మందుబాబులకు ఝలక్.. ఏపీలో మద్యం దుకాణాలపై కొరడా..

CM Jagan Orders To Close 880 Liquor Shops In AndhraPradesh, మందుబాబులకు ఝలక్.. ఏపీలో మద్యం దుకాణాలపై కొరడా..

వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మందుబాబులకు షాక్ తగిలింది. అక్టోబర్ నెల నుంచి అమలు కానున్న కొత్త మద్యం విధానంలో భాగంగా ప్రస్తుతం నడుస్తున్న షాపుల్లో 880 తగ్గించి 3,500 మద్యం షాపుల్ని నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దశలవారీగా మద్య నిషేధం అమల్లోకి తెచ్చే భాగంలో.. ముందుగా 20 శాతం మద్యం షాపులను తగ్గించాలని అధికారులు భావిస్తున్నారు. దీనిపై వైఎస్ జగన్ ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,380 మద్యం షాపులు ఉన్నాయి. వీటిని ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్నారు. అయితే సెప్టెంబర్‌తో ఈ షాపులకు ఇచ్చిన లైసెన్సు రెన్యువల్‌ గడువు ముగియనుంది. దీంతో అక్టోబర్‌ నుంచి మిగిలిన 3,500 మద్యం దుకాణాలని ప్రభుత్వమే నిర్వహించేందుకు కసరత్తు చేయాలని జగన్‌ అధికారులకు సూచించారు. ప్రభుత్వం చేతిలో దుకాణాలు ఉండటం వల్ల మద్య నియంత్రణకు మార్గం సులువవుతుందని అన్నారు. జాతీయ, రాష్ట్ర రహదారులకు, గుడికి, బడికి దగ్గర లేకుండా చూడాలని ఆయన సూచించారు.

ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించడం ద్వారా కొత్తగా 15 వేల ఉద్యోగాల కల్పన జరుగుతుందని, మద్యం దుకాణంలో సూపర్‌వైజర్, సేల్స్‌మెన్‌ పోస్టులు భర్తీ చేస్తామని అధికారులు వివరించారు. పోస్టుల భర్తీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రిజర్వేషన్లతో పాటు స్థానికులకు 75 శాతం ఉద్యోగాల నిబంధన కచ్చితంగా అమలు చేస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *