వైసీపీ పొలిటికల్ టెర్రరిజం సృష్టిస్తోంది – చంద్రబాబు

Chandrababu Naidu YS Jagan Government, వైసీపీ పొలిటికల్ టెర్రరిజం సృష్టిస్తోంది – చంద్రబాబు

అమరావతి: ఏపీ అసెంబ్లీలో కరవుపై చర్చ సందర్భంగా అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 2014 నుంచి రైతులకు సున్నా వడ్డీ పథకం అమలు చేశామంటూ టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు వివరించారు. దీనిపై సీఎం జగన్ స్పందించారు. 2014 నుంచి 2019 వరకు సున్నా వడ్డీ పథకం కింద ఎంత ఇచ్చారో చెప్పాలని చంద్రబాబుకు సీఎం జగన్‌ సవాల్‌ విసిరారు. రికార్డులు తెప్పిస్తా చంద్రబాబు రాజీనామా చేస్తారా? అని జగన్ డిమాండ్ చేశారు. కాగా… విత్తనాలు ఇవ్వలేని పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇలా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరుకుంది. ఇక ఈ విషయంపై చంద్రబాబు నాయుడు తాజా ప్రెస్‌మీట్‌లో ఏమన్నారంటే…

కరువుపై చర్చ వదిలేసి తనపై వ్యక్తిగత దాడికి సీఎం వైఎస్ జగన్ దిగడం సరికాదని ప్రతిపక్ష నేత చంద్రబాబు తెలిపారు. అటు కాళేశ్వరం గురించి మాట్లాడుతూ గాడిదలు కాసేరా అని కించపరిచేలా మాట్లాడడం సరైనది కాదని అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అన్ని విషయాలు స్టడీ చేసి మాట్లాడాలని చంద్రబాబు హితవు పలికారు. తాను సీఎంగా ఉన్నప్పుడు లక్షలోపు రుణం ఉన్నవారికి సకాలంలో చెల్లిస్తే వడ్డీ మాఫీ చేశామని స్పష్టం చేశారు. జీవో జారీ చేసింది అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అని చంద్రబాబు వెల్లడించారు. ఇక ఇదే విషయాన్ని తాము చెబుతున్నప్పుడు ఐదారుగురు వైసీపీ నేతలు వల్గర్‌గా, అసభ్యంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు పొలిటికల్ టెర్రరిజం సృష్టించి టీడీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. పోలీసులను సైతం నిర్వీర్యం చేశారు. తన అనుభవమంత లేదు.. జగన్ వయసు.. అన్నీ నేర్చుకోమని చెప్పినందుకు కూడా తనపై ఎదురుదాడికి దిగారని, రాజీనామా చేయాలనీ డిమాండ్ చేస్తున్నారని వాపోయారు. తమ దగ్గర అన్ని ఆధారాలు నివేదికలో స్పష్టంగా ఉన్నాయి. ఇప్పుడు జగన్ రాజీనామా చేస్తారా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *