HCU కీల‌క నిర్ణ‌యం.. విద్యార్థులకు గోల్డెన్ ఆఫ‌ర్ !

క‌రోనా నేప‌థ్యంలో ఈ ఏడాది అన్ని వ్య‌వ‌స్థ‌లు వెనుక‌బ‌డిపోయాయి. ముఖ్యంగా విద్యా వ్య‌వ‌స్థ అగ్య‌మ‌గోచ‌రంగా మారింది. ఈ నేప‌థ్యంలోనే హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) కీలక నిర్ణయాలు తీసుకుంది.

HCU కీల‌క నిర్ణ‌యం.. విద్యార్థులకు గోల్డెన్ ఆఫ‌ర్ !
Follow us

|

Updated on: Apr 18, 2020 | 1:49 PM

క‌రోనా నేప‌థ్యంలో ఈ ఏడాది అన్ని వ్య‌వ‌స్థ‌లు వెనుక‌బ‌డిపోయాయి. ముఖ్యంగా విద్యా వ్య‌వ‌స్థ అగ్య‌మ‌గోచ‌రంగా మారింది. ఈ నేప‌థ్యంలోనే హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యార్థులకు విద్యాసంవ‌త్స‌రం వృద్ధాకాకుండా చూడేలా కొత్త విధానాల‌కు శ్రీకారం చుడుతోంది. హెచ్‌సీయూలో పీజీ, ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో చివరి సెమిస్టర్‌ విద్యార్థులకు పరీక్షలను ఆప్షనల్‌ చేసింది. గతంలో జరిగిన సెమిస్టర్లు, ఇంటర్నల్స్‌లో విద్యార్థులు చూపిన ప్రతిభ ఆధారంగా.. అన్నింటికీ కలిపి సగటు తీసి చివరి సెమిస్టర్‌ గ్రేడ్‌ పాయింట్లు వర్సిటీనే కేటాయించనుంది. ఈ గ్రేడ్లను విద్యార్థికి తెలియజేస్తారు. ఆ గ్రేడ్ల‌ను స‌మ్మ‌తించ‌ని విద్యార్థులు ప‌రీక్ష రాసేందుకు అవ‌కాశం క‌ల్పించ‌నుంది. ఈ ఈ మేర‌కు వ‌ర్సిటీ అకడమిక్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

పరీక్ష రాసిన విద్యార్థికి వర్సిటీ కేటాయించిన గ్రేడ్‌ కంటే తక్కువ వస్తే.. వర్సిటీ గ్రేడ్‌నే కొనసాగిస్తారు. లేకపోతే విద్యార్థి ఎక్కువ గ్రేడ్‌ సాధిస్తే దాన్నే కేటాయిస్తారు. ఈ మేరకు వర్సిటీ తరఫున హ్యుమానిటీస్‌, సైన్సెస్‌ విభాగాల ప్రొఫెసర్లతో ప్రత్యేక కమిటీలు వేసి గ్రేడ్లు నిర్ణయిస్తారు. వాస్తవ షెడ్యూల్‌ ప్రకారం మే 21 నుంచి పరీక్షలు జరగాల్సి ఉంది. తాజా నిర్ణయంతో పరీక్షలు లేకుండానే విద్యార్థులకు పట్టా అందనుంది. విద్యార్థుల‌కు మేలు చేసే మ‌రిన్ని కీల‌క నిర్ణ‌యాల‌ను కూడా వ‌ర్సిటీ ప్ర‌క‌టించింది. అందులో భాగంగా ప్రస్తుత సెమిస్టర్‌కు సంబంధించి విద్యార్థులకు హాజరు నుంచి మినహాయింపు లభించనుంది. కనీస హాజరు అవసరం లేకుండా విద్యార్థులను తర్వాతి సెమిస్టర్‌కు ప్రమోట్ చేయ‌నుంది.

ఇక‌, ఎంఫిల్‌, పీహెచ్‌డీ, ఎంటెక్‌ కోర్సులకు సంబంధించి వైవా పరీక్షలు స్కైప్‌ సాయంతో ఆన్‌లైన్‌లో నిర్వహించ‌నుంది. ఎంటెక్‌ తదితర కోర్సుల పరంగా విద్యార్థులు సమర్పించే ప్రాజెక్టులను వర్సిటీ ఇంటర్నల్‌ కమిటీని ఏర్పాటు చేసి దిద్దించ‌నున్నారు. గతంలో బయట నుంచి వచ్చే నిపుణుల కమిటీ పరిశీలన చేసి మార్కులు ఇచ్చేది. అలాగే యూజీసీ సూచనల మేరకు పీహెచ్‌డీ థీసిస్‌ సమర్పణ గడువును ఆర్నెళ్లు పొడిగించాలని వర్సిటీ నిర్ణయించింది. హెచ్‌సీయూ తీసుకున్న తాజా నిర్ణ‌యాల‌తో చివరి ఏడాది విద్యార్థులు ఉన్నత చదువులు, ఉద్యోగ అవ‌కాశాల‌కు ఇబ్బందులు త‌లెత్త‌కుండా ఉంటుంద‌ని వర్సిటీ భావిస్తోంది.