రైటరే కాదు చీటర్ కూడా..

హైదరాబాద్‌ : ప్రేమించి సహజీవనం చేసి పెళ్ళి చేసుకొని రాత్రికి రాత్రే ఉడాయించిన సినీ రచయితపై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో చీటింగ్‌ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే… విశాఖకు చెందిన యర్రంశెట్టి రమణ గౌతం కూకట్‌పల్లిలో అద్దెకుంటూ బుల్లితెర, వెండితెరకు సినీ రచయితగా పని చేస్తున్నారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12లోని ఎన్బీటీ నగర్‌కు చెందిన భవానీ అనే యువతితో నాలుగేళ్ళ క్రితం ప్రేమలో పడ్డాడు. ఆమె సంపాదించినదంతా దండుకుంటూ పెళ్ళి చేసుకుంటానని నమ్మించి సహ జీవనం చేశాడు.

పెళ్ళి చేసుకోవాలని ఎన్నిసార్లు ఒత్తిడి చేసినా ఇవాళ రేపు అంటూ తప్పించుకోసాగాడు. ఆమె తనను పెళ్ళి చేసుకుంటానని మోసగిస్తున్న రమణగౌతంపై చర్యలు తీసుకోవాలంటూ నాలుగు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రమణగౌతంను బంజారాహిల్స్‌ పోలీసులు పిలిపించి పెళ్ళి చేసుకోవాలంటూ సూచించడంతో అదే రోజు బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12లోని ఓ గుడిలో పెళ్ళి చేసుకొని అదే రాత్రి ఉడాయించాడు. శుక్రవారం ఉదయం ఆమెకు ఫోన్‌ చేసి నువ్వంటే ఇష్టంలేదు, విడాకులు తీసుకుందామంటూ వెల్లడించాడు. దీంతో ఆమె షాక్‌ తింది. శనివారం మోసగాడిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ బచ్చు శ్రీనివాస్‌ నిందితుడిపై చీటింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *