17 రాష్ట్రాల్లో ఉపఎన్నికలు.. ఇక కాషాయ జెండాకు అగ్నిపరీక్షే !

EC announces bypolls in 17 states, 17 రాష్ట్రాల్లో ఉపఎన్నికలు.. ఇక కాషాయ జెండాకు అగ్నిపరీక్షే !

పుదుచ్ఛేరితో బాటు 17 రాష్ట్రాల్లో 63 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు, బీహార్ లోని ఒక లోక్ సభ స్థానానికి ఎన్నికలను ఈసీ ప్రకటించింది. హర్యానా, మహారాష్ట్రతో బాటు వీటికి అక్టోబరు 21 న ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు అక్టోబర్ 24 న జరుగుతుంది. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, ఛత్తీస్ గడ్, అసోం, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్, మేఘాలయ, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, యూపీలలో బైపోల్స్ జరగనున్నాయి. కర్నాటకలో 17 మంది రెబెల్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ రాష్ట్రంలో 15 సీట్లకు ఉపఎన్నికలు జరుగుతాయి. అసోంలో గత నెలలో ఎన్నార్సీ జాబితా రిలీజ్ చేసిన అనంతరం ఎన్నికలు జరగనుండడం ఇదే మొదటిసారి. ఆ రాష్ట్రంలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. బీహార్లో నాలుగు సీట్లకు, ఒక లోక్ సభ స్థానానికి, యూపీలో పదకొండు సీట్లకు, కేరళ, బీహార్ రాష్ట్రాల్లో అయిదేసి స్థానాలకు, గుజరాత్, పంజాబ్ లలో నాలుగేసి సీట్లకు, సిక్కింలో మూడింటికి, హిమాచల్, తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాల్లో మూడింటి చొప్పున, తెలంగాణ, మధ్యప్రదేశ్, మేఘాలయ, ఒడిశా, పుదుచ్ఛేరిలలో ఒక్కో స్థానానికి పోల్ షెడ్యూల్ ప్రకటించారు.
నామినేషన్ల దాఖలు చివరితేదీని సెప్టెంబరు 30 గా నిర్ణయించారు. అక్టోబరు 3 లోగా నామినేషన్లను ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారాల్లో ప్లాస్టిక్ బ్యానర్లువంటివాటిని వినియోగించుకోకుండా చూడాలని ఈసీ సునీల్ అరోరా సూచించారు.
కాగా- రెండోసారి అధికారంలోకి వఛ్చిన బీజేపీకి ఈ ఎన్నికలు కీలకంగా మారనున్నాయి. మోడీ ప్రభుత్వం అమలులోకి తెస్తున్న వివిధ పథకాలకు ఈ రాష్ట్ర ఓటర్లు ఎలా స్పందిస్తారన్నది ఈ ఎన్నికల్లో కీలకం కానుంది. ఇదే సమయంలో జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370 ని రద్దు చేస్తూ మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రజల మద్దతు ఉందా అన్న విషయం కూడా తేలనుంది. ఆ రాష్ట్రం నుంచి అనేకమంది… ముఖ్యంగా కాశ్మీరీ పండిట్లు గతంలో వివిధ రాష్ట్రాలకువలస వెళ్లిన విషయం తెలిసిందే. ఇక తెలంగాణాలో హుజూర్ నగర్ స్థానానికి జరగనున్న ఉపఎన్నిక ఫలితం తెరాస ప్రభుత్వానికి కీలకం కానుంది. ఇక్కడ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లోక్ సభ ఎంపీగా ఎన్నికైన దృష్ట్యా ఈ సీటుకు ఉపఎన్నిక అనివార్యమైంది. ఇక్కడినుంచి ఆయన భార్య పద్మావతి అభ్యర్థిత్వం దాదాపు ఖరారయిందనే వార్తలు వస్తున్నాయి.

EC announces bypolls in 17 states, 17 రాష్ట్రాల్లో ఉపఎన్నికలు.. ఇక కాషాయ జెండాకు అగ్నిపరీక్షే !

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *