Chandrababu: నా పరిస్థితే ఇలా ఉంటే.. ప్రజల పరిస్థితేంటి.. బాబు సూటి ప్రశ్న..!

14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి, 25సంవత్సరాలుగా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూ.. 11వ సంవత్సరం ప్రతిపక్షనాయుడిగా ఉన్న తన పరిస్థితే ఇలా ఉంటే.. రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు.

Chandrababu: నా పరిస్థితే ఇలా ఉంటే.. ప్రజల పరిస్థితేంటి.. బాబు సూటి ప్రశ్న..!
Follow us

| Edited By:

Updated on: Feb 27, 2020 | 4:26 PM

14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి, 25సంవత్సరాలుగా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూ.. 11వ సంవత్సరం ప్రతిపక్షనాయుడిగా ఉన్న తన పరిస్థితే ఇలా ఉంటే.. రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు. విశాఖ పర్యటనకు వెళ్లిన బాబును ఎయిర్‌పోర్ట్ సమీపంలో వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కాసేపు రోడ్డుపై బైఠాయించిన ఆయన.. ఆ తరువాత మీడియాతో మాట్లాడారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం విశాఖకు వచ్చానని.. ఆ పర్యటనకు సంబంధించి పర్మిషన్ కూడా తీసుకున్నామని ఆయన అన్నారు. అయితే ఇక్కడ దిగిన తరువాత వైసీపీ నాయకులు డబ్బులు ఇచ్చి మనుషులను తీసుకొచ్చి పెద్ద ఎత్తున తమపై దాడికి ప్రయత్నించారని ఆయన అన్నారు. తమపై కోడిగుడ్లు, చెప్పులు, వాటర్ బాటిల్, రాళ్లు కూడా వేయించారని ఆయన మండిపడ్డారు.

వాటిని దాటుకొని ఇక్కడకు వచ్చిన తమను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారని., ఏంటని పోలీసులను అడిగితే.. వారు రెండున్నర గంటలకు పైగా తమను వెయిట్ చేయించి, కాసేపటి క్రితం వచ్చి మీరు డైరెక్ట్‌గా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లండి అంటూ దురుసుగా చెప్తున్నారని అన్నారు. అరెస్ట్ చేయాలనుకుంటే ఏ చట్టం కిందో చెప్పి, నోటీసు ఇచ్చి అరెస్ట్ చేయండని.. అప్పుడు తాను ఎక్కడికి రమ్మన్నా వస్తానని చెప్పారు. తాను ఎప్పుడు క్రమశిక్షణతో ఉంటానని, చట్టాలను ఉల్లంఘించనని.. పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని అన్నారు. అంతేకానీ.. మీరే రావాలని లాగడం, గౌరవ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను లాగడం, బెదిరించడం ఇది మంచి పద్దతి కాదని బాబు ఫైర్ అయ్యారు.

విశాఖ చాలా ప్రశాంతమైన నగరమని.. ఈ నగరంలో ఇప్పటివరకు ఇలా ఎప్పుడూ జరగలేదని బాబు చెప్పుకొచ్చారు. విశాఖలో చెరువులు, భూములు కబ్జా చేశారని.. అవి చూసేందుకు వెళ్తే ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని బాబు ప్రశ్నించారు. నిజమైతే ప్రజలు నమ్ముతారని, లేదంటే నమ్మరని ఆయన అన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని బాబు చెప్పుకొచ్చారు. ప్రతి విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని.. వారు తిరుగుబడితే ఎవ్వరూ ఏం చేయలేరని ఆయన అన్నారు. పోలీసులు కూడా ఒక్క ఉద్యోగం గురించి ఆలోచించి ఇలా చేయకూడదని బాబు హితవు పలికారు.