ఆత్మకూరు వెళ్లి తీరుతా.. చంద్రబాబు.. వైసీపీ నేతల కౌంటర్

chandrababu son placed under house arrest ahead of protest rally, ఆత్మకూరు వెళ్లి తీరుతా.. చంద్రబాబు.. వైసీపీ నేతల కౌంటర్

తనను గృహనిర్బంధం చేసినా సరే.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మకూరు వెళ్లితీరుతానని టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తమ పార్టీ ‘ ఛలో ఆత్మకూరు ‘ కు పిలుపునిచ్చిన దృష్ట్యా.. ఇందుకు పార్టీ నేతలు, కార్యకర్తలంతా సిధ్ధంగా ఉండాలని ఆయన కోరారు. తనను హౌస్ అరెస్టు చేసినప్పటికీ.. ఇంటిలోనే ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దీక్ష చేస్తానని ఆయన అన్నారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వ అరాచకాలను ఎండగట్టి తీరుతాం అని ఆయన పేర్కొన్నారు. టీడీపీ ‘ ఛలో ఆత్మకూరు ‘ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో.. నరసారావుపేట, సత్తెనపల్లి, పల్నాడు, గురజాల పట్టణాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఎక్కడికక్కడ టీడీపీ నేతలను హౌస్ అరెస్టు చేశారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ సహా అనేకమందిని గృహ నిర్బంధం చేశారు. అయితే ఇలాంటి చర్యలకు బెదిరేదిలేదని చంద్రబాబు అంటున్నారు. పల్నాడులో తమ పార్టీ కార్యకర్తలైన 8 మందిని వైసీపీ కార్యకర్తలు హత్య చేశారని ఆయన ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన దుయ్యబడుతున్నారు.

ఇలాఉండగా..చంద్రబాబు ఆరోపణలను, టీడీపీ ‘ ఛలో ఆత్మకూరు ‘ కు పిలుపునివ్వడాన్ని వైసీపీ నేతలు ఖండిస్తూ.. ఇది ‘ దొంగే దొంగ ‘ అన్నట్టు ఉందని అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అనేకమంది వైసీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు హత్యకు గురయ్యారని వారు కౌంటరిచ్చారు. చంద్రబాబుకు మరే ఇతర సమస్యలు లేవని, అందుకే పల్నాడు, ఆత్మకూరులలో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని వారన్నారు. టీడీపీకి పోటీగా తాము కూడా ‘ ఛలో ఆత్మకూరు ‘ కు పిలుపునిస్తున్నట్టు వారు తెలిపారు. ఆ పట్టణాల్లో నాడు.. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ స్పీకర్ కోడెల చేతిలో బాధితులైన ఎంతోమంది తమ ఆవేదనను, కష్టాలను వెల్లడించేందుకు సిధ్దంగా ఉన్నారు.. ఉదాహరణకు కోడెల కుమార్తె విజయలక్ష్మి ఓ భూ వివాదంలో ఓ మహిళ నుంచి రూ. 20 లక్షలు డిమాండ్ చేసిందని, దీంతో బాధిత మహిళ ఇఛ్చిన ఫిర్యాదుతో నరసారావుపేట రూరల్ పీఎస్ లో విజయలక్ష్మిపై కేసు నమోదయిందని వారు గుర్తు చేశారు. ‘ కె (కోడెల) టాక్స్ ‘ పేరిట ఆయన కుమారుడు కూడా అక్రమంగా బాధితుల నుంచి డబ్బులు వసూలు చేయలేదా అని వారు ప్రశ్నించారు.

ఓ వైపు జగన్ అవినీతిరహిత, పారదర్శక ప్రభుత్వం కోసం పరితపిస్తుంటే మరోవైపు తెలుగుదేశం నేతలు సమస్యలు కానివాటిని భూతద్దంలో చూపుతూ ఈ సర్కార్ పై ప్రజల్లో ఏదోవిధంగా వ్యతిరేకత తెచ్చేందుకు యత్నిస్తున్నారని, కానీ వారి ప్రయత్నాలు ఫలించబోవని వైసీపీ నాయకులు పేర్కొన్నారు. మీ ప్రభుత్వ హయాంలో మా పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టలేదా అని వారు ప్రశ్నించారు. నరసారావుపేట, వినుకొండ, సత్తెనపల్లి, చిలకలూరిపేట వంటి నియోజకవర్గాల్లో మా వాళ్ళు ఎన్నో వేధింపులకు గురయ్యారు అని వారు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *