట్‌లో ఎంత హింస వుంటుందో కోడిపందాల్లో కూడా అంతే వుంటుంది. పందెంలో పాల్గొనే రెండు కోళ్లలో ఏదో ఒకటి రణస్థలిలోనే చనిపోవడం ఖాయం. రెండోది కూడా బతుకుతుందన్న గ్యారంటీ లేదు. పోరులో అంత తీవ్రంగా గాయపడ్డాక ఎలా బతుకుతుంది? గెలిచిన కొద్ది సేపటికో లేదా కొద్ది రోజులకో అది చనిపోతుంది. ఎడమకాలికి వున్న నాలుగు అంగుళాల పొడవైన కత్తిని ఎక్కుపెట్టి ఓ గోతిలో పోరాడతాయి పుంజులు. గొయ్యి ఎందుకంటే ఒకవేళ వాటిలో ఏది భయపడినా పారిపోయే అవకాశం లేకుండా వుండేందుకు. అది కోళ్ల పందాలైనా ఎద్దుల పోటీ అయినా యుద్ధం అన్నాక అమెరికా ప్రమేయం వుండాల్సిందే! ఎందుకంటే అది యుద్ధ పిపాసి కాబట్టి. ఫిలిప్పీన్స్‌లో జరిగే కోడి పందాల కోసం మేలు జాతి పుంజులను సరఫరా చేస్తోంది అమెరికానే! పుంజులను సప్లయ్‌ చేసేవారే ఓ 30 మంది వరకు ఫిలిప్పీన్స్‌కి వెళతారు. అక్కడ తమ పుంజులను పోటీకి దింపుతారు. పందాల సీజన్‌లో .కెనడా, జపాన్‌, తైవాన్‌ దేశాల నుంచి కూడా పందెంరాయుళ్లు కోళ్లతో సహా టక్కున వాలిపోతారు. పాపం పోటీలో పాల్గొనడమే తప్ప ఏనాడూ గెల్చిన పాపాన పోలేదు. జేబులు ఖాళీ చేసుకుని ఇంటిముఖం పడతారు. కోడి పందాల్లో ఫిలిప్పీన్స్‌ వారికి అంతటి ప్రావీణ్యం వుందన్నమాట. ఫిలిప్పీన్స్‌లో ఇది చట్టబద్దమే. ఒక్క ఫిలిప్పీన్సే కాదు మెక్సికోలోనూ ఇది లీగలే! అమెరికాలోని ఆరిజోనా, లూసియానా, మిస్సోరి, న్యూ మెక్సికో, ఒక్లహామా వంటి రాష్ట్రాలలో కూడా కోడి పందాలు చట్టబద్దమే! మిగతా చోట్ల ఇక్కడిలాగే చాలా రహస్యంగా పందాలు జరుగుతాయి. పోలీసులఉ దాడులు చేయడం, దొరికినవారిని దొరికినట్టుగా అరెస్ట్‌ చేయడం పరిపాటే! ఐర్లాండ్‌, కొలంబియా, హైతీ, డొమినికల్‌ రిపబ్లిక్‌, జమైకా, .పోర్టెరికో వంటి దేశాల్లో కూడా కోడి పందాలు జరుగుతాయి. ఎవరూ ఏమీ అనరు. మన పుంజు ఉత్తమమైనదో కాదో తెలుసుకోవాలంటే అంతకంటే ఉత్తమమైనదానితో పోరాడి వుండాలి కదా అంటాడు జన్‌ శాంటియో అనే ఫిలిప్పీన్స్‌ కోడిపందాల పండితుడు. అవును నిజమే కదా! జో జీతా వహి సికిందర్‌!ఒక్కసారి కోడి పందాలకు అలవాటు పడ్డామా అది వ్యసనంలా అంటుకుంటుంది. జూదంలాంటిదే ఇది కూడా. కొన్నాళ్ల కిందట జపాన్‌కు చెందిన రయోచి సయాటో అనే వ్యాపారి ఫిలిప్పీన్స్‌కు వెళ్లాడట! అక్కడతనికి ఆతిథ్యమిచ్చిన వాళ్లు సరదాగా కోడి పందాలను చూపించారట! చూడగానే ఆ వల్లో పడిపోయాడట! వెంటనే అమెరికా వారికి ఆర్డర్‌ ఇచ్చేసి ఆరు వందల పందెం కోళ్లను దిగుమతి చేసుకున్నాడట! మనీలా శివారు ప్రాంతాలకు వెళితే ఎక్కడ చూసినా కోళ్ల ఫారాలే కనిపిస్తాయి. అవన్నీ పందెం పుంజులే! ఫిలిప్పీన్స్‌లో పందెంలో పాల్గొని ఏటా ఎన్ని కోళ్లు చనిపోతున్నాయో తెలుసా? మరణమో, వీర మరణమో పొందే పుంజులు 70 లక్షల నుంచి కోటి ముప్పయ్‌ లక్షల వరకు వుంటాయట! దీన్ని బట్టి అక్కడి ఫారాల వారికి ఎంత డబ్బు వస్తుందో లెక్కలేసి చూసుకుంటే మైండ్‌ బ్లాక్‌ అవుతుంది. ఓ పందెం పుంజు, రెండు పెట్టలు కలిసి 1300 డాలర్లు అవుతుంది. అంటే సుమారు అరవై వేల రూపాయలన్నమాట! అదే పుంజు కాస్త ఉత్తమజాతిదై వుంటే రెండున్నర వేల డాలర్లు పెట్టేందుకు కూడా వెనుకాడరు. అంటే లక్షన్నర పైచిలుకే! అంత రేటు పెట్టి కొన్నాక మామూలు తిండి పెడితే కుదరదుగా, వాటికి ఖరీదైన ఆహారమివ్వాలి. విటమిన్‌లు కూడా పెట్టాలి. ఆరోగ్యాన్ని చాలా భద్రంగా చూసుకోవాలి. కాజు, బాదాం, పిస్తాలు పెట్టి పెంచుతున్నప్పుడు పక్కింటివాళ్లు ఎత్తుకెళ్లకుండా ఓ కంట కనిపెడుతూ వుండాలి. కోస్తాలో పందెం కోళ్లను జాగ్రత్తగా పెంచుకుంటారు. కన్నబిడ్డలా సాకుతారు. వాటికి ఏ కష్టమూ రాకుండా చూసుకుంటారు. పేరు పెట్టి మరీ పిల్చుకుంటారు. మన దగ్గర కోడి పుంజులకు విచిత్రమైన పేర్లుంటాయి. సాధారణంగా రంగును బట్టే పేరు వుంటుంది. సపోజ్‌ కోడి నల్లగా వుందనుకోండి. దాన్ని కాకికోడని పిలుస్తారు. పచ్చరంగు కలిగిన కోడిని పచ్చకోడి అని ముద్దుగా పిలుచుకుంటారు. ఇవే కాదు కాకిడేగ, కోడిడేగ, నెమలి, మైల, నెమలిడేగ, పింగళి, కేకరి, గాటు కేకరి, అబర్స్‌, రసంగి ఇలా పుంజులకు రకరకాల పేర్లున్నాయి. పలనాడు ప్రాంతంలో మాత్రం చిట్టిమల్లు అనే కోడి పుంజుకు విపరీతమైన క్రేజ్‌ వుంది. మల్లయుద్ధంలో యోధులు తలపడే విధంగా అక్కడి కోడి పుంజులను తీర్చిదిద్దుతారు కాబట్టే చిట్టిమల్లు అనే పేరొచ్చింది వీటికి. కోళ్ల పేర్లలో తేడాలున్నట్టే పోటీలు జరిగే తీరులోనూ భేదాలున్నాయి. కొన్ని చోట్ల పందెపు బరిలో దిగే కోడి పుంజుల కాళ్లకు కత్తి కట్టి వదులుతారు. మరికొన్ని చోట్ల మాత్రం కత్తికట్టకుండానే బరిలో దింపుతారు. కోడి పుంజుల మధ్య యుద్ధానికి నిర్ణీత సమయమంటూ వుండదు. ఎంతసేపైనా జరుగవచ్చు. రెండు కోళ్లలో ఓ కోడి పూర్తిగా అలసిపోయి లేవలేనంతవరకు లేదూ ఓ కోడి పూర్తిగా చనిపోయేంతవరకు పోరాటం సాగుతూనే వుంటుంది. ఏ కోడిది విజయమో తేలేదాక పోరు జరుగుతూనే వుంటుంది.పుంజులు కొట్టుకున్నంత సేపు బెట్టింగులు రంజుగా సాగుతాయి.. వేలు, లక్షలు, కోట్లు అలా దాటిపోతూ వుంటాయి. అంతకష్టపడి గెలిస్తే, యజమానికి డబ్బులొస్తాయే కానీ పాపం కోడిని ఎవరూ గుర్తుంచుకోరు. థాయ్‌లాండ్‌, మలేషియాలలో అలా కాదు. గెలిచినదానికి ఓ చక్కటి జ్ఞాపికను బహుకరిస్తారు. మనుషుల చేతి గీతలు చూసి జాతకం ఎలా చెబుతారో థాయ్‌లాండ్‌, ఫిలిప్పీన్స్‌లలో కోడి కాళ్ల రేఖలను చూసి జాతకం చెబుతారట! కోడి జ్యోతిష్కులకు యమ గిరాకీ. కాళ్లను చూసి ఇట్టే జాతకం చెప్పేస్తారు. పుంజు కాళ్ల మీద రేఖలను క్షుణ్ణంగా అధ్యయనం చేయడమే కాకుండా, వాటి పూర్వ చరిత్రను కూడా తిరగేస్తారు. ఇక్కడ యూనివర్సిటీల్లో జోతిష్యశాస్ర్తం పెట్టినట్టుగానే అక్కడ కోడి కాళ్ల సాముద్రికంపై ప్రయివేటు అధ్యయన కేంద్రాలు కూడా వెలిశాయి. కోడి పుంజుల యజమానుల్లో చాలా మంది తమ కోడి జాతకం చూడకుండా పందానికి దింపనే దింపరు. మనుషుల్లో హస్త రేఖలున్నట్టే కోడి కాళ్లకు రేఖలు వుంటాయన్న విషయాన్ని వారు పదే పదే ప్రస్తావిస్తూ జాతకాన్ని నిర్ధారిస్తారు. జాతకం బాగోలేదని జ్యోతిష్కుడు చెప్పాడా ఇక కోడి పని అవుటే! కోళ్ల జాతకాలు చెప్పేవారి సంపాదన చూస్తే గుండెలు బాదుకోవాల్సి వస్తుంది. జాతక చక్రాలు తిరగేయడంలో, కోడికాళ్ల సాముద్రికంలో దిట్టగా మారి సీనియర్‌ ర్యాంకు తెచ్చుకున్నాడనుకోండి. ఏడాదికి పది లక్షల రూపాయలు ఎటూ పోవు. నెలకి డెబ్బయ్‌ ఎనభై వేలన్నమాట! చెట్టుకింద జ్యోతిష్యులకు నలభై వేలు మినిమమ్‌ గ్యారంటీ. పందెం కోళ్ల క్రయవిక్రయాల్లో జాతకరత్నం మిడతంభొట్లదే హవా. వారు వెయ్యింటే వెయ్యి. లక్షంటే లక్ష. దట్సాల్‌. కోడి కాళ్ల మీద వున్న పుట్టుమచ్చలను బట్టి కూడా ధర నిర్ణయిస్తారు వీరు. జాతకము, పుట్టుమచ్చ రెండూ బాగుంటే ఆ కోడి పంట పండినట్టే. మహర్దశ పట్టినట్టే! మచ్చ బాగోలేదనుకోండి. పందానికి చస్తే దింపరు. అలాంటివి పందానికి అసలు పనికిరావు. దీన్ని ఆసరగా తీసుకునే అక్కడ పందెం వ్యవహారాలన్నీ సాగుతుంటాయి. మరో మాట మాట్టాడానికి వీలుండదు.మన దేశంలో కోడి పందాలు బ్యాన్‌ కాబట్టి వీటి గురించి పెద్దగా తెలియదు కానీ మిగతా దేశాల్లో కోడి పందాలకు అవసరమైన సామాగ్రినంతా అంగళ్లో పెట్టి మరీ అమ్ముతుంటారు. సీజన్లప్పుడు వీటి కోసం ప్రత్యేకంగా స్టాళ్లను ఏర్పాటు చేస్తారు. కోడి పుంజులకు వ్యాధులు సోకితే చూసుకోడానికి ప్రత్యేకంగా డాక్టర్లుంటారు. వీళ్ల ఆదాయం కూడా బాగానే వుంటుంది. పుంజులకు అవసరమైన మందులను సరఫరా చేయడానికి ప్రత్యేకమైన విభాగాలున్నాయి. కోడి పుంజులను మనం లైట్‌గా తీసుకుంటామేమో కానీ, చాలా దేశాల వాళ్లు వీటికి కళ్లకద్దుకుంటారు. కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ఆయా దేశాల ప్రభుత్వాలు కూడా అంతే. విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా ఆర్జించి పెడుతున్న తమ కోళ్లను కళ్లల్లో పెట్టుకుంటున్నాయి. పుంజుల కోసం ప్రత్యేకమైన పథకాలను రూపొందిస్తున్నాయి కొన్ని దేశాలు. పందెం కోళ్లకు ప్రత్యేక సదుపాయాలను కల్పిస్తున్నాయి. వసతీ సౌకర్యం కూడా చక్కగా వుంటుంది. ప్రత్యేకమైన షెడ్లను నిర్మించి వాటిలోనే కోడిపుంజులను సాకుతున్నారు. థాయ్‌లాండ్‌లో కోడిపందాల విజేతలను హీరోల్లా చూస్తారు. బహుమతులతో పాటు అవార్డులను ఇస్తారు. సత్కారాలు మామూలే! మన క్రికెట్‌ స్టార్లకున్నట్టుగానే పందెంరాయుళ్లకి కూడా ర్యాంకింగులుంటాయి. ఏడాది పొడవునా జరిగే పోటీల్లో ఎక్కువ సార్లు విజయం సాధించిన కుక్కుటేశ్వరులకు జాతీయ స్థాయిలో అవార్డును అందచేస్తారు. అవార్డు ఫంక్షన్‌ గ్రాండ్‌గా వుంటుంది. ఆటపాటలు, లైవ్‌ కవరేజీలు మామూలే. ఈ ప్రొగ్రామ్‌కి వేలాది మంది హాజరవుతారు. అవార్డు ప్రదానోత్సవంలోనే వచ్చే ఏడాది ఈ అవార్డును ఎవరు తన్నుకుపోతారో గెస్‌ చేయండంటూ ఓ క్వొశ్చనేస్తారు. కరెక్ట్‌ ఆన్సర్‌ చెప్పినవారికి భారీ మొత్తాన్ని ముట్టచెబుతారు. అవార్డు గెల్చుకున్నవారు ఏడాది పొడుగునా కాలరెగరేసుకుని కోళ్ల స్టేడియాల్లో ఎంజాయ్‌ చేస్తారు. మనం సంక్రాంతికి ఎలాగైతే కోళ్ల పందాలను నిర్వహిస్తుంటామో. తమిళనాడులో పొంగల్‌కు కోడి పందాలను జరుపుతారు. ప్రభుత్వం కూడా ఇతోధికంగా సాయం చేస్తుంది కూడా. పండుగల్లో కోడి పందాలను ప్రోత్సహిస్తూ పందెంగాళ్లందరికీ చేయూతనిస్తోంది. కోడి పందాలు అక్కడ జూదం కాదు. జూదంగా పరిగణించరు. పండుగ వాతావరణం పరిపూర్ణంగా పండాలంటే కోడి పందాలు విధిగా వుండాలన్నది అక్కడి ప్రజల అభిప్రాయం. ప్రభుత్వం కూడా ఆ ధోరణిలోనే వుంది. అందుకే చెన్నయ్‌ సమీపంలో ప్రతీ ఏటా భారీగా కోడి పందాలు జరుగుతున్నాయి. ఈ పందాలకు మన రాష్ట్రానికి చెందిన వారు కూడా భారీ సంఖ్యలో హాజరై మన పుంజుల పోరాట పటిమను తమిళుల దగ్గర ప్రదర్శిస్తున్నారు. వీరిలో అత్యధికులు రాజకీయ నాయకులే! అక్కడ బెట్టింగులు కూడా భారీగా, జోరుగా సాగుతాయి. ఓ అంచనా ప్రకారం బెట్టింగులు కోట్ల రూపాయలలో వుంటాయి.ప్రభుత్వం మద్యపానాన్ని ప్రోత్సహిస్తున్నప్పుడు కోడి పందాలపై నిషేధమెందుకంటున్నారు కొంతమంది. దీన్ని జూదంగా ముద్రవేయడం తగదంటున్నారు. పల్నాటి పాలకులు కోడి పందాలను పౌరుషానికి చిహ్నంగా భావించేవారు. ఇప్పటికీ చాలా మంది ఇదే భావనతో వున్నారు. కత్తికట్టిన కోళ్ల గెలుపోటములే తమ ప్రాంతాలకు పరువు ప్రతిష్టలను తెస్తాయన్న రీతిలో పందాలను నిర్వహిస్తున్నారు. పందెపు కోడిని అల్లారు ముద్దుగా పెంచుతారు. ఏ పుంజునైతే పందానికి దింపాలనుకుంటున్నారో దాన్ని నెల రోజుల్లోపే తల్లి కోడి నుంచి విడదీస్తారు. మూడు నెలలు వచ్చేసరికి కోడి పుంజు రంగు ఎత్తులపై ఓ అవగాహనకు వస్తారు. దాన్ని బట్టే అది పందెం కోడిగా పనికొస్తుందా లేదా అన్నది డిసైడ్‌ చేస్తారు. ఓ వయసుకు వచ్చిన తర్వాత వీటి దాణాలలో మార్పులు చేర్పులు చేస్తారు. మనుషుల మాదిరిగానే వీటికి ప్రత్యేక వ్యాయామశాలలుంటాయి. స్విమ్మింగ్‌ పూల్‌లు వుంటాయి. పందెం కోళ్లకు ఈత కంపల్సరీ. ఎందుకంటే ప్రత్యర్థిని ఓడించే సమయంలో ఆయాసం కానీ అలసట కానీ రాకూడదు కదా! పందానికి దిగేంత వరకు పుంజుతో బ్రహ్మచర్యాన్ని పాటింపచేస్తారు. పందాలు ముగిసే వరకు పెట్టెలను పుంజు దరిదాపుల్లోకి కూడా రానివ్వరు. అంతే కాదు, పుంజుపై ఇతరుల దృష్టి పడకుండా జాగ్రత్త పడతారు యజమానులు. యుద్ధానికి వెళ్లే సైనికుడికి ఎలా తర్ఫీదునిస్తారో అచ్చంగా అలాగే పుంజుకు శిక్షణనిస్తారు. ఈ విషయంలో మాత్రం మనకంటే ఫారినర్సే చాలా బెటర్‌. వాళ్లు మనకంటే బాగా అడ్వాన్స్‌. పందెంరాయుళ్లకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారక్కడ. వీడియోలు, పుస్తకాలు కోకొల్లలు. గేమ్కాక్‌ అనే పత్రిక అచ్చంగా కోడి పందాలకోసమే డెడికేట్‌ అయిన పత్రిక. ఇందులో పుంజుల పెంపకం దగ్గర్నుంచి వాటికి ఎలాంటి ఆహారం ఇవ్వాలి? ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి విషయాలు వుంటాయి. ఇదొక్కటే కాదు ది ఫెదర్‌ వారియర్‌, గ్రిట్‌ అండ్‌ స్టీల్‌ పత్రికలు కూడా కోళ్ల గురించి పేజీలకు పేజీలు వ్యాసాలు ప్రచురిస్తాయి. మన సినిమా మేగజైన్ల కంటే ఎక్కువ డిమాండ్ వుంటుందీ మేగజైన్లకు. పాకిస్తాన్‌లో కూడా ఇదే తరహా పోటీలు జరుగుతున్నాయి. ఇవన్నీ కాలక్షేపం కోసమే. స్వదేశీ కోళ్ల మీద మాత్రమే ఆధారపడకుండా భారత్‌, ధాయ్‌లాండ్‌ వంటి దేశాలను కూడా సందర్శించి అక్కడి పందెం కోళ్ల సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. పాకిస్తాన్‌లో జరిగే పందాల్లో కోడి పుంజులకు కత్తులు కట్టడం. అవి గాయపడి విలవిలలాడటం వంటివి వుండవు. ఇలాంటి కోడి పందాలను డింకీ పందాలంటారు. అంటే కోడికి కత్తి కట్టకుండా మల్లయోధుల తరహాలో కుస్తీలు పట్టడం. మన రాష్ట్రంలో కూడా డింకీ పందాలున్నాయి. Read Also:Cock Fights: పందెం బరిలోకి దిగితే.. అక్కడ్నుంచి నేరుగా సెల్‌లోకే.. కృష్ణా జిల్లా పోలీసుల వార్నింగ్. Read Also:గోదావరి తీరంలో కోడి పందాల కయ్యం.. ఆడేందుకు సై సై అంటున్న పందెం రాయుళ్లు.. నై నై అంటున్న పోలీసులు.