నివర్ తుఫాన్.. తమిళనాడులో మెట్రో రైళ్లు, విమాన ప్రయాణాలు పునఃప్రారంభం..

నివార్ తుఫాన్ ప్రభావం కారణంగా నిలిచిపోయిన మెట్రో రైళ్ల సేవలను చెన్నై మెట్రో పునరుద్ధరించింది. ఇవాళ మధ్యాహ్నం నుంచి మెట్రో రైళ్లను నడుపుతోంది.

  • Anil kumar poka
  • Publish Date - 3:24 pm, Thu, 26 November 20
నివర్ తుఫాన్.. తమిళనాడులో మెట్రో రైళ్లు, విమాన ప్రయాణాలు పునఃప్రారంభం..

నివార్ తుఫాన్ ప్రభావం కారణంగా నిలిచిపోయిన మెట్రో రైళ్ల సేవలను చెన్నై మెట్రో పునరుద్ధరించింది. ఇవాళ మధ్యాహ్నం నుంచి మెట్రో రైళ్లను నడుపుతోంది. హాలిడే టైమ్ టేబుల్ ప్రకారం మెట్రో రైళ్లను నడపనున్నట్లు చెన్నై మెట్రో అధికారులు ప్రకటించారు. నివార్ తుఫాన్ నిన్న రాత్రి తీరం దాటే అవకాశం ఉండటంతో అప్రమత్తమైన చెన్నై మెట్రో అధికారులు బుధవారం రాత్రి 8 గంటలకే మెట్రో రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేశారు. తుఫాన్ తీవ్రత దృష్ట్యా మెట్రో సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. తిరిగి గురువారం మధ్యాహ్నం మెట్రో రైళ్లను నడుపుతామని ప్రకటించారు. తాజాగా నివార్ తుఫాన్ ప్రభావం కొద్దిగా తగ్గడంతో అధికారులు మెట్రో సేవలను తిరిగి ప్రారంభించారు. ఇదిలా ఉండగా, చెన్నై అంతర్జాతీయ విమానశ్రయంలోనూ విమాన ప్రయాణాలను పునరుద్ధరించారు. దాదాపు 14 గంటల విరామం తరువాత గురువారం ఉదయం 9 గంటలకు విమాన ప్రయాణాలకు ఎయిర్ పోర్టు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

నివార్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడు రాష్ట్రం గజగజ వణికిపోతోంది. తుఫాన్ కారణంగా రాష్ట్రంలో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. చెట్లు కుప్పకూలాయి. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపోవడం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇళ్లలోకి కూడా వర్షం నీరు వచ్చి చేరడంతో జనజీవనం స్తంభించిపోయింది. పలు చోట్ల చెట్లు కూలి మీద పడటంతో కొందరు మృత్యువాత పడ్డారు. ఇదిలాఉండగా, నివార్ తుఫాన్ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలను తరలిస్తోంది. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దింపింది.