కశ్మీర్‌పై కేంద్రానికి గడువు: సుప్రీం

Centre Should Get Reasonable Time To Ensure Normalcy In J&K: Top Court

జమ్ముకశ్మీర్‌లో ఆంక్షల్ని సడలించాలంటూ దాఖలైన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్‌ అరుణ్‌ మిశ్రాతో కూడిన ధర్మాసనం దీనిపై వాదనలు స్వీకరించింది. రాష్ట్రంలో అన్ని రకాల ఆంక్షల్ని విధించారని పిటిషనర్‌ తెహసీన్‌ పూనవాల ధర్మాసనానికి తెలిపారు. దీంతో అరుణ్‌ మిశ్రా అక్కడి పరిస్థితుల్ని అటార్నీ జనరల్ కేకే.వేణుగోపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. రోజురోజుకీ అక్కడ పరిస్థితులు మెరుగవుతున్నాయని.. ప్రశాంత వాతావరణానికి కేంద్రం చర్యలు తీసుకుంటోందని వేణుగోపాల్‌ వివరించారు. క్రమంగా ఆంక్షలు సడలించే యోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు. 2016లో మూడు నెలలు కఠిన ఆంక్షలు విధించారని.. దాదాపు 47 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. ప్రస్తుతం అలాంటి ప్రాణనష్టం ఏమీ సంభవించలేదని స్పష్టం చేశారు.

త్వరలో కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని అటార్నీ జనరల్‌ ధర్మాసనానికి వివరించారు. అక్కడ మానవ హక్కుల పరిరక్షణకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ప్రజలకు విద్య, వైద్యం లాంటి కనీస వసతులను అందుబాటులో ఉంచామని తెలిపారు. అక్కడి జిల్లాల్లో పరిస్థితుల ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. అటార్నీ జనరల్ వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కేంద్రానికి సమయం ఇవ్వాలని నిర్ణయించింది. పిటిషన్‌పై తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *