#LOCK DOWN UPDATE రాష్ట్రాలకు కేంద్రం తాజా ఆదేశాలు

21 రోజుల లాక్ డౌన్ దేశంలో ప్రజా జీవితాన్ని పూర్తిగా స్థంభింపచేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు తాజాగా కొన్ని ఆదేశాలను జారీ చేసింది. లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో...

#LOCK DOWN UPDATE రాష్ట్రాలకు కేంద్రం తాజా ఆదేశాలు
Follow us

|

Updated on: Mar 27, 2020 | 10:26 AM

Modi govt issued fresh guidelines to states: 21 రోజుల లాక్ డౌన్ దేశంలో ప్రజా జీవితాన్ని పూర్తిగా స్థంభింపచేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు తాజాగా కొన్ని ఆదేశాలను జారీ చేసింది. లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో తాజా ఆదేశాల అమలు అత్యంత అనివార్యమని కేంద్రం స్పష్టం చేసింది. గతంలో కనీ వినీ ఎరుగని రీతిలో దేశంలో 21 రోజుల లాక్ డౌన్ విధించారు. ఇది ఎమర్జెన్సీ పరిస్థితి కంటే తీవ్రంగా ప్రజలను ఇబ్బంది పెడుతోంది. అయితే.. ప్రాణాంతకమైన కరోనా వ్యాప్తిని నిరోధించాలంటే ఇంత కంటే వేరే మార్గం లేదని ప్రతీ ఒక్కరు అంగీకరించాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో కేంద్రం రాష్ట్రాలకు చేసిన సూచనలు అత్యంత కీలకంగా మారాయి.

మార్చి 22న కేవలం 14 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటిస్తే చాలు కరోనా వైరస్ అంతరించి పోతుందనుకున్న ప్రజలు ఆదివారం నాడు అత్యంత పక్కాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునకు స్పందించారు. అయితే.. ఆ తర్వాత గుక్క తిప్పుకోకుండా వరుస లాక్ డౌన్ ప్రకటనలు దేశ ప్రజలకు షాకిచ్చాయి. ముందుగా మార్చి 31 దాకా తెలుగు రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటింగా… 24 గంటల్లోపే దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ప్రధాని… ఏకంగా 21 రోజుల పాటు అంటే ఏప్రిల్ 14వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని ప్రకటించారు. కరోనా నిరోధానికి ఈ లాక్ డౌన్ అనివార్యమైందని ఆయన చెప్పారు.

ప్రభుత్వాల పిలుపులో తీవ్రతను ప్రజలు అర్థం చేసుకున్నా.. పేద, దిగువ మధ్య తరగతి ప్రజలకు ఈ లాక్ డౌన్ అత్యంత దారుణమైన పరిస్థితులను సృష్టించింది. ముఖ్యంగా ఉపాధి కోసం దేశంలో ఎక్కడి నుంచి మరెక్కడికో వలస వెళ్ళి దినసరి కూలీ మీద జీవితాలను వెల్లదీస్తున్న వారికి లాక్ డౌన్ తినడానికి తిండి లేకుండా చేసింది. నిలువ నీడ లేకుండా చేసింది. దాంతో ఎలాగైనా తమ స్వస్థలాలకు చేరుకునేందుకు రకరకాల మార్గాలను ఆశ్రయిస్తున్నారు వలస కార్మికులు, వలస జీవులు. కొందరైతే వందల కిలోమీటర్లు కాలినడకన తమ సొంత ప్రాంతాలకు తరలి వెళుతున్నారు.

మరికొందరు అక్రమ మార్గాల్లో సొంత ప్రాంతాలకు చేరేందుకు ట్రై చేస్తున్నారు. ఇందులో భాగమే.. తాజాగా మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి గూడ్స్ వెహికిల్ వచ్చేందుకు విఫలయత్నం చేసినవారే ఉదాహరణ. ఇలాంటి వారికోసమే తాజాగా కేంద్రం అన్ని రాష్ట్రాలకు నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తమతమ రాష్ట్రాలలో వలస కార్మికులుగా జీవనం వెల్లదీస్తున్న వారికి అక్కడే ఏదో రకంగా షెల్టర్ కల్పించాలన్నది కేంద్రం తాజాగా ఇచ్చిన ఆదేశాల సారాంశం. వలస జీవులకు తాత్కాలిక షెల్టర్లు నిర్మించి ఆశ్రయం కల్పించాలని, కేంద్రం ఇస్తున్న బియ్యం, గోధుమలు, పప్పు ధాన్యాలను వారికి చేరేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

గురువారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ దేశంలోని 18 మంది ముఖ్యమంత్రులకు లేఖ రాస్తూ.. వారి వారి రాష్ట్రాలలో వున్న బెంగాలీలకు ఆశ్రయం, ఆహార సౌకర్యాలు కల్పించాలని కోరారు. అదే విధంగా తెలంగాణలో వున్న ఆంధ్రా కార్మికులకు, విద్యార్థులకు, తాత్కాలిక ఉద్యోగులకు ఆశ్రయం కల్పించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్.. కేసీఆర్‌ను కోరారు. ఈ క్రమంలో కేంద్రం వలస జీవుల కష్టాలపై స్పందిస్తూ… వారికి ఆశ్రయ, ఆహార సౌకర్యాలు కల్పించాలని రాష్ట్రాలకు సూచించింది.