రేపు రాష్ట్రానికి సెంట్రల్ టీం.. కరోనా కట్టడిపైనే ఫోకస్ !

తెలంగాణలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. కరోనా కేసుల సంఖ్య వెయ్యి మార్క్ ను దాటిపోయింది. తెలంగాణలో కరోనా వ్యాప్తికి కారణాలేంటి? కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలేంటి? ఇలాంటి అంశాలపై ఫోకస్ పెట్టిందీ కేంద్రం.

రేపు రాష్ట్రానికి సెంట్రల్ టీం.. కరోనా కట్టడిపైనే ఫోకస్ !
Follow us

| Edited By:

Updated on: Jun 28, 2020 | 2:22 PM

తెలంగాణలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. కరోనా కేసుల సంఖ్య వెయ్యి మార్క్ ను దాటిపోయింది. తెలంగాణలో కరోనా వ్యాప్తికి కారణాలేంటి? కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలేంటి? ఇలాంటి అంశాలపై ఫోకస్ పెట్టిన కేంద్రం, కరోనా వ్యాప్తి నియంత్రణకు తగిన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు నాలుగోసారి ప్రత్యేక బృందాన్ని పంపుతోంది. గత పర్యటనలో తెలంగాణ సర్కారు చేపడుతున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేసిన కేంద్ర బృందం ఈ పర్యటనలో ఎలాంటి రిమార్క్స్ ఇస్తుందన్నది ఉత్కంఠగా మారింది.

తెలంగాణ‌లో కరోనా వైర‌స్ ఉధృతిపై కేంద్రం దృష్టిసారించింది. క‌రోనా క‌ట్ట‌డిపై దేశంలో ఎదుర‌వుతున్న అనుభ‌వాల దృష్ట్యా రాష్ట్రానికి ప్ర‌త్యేక బృందాన్ని పంపుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రెట‌రీ ల‌వ్ అగ‌ర్వాల్ నేతృత్వంలోని బృందం రాష్ట్రంలో పర్యటించనుంది. దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళా..తాజా పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటోంది. కొన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా సమాచారాన్ని సేకరిస్తే.. మరికొన్ని సందర్భాల్లో ప్రత్యేక టీమ్‌లను రాష్ట్రాలకు పంపుతోంది. కరోనా నియంత్రణపై సమీక్షకు నాలుగోసారి సెంట్రల్ టీమ్‌ తెలంగాణకు రానుంది.

జాతీయ స‌గ‌టు క‌న్నా తెలంగాణ‌లో పాజిటివ్ రేటు ఎక్కువ‌గా ఉండ‌టం, గ్రేట‌ర్ హైద‌రాబాద్ స‌హా మ‌రో రెండు జిల్లాల్లో కేసులు తీవ్ర స్థాయిలో న‌మోదు కావడంతో కేంద్రం తెలంగాణపై దృష్టి సారించింది. క‌రోనా పాజిటివ్ రేటులో జాతీయ స‌గ‌టు 8శాతం ఉండ‌గా, తెలంగాణ పాజిటివ్ రేటు 15శాతం వ‌ర‌కు ఉంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని క్షేత్ర స్థాయి ప‌రిస్థితి, కరోనా పరీక్షల నిర్వహణ..మొదలైన అంశాలను కేంద్ర బృందం పరిశీలించనుంది. ముంబై, ఢిల్లీ త‌ర‌హాలో హైదారాబాద్ మ‌రో హాట్ స్పాట్ కాకుండా ఎలాంటి జాగ్ర‌త్తలు తీసుకోవాలో ఈ బృందం అంచ‌నా వేసి, కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు నివేదిక ఇవ్వ‌నుంది. దీని కోసం హైదరాబాద్ తోపాటు కరోనా ఎక్కువగా ఉన్న జిల్లాల్లోనూ పర్యటించనుంది.

రాష్ట్ర ఆరోగ్య, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించి, కరోనా వైరస్ కట్టడికి కీలక సూచనలు చేయనుంది. మార్చి నెలలో కరోనా వైరస్ ప్రభావం మొదలైనప్పటి నుంచి రాష్ట్రాలకు కీలక సూచనలు చేయడంలో చొరవ చూపుతున్న లవ్ అగర్వాల్.. తాజాగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో మరింత పక్కా చర్యలకు ఉపక్రమించారు. అందులో భాగంగా తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్రాల అధికారులతో చర్చించాలని నిర్ణయించారు. అందుకే మూడు కీలక రాష్ట్రాలకు తానే స్వయంగా వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఈనెల 29 వరకూ లవ్ అగర్వాల్ నేతృత్వంలోని బృందం తెలంగాణతోపాటు గుజరాత్, మహారాష్ట్రలోనూ ఈ బృందం పర్యటించనుంది.

ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో పర్యటించిన కేంద్ర బృందాలు, క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి సూచనలు, సలహాలు ఇచ్చాయి. కరోనా కేసులు ప్రారంభమైన కొత్తలో వచ్చిన కేంద్ర బృందం కరోనా బాధితుల కోసం ప్రత్యేక వార్డులు, ఐసోలేషన్ , ల్యాబ్ లను పరిశీలించి వెళ్ళింది. ఆ తర్వాత ఏప్రిల్ 25 నుంచి మే 2 వరకు లాక్ డౌన్ సమయంలోనూ సెంట్రల్ టీమ్ తెలంగాణలో పర్యటించింది. కిందిస్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు పరిస్థితులను సమీక్షించింది. లాక్ డౌన్ సడలింపుల తర్వాత ఇక్కడ కరోనా బాధితులకు అందుతున్న వైద్యం, కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించింది. మరో వైపు ఐసీఎంఆర్ తెలంగాణలో సీరం సర్వే నిర్వహించింది. అయితే తెలంగాణ సర్కార్ తక్కువ టెస్టులు చేస్తోందని బీజేపీ ఆరోపించిన నేపథ్యంలో సెంట్రల్ టీమ్ రాకకు ప్రధాన్యత ఏర్పడింది. బీజేపీ ఆరోపణలకు తెలంగాణ ప్రభుత్వం గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఈ తరుణంలో సెంట్రల్ టీమ్ ఇక్కడి పరిస్థితులపై ఎలాంటి నివేదిక ఇస్తుందో చూడాల్సి ఉంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచే ఉద్దేశంతోనే టీమ్ పర్యటన కొనసాగనున్నట్లు తెలుస్తోంది.