ఆంధ్రప్రదేశ్‌లో నివర్ తుఫాన్ ప్రభావానికి గురైన ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్ శనివారం నాడు ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం శుక్రవారం నాడు షెడ్యూల్‌ను ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. అధికారిక షెడ్యూల్ ప్రకారం.. ఉదయం 8.30 గంటలకు ముఖ్యమంత్రి జగన్ ఇంటి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టు వరకు కారులో బయలుదేరుతారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో చిత్తూరు రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అటు పిమ్మట చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులను ఎరియల్ సర్వే ద్వారా సీఎం పరిశీలిస్తారు. అనంతరం రేణిగుంట ఎయిర్‌పోర్టులోనే తుఫాన్ ప్రభావం, అక్కడి పరిస్థితులపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారని అధికారులు పేర్కొన్నారు. ఈ సమీక్ష ముగిసిన తరువాత సీఎం జగన్ నేరుగా రేణిగుంట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన నివాసానికి బయలుదేరుతారని అధికారులు ప్రకటించారు.
తమిళనాడు, పుదుచ్చేరితో పాటు ఆంధ్రప్రదేశ్ పైనా నివర్ తుఫాన్ ప్రభావం పడింది. తుఫాన్ ఎఫెక్ట్‌తో కపడ, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. వాగులు వంకలు పొంగిపొర్లాయి. కొందరు వరదల్లో కొట్టుకుపోయారు కూడా. తుఫాన్ ప్రభావంపై సీఎం జగన్ సంబంధిత శాఖల అధికారులతో ఇదివరకే సమీక్ష నిర్వహించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. తుఫాన్ కారణంగా మరణించిన కుటుంబాలని ఆదుకోవాలని దిశానిర్దేశం చేశారు. అలాగే వర్షాల కారణంగా జరిగిన పంట నష్టంపై వెంటనే అంచనాలను రూపొందించాలని, రైతుల ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్ పలు సూచనలు చేశారు.