#Lock-down ఆ 800 మంది బ్లాక్ లిస్టులో.. కేంద్రం ఝలక్

కరోనా కట్టడి అవుతుందన్న సంకేతాలు ఒకవైపు దేశ ప్రజల్లో ఆనందానికి దారి తీస్తున్న తరుణంలో వెలుగు చూసిన తబ్లీఘ్-ఏ-జమాత్‌ సదస్సుకు హాజరైన వారి మరణాలు యావత్ దేశాన్ని ఉలిక్కి పడేలా చేశాయి.

#Lock-down ఆ 800 మంది బ్లాక్ లిస్టులో.. కేంద్రం ఝలక్
Follow us

|

Updated on: Mar 31, 2020 | 1:48 PM

Centre block listed 800 foreigners: కరోనా కట్టడి అవుతుందన్న సంకేతాలు ఒకవైపు దేశ ప్రజల్లో ఆనందానికి దారి తీస్తున్న తరుణంలో వెలుగు చూసిన తబ్లీఘ్-ఏ-జమాత్‌ సదస్సుకు హాజరైన వారి మరణాలు యావత్ దేశాన్ని ఉలిక్కి పడేలా చేశాయి. ప్రపంచాన్ని కరోనా కలవరపరుస్తున్న తరుణంలో ఇంత పెద్ద సదస్సుకు ఢిల్లీ ప్రభుత్వం ఎలా అనుమతించిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీసా నిబంధనలను ఉల్లంఘించి మరీ పలువురు విదేశీయులు ఈ సదస్సులో పాల్గొంటే పోలీసులు ఏం చేశారనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్రం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. వీసా నిబంధనలను ఉల్లంఘించిన 800 మంది విదేశీయులు భవిష్యత్తులో భారత్‌లోకి రాకుండా వారిని బ్లాక్ లిస్టులో చేర్చే ప్రక్రియ ప్రారంభమైంది.

టూరిస్టు వీసాపై భారత్‌కు వచ్చి మత ప్రచార సభలకు, సదస్సులకు వీరు హాజరుకావడం నిబంధనలకు విరుద్దం. ఇండోనేషియా, మలేషియా, కిర్గిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి హాజరు కావడం మరింత కలవర పరుస్తోంది. ఆయా దేశాల్లో పలువురు హిందుస్తాన్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే వారు తలదాచుకున్న విషయాన్ని మన నిఘా సంస్థలు పలు మార్లు హెచ్చరించాయి కూడా. ఇలా వీసా నిబంధనలు ఉల్లంఘించిన 800 విదేశీయుల గుర్తించింది కేంద్రం. వారందరినీ బ్లాక్‌లిస్టులో పెట్టే దిశగా చర్యలకు ఉపక్రమించింది కేంద్ర ప్రభుత్వం.

ఢిల్లీలో సదస్సుకు వచ్చిన ఇండోనేషియన్లు కరీంనగర్‌కు రావడం, కరీంనగర్, జగిత్యాల పరిసర ప్రాంతాల్లో చిన్న చిన్న గ్రామాల్లోని ప్రార్థనా మందిరాల్లో రోజుల కొద్ది గడపడం వెనుక కారణాలను సెక్యురిటీ సంస్థలు వెలుగు తీయాల్సిన అవసరాన్ని తాజా పరిణామాలు సూచిస్తున్నాయని పలువురు వాదిస్తున్నారు. వీసా నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించడమే కాకుండా.. గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించడం వెనుక ఉద్దేశాలను వెలికి తీయాలంటే ఇండోనేషియా నుంచి వచ్చి మన దేశంలో కరోనా ట్రీట్‌మెంట్ తీసుకున్న వారిని లోతుగా విచారించాల్సి వుంటుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.