యాదాద్రి రాతి స్తంభాలపై సారు… కారు… సర్కారు…! సోషల్ మీడియాలో సెటైర్లు!

CM KCR Pictures Are Engraved on Yadadri Temple Pillars triggers controversy, యాదాద్రి రాతి స్తంభాలపై సారు… కారు… సర్కారు…! సోషల్ మీడియాలో సెటైర్లు!

తెలంగాణ ప్రాంతంలో కొలువై ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కొత్త వివాదం తెర మీదకు వచ్చింది.  యాదాద్రి రాతి స్తంభాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రంతో పాటు టీఆర్‌ఎస్ ప్రభుత్వ పథకాలను పొందుపరుస్తుండటం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ఎంతో ఖర్చుతో ప్రతిష్ఠాత్మకంగా ఆలయాన్ని తీర్చి దిద్దుతోంది. ఈ ఆలయం నిర్మాణం సైతం అధ్బుతంగా తీర్చి దిద్దుతున్నారు. అయితే.. రాజుల కాలంనాటి నిర్మాణ రీతులను పుణికి పుచ్చుకుని ఆలయాన్ని తీర్చిదిద్దుతున్న ఈ ఆలయంలో శిల్పాల మీద ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రం .. టీఆర్‌ఎస్‌ ఎన్నికల గుర్తు కారు చెక్కి ఉంటుంది. అంతటితో ఆగలేదు…టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రాధాన్య పథకాలైన కేసీఆర్‌ కిట్‌, తెలంగాణ హరితహారం తదితరాలూ రాతి స్తంభాలపై కనిపించనున్నాయి.

అష్టభుజి ప్రాకార మండపంలోని రాతి స్తంభంపై సీఎం కేసీఆర్‌ చిత్రం ఏర్పాటు చేశారు. ఆ పక్కనే మరో స్తంభంపై తెలంగాణకు ప్రభుత్వ పథకాలు, తెలంగాణ పక్షి పాలపిట్ట, రాష్ట్ర జంతువు కృష్ణ జింక, జాతీయ పక్షి నెమలి లాంటి చిహ్నాలు రాతి స్తంభాలపై కొలువుదీరాయి. దీంతో ఇది ప్రభుత్వం నుండి వచ్చిన ఆదేశాల మేరకు చెక్కారా..లేక ఎవరైనా అత్సుత్సాహం ప్రదర్శించారా అనే చర్చ మొదలైంది.

ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. ‘సారు.. కారు.. సర్కారు పథకాలు’ రాబోయే వెయ్యేళ్ల పాటు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయంటూ విమర్శలు చేస్తున్నారు. ఎవరి చరిత్ర వారే రాసుకుంటే అది చరిత్ర కాదని.. ఎవరి శిల్పం వారే చెక్కుకుంటే అది శిల్పం కాదని ఎద్దేవా చేస్తున్నారు. అష్టభుజి ప్రాకార మండప రాతిస్తంభాలపై ప్రస్తుతం చలామణీలో లేని పైసా, రెండు, మూడు, ఐదు, ఇరవై పైసల నాణేలు చెక్కించారు. వీటితో పాటు బతుకమ్మ పండుగను ప్రతిబింబించే చిత్రం, నాగలి దున్నే రైతు లాంటి బొమ్మలను చెక్కించారు. ప్రాకార మండపానికి దక్షిణం వైపున ఉన్న రాతి స్తంభాలపై తెలంగాణ ఆధునిక చరిత్ర, రాష్ట్ర అధికారిక చిహ్నంతో పాటు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అంశాలను చెక్కుతున్నారు.

పురాతన ఆలయాలపై చరిత్ర, సంస్కృతి, జీవన విధానాలకు సంబంధించిన అంశాలతో పాటు ఆ కాలపు నిర్మాణ రీతులు, అప్పట్లో వాడిన నాణేలు, వ్యవసాయ పద్ధతులు, ఆచరించిన ధర్మాలు, వినియోగించిన సాధనాలను రాతి స్తంభాలపై చెక్కడం ఆనవాయితీ. శతాబ్దాల కాలం నాటి చారిత్రక నిర్మాణాల గోడలు, రాతి స్తంభాలపై చిహ్నాలు, బొమ్మలు ఆనాటి ప్రజల జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలోనూ ఇదే పద్ధతిని అవలంబించాలని సీఎం కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రధాన స్తపతి ఆనందసాయి నేతృత్వంలో యాదాద్రి పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

ఆలయంలోని రాతి స్తంభాలపై సంస్కృతి, సంప్రదాయాలతో పాటు రాజకీయ అంశాలను కూడా పొందుపరుస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది. అయితే.. ఈ స్తంభాలపై కేసీఆర్‌ చిత్రం, టీఆర్‌ఎస్‌ పథకాలు తదితరాలను చెక్కాలని ముఖ్యమంత్రి సూచించారా? లేదా ఆలయ శిల్పులు అత్యుత్సాహంతో వాటిని ఏర్పాటు చేస్తున్నారా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

ఈ అంశంపై తెలంగాణ బీజేపీ కూడా స్పందించింది. సీఎం కేసీఆర్ ముఖచిత్రాన్ని శిల్పాలుగా చెక్కిన స్తంభాలను ఆలయంలో అమర్చడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందంటూ ఆ పార్టీ అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ తీరును తప్పుబడుతూ శుక్రవారం ట్విట్టర్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు. వ్యాఖ్యానించారు.

CM KCR Pictures Are Engraved on Yadadri Temple Pillars triggers controversy, యాదాద్రి రాతి స్తంభాలపై సారు… కారు… సర్కారు…! సోషల్ మీడియాలో సెటైర్లు!

06/09/2019,4:28PM

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *