టీటీడీపీ బలోపేతంపై బాబు దృష్టి..జమిలీ ఎన్నికలే టార్గెట్!

Chandrababu Comments On Jamili Elections, టీటీడీపీ బలోపేతంపై బాబు దృష్టి..జమిలీ ఎన్నికలే టార్గెట్!

తెలంగాణలో టీడీపీను మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. తెలంగాణలో నూతన నాయకత్వం తయారవ్వాలన్నారు. తెదేపా ఆవిర్భవించింది హైదరాబాద్‌లోనేనని, అందుకే పార్టీకి ఇక్కడ పునర్‌ వైభవం తీసుకురావాలని సూచించారు. హైదరాబాద్‌ విచ్చేసిన ఆయన ఎన్టీఆర్‌ భవన్‌లో పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో శనివారం భేటీ అయ్యారు. తాజా రాజకీయాలు, తెలంగాణలో పార్టీ బలోపేతం వంటి అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కొందరు నాయకులు స్వార్థం కోసం పార్టీని వీడారని చంద్రబాబు అన్నారు. ఒక నాయకుడు పోతే వంద మందిని తయారు చేసుకునే శక్తి టీడీపీకు ఉందన్నారు. తెలుగుదేశం కార్యకర్తలను అణగదొక్కాలని చూసినా ఎదురొడ్డి నిలిచారని గుర్తుచేశారు. ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు వంటి నేతలు మనకు కావాలని చంద్రబాబు అన్నారు. ఎంతగా ప్రలోభపెట్టినా టీడీపీను వీడేది లేదని మెచ్చా నాగేశ్వరరావు చెప్పారని వివరించారు. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే పార్టీ మళ్లీ బలపడుతుందన్న నమ్మకం తనకుందని విశ్వాసం వ్యక్తంచేశారు.

తెలంగాణలో పార్టీకి అండగా ఉంటానని… కొందరు నేతలు పార్టీ వీడినంత మాత్రానా వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. నియోజకవర్గాల కమిటీల ని  గ్రామ స్థాయి కమిటీలు కూడా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పాటుపడాలని పిలుపునిచ్చారు. దాదాపు 9నెలల తర్వాత చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు విచ్చేశారు. ఇకపై తెలంగాణపై పూర్తి స్థాయి దృష్టి కేటాయిస్తానని ఆయన నేతలకు తెలిపారు.

జమిలీ ఎన్నికలపై బాబు గురిపెట్టారా:

లోక్‌సభకు, అన్ని రాష్ర్టాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచనను ప్రధాని మోదీ ముందుకు తెచ్చిన నేపథ్యంలో సాధ్యాసాధ్యాలపై జాతీయ స్థాయిలో చర్చ ప్రారంభమైంది. చట్టపరంగా కొన్ని మార్పులు చేయడంతోపాటు మౌలిక సదుపాయాలు మెరుగుపర్చుకుంటే లోక్‌సభ, శాసనసభలకు ఎన్నికలు సులభమేనని ఎన్నికల కమిషన్ వర్గాలు చెప్తున్నాయి.

జమిలి ఎన్నికలు నిర్వహించడం అంటే లోక్‌సభకు, అన్ని రాష్ర్టాల అసెంబ్లీలకు ఒకే సమయంలో ఎన్నికలు జరుపడం. ఆయా ప్రభుత్వాల కాలపరిమితి ఒకే రోజున తీరాల్సి ఉంటుంది. భారతదేశం 1950లో రిపబ్లిక్ మారిన తర్వాత 1952లో తొలిసారి దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరిగాయి. దేశంలో జమిలి ఎన్నికల ప్రక్రియ తొలి లోక్‌సభ, రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మొదలైంది. నాలుగో లోక్‌సభకు ఆటంకం కలిగేంత వరకూ జమిలి ఎన్నికలు కొనసాగాయి. ఆ తర్వాత కేంద్రంలో ఆయా రాష్ర్టాల్లో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒక్కో రాష్ర్టానికి ఒక్కో కాలపరిమితి ఏర్పడుతూ వచ్చింది. కాగా కేంద్రంలో పూర్తి మెజార్టీతో ఉన్న బీజేపీ జెమిలీ ఎన్నికలపై దృష్టి పెడుతోంది. అన్ని కుదిరితే 2022 చివర్లో..లేదా 2013 స్టార్టింగ్‌లో జమిలీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. అందుకే చంద్రబాబు కూడా ఉభయ రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి నడుం బిగించారు. ఏపీలో అధికారం దిశగా..తెలంగాణలో కీలక భూమిక పోషించేలా ఆయన పావులు కదుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *