సుప్రీం కోర్టు మహిళా న్యాయవాది ఇంట్లో సీబీఐ దాడులు

సుప్రీంకోర్టు మహిళా న్యాయవాది, మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ ఇందిరా జైసింగ్ దంపతుల ఇళ్లలో సీబీఐ దాడులు నిర్వహించింది. జైసింగ్ ఆమె భర్త ఆనంద్ గ్రోవర్‌లపై విదేశీ నిధుల చట్టం నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై ఈ దాడులు నిర్వహించారు. ఢిల్లీలోని ఇందిరా జైసింగ్ ఇల్లు, జంగ్‌పురాలో లాయర్స్ కలెక్టివ్ స్వచ్ఛంద సంస్థ ఆఫీస్, ముంబైలోని మరో ఆఫీస్‌లో దాడులు నిర్వహించినట్లు సీబీఐ తెలిపింది.

లాయర్స్ కలెక్టివ్ స్వచ్ఛంద సంస్థకు వచ్చిన విదేశీ విరాళాలను ఆనంద్ గ్రోవర్ దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. 2006 నుంచి 2014 మధ్య ఆనంద్ గ్రోవర్ తన స్వచ్ఛంద సంస్థ ద్వారా రూ. 32.39 కోట్లకు పైగా అవకతవకలకు పాల్పడ్డారని హోం శాఖ ఫిర్యాదు చేసింది. దీంతో సంస్థ అధ్యక్షుడు గ్రోవర్ పై విదేశీ సహకార నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణల కింద సీబీఐ కేసు నమోదు చేసింది.

మరోవైపు మోదీ ప్రభుత్వం.. ప్రఖ్యాత న్యాయవాదుల ఇళ్లు, కార్యాలయాలపై సీబీఐ దాడులు చేయిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని విపక్ష ఎంపీలు ఆరోపించారు. ప్రభుత్వం ఇలాంటి బలవంతపు, బెదిరింపు చర్యలను ఆపాలని కోరుతూ ప్రధాని మోదీకి విపక్ష ఎంపీల బృందం లేఖ రాసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *