Chit Fund: డబ్బులు డబుల్..అంటూ ప్రచారం..అందినకాడికి దోచుకుని పలాయనం..ప్రైవేటు చిట్ ఫండ్‌ కంపెనీల బాగోతం!

Chit Fund: డబ్బులు డబుల్..అంటూ ప్రచారం..అందినకాడికి దోచుకుని పలాయనం..ప్రైవేటు చిట్ ఫండ్‌ కంపెనీల బాగోతం!
Chit Fund

పిల్లల చాడువుకోసమో.. పెళ్ళిళ్ళ కోసమో.. సొమ్ము దాచుకుందామనుకునే సామాన్య ప్రజలే టార్గెట్ గా సాగుతున్న ఛీట్ ఫండ్ కంపెనీలతో జాగ్రత్తగా ఉండాల్సిందే.

KVD Varma

|

Apr 15, 2021 | 4:51 PM

Chit Fund: ప్రైవేటు చిట్టీలు వేస్తున్నారా? చిట్ ఫండ్‌ కంపెనీలలో డబ్బులు కడుతున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే, సదరు వ్యక్తులు లేదా సంస్థలు లక్షలు, కోట్లు వసూలు చేసి రాత్రికి రాత్రే దుకాణం సర్దేసి పారిపోయే అవకాశం ఉంది. పిల్లల చదువులకో, పెళ్లిళ్ల కోసమో డబ్బులు జమ చేసేందుకు చిట్టీలు వేయడం, చిట్ ఫండ్ కంపెనీల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయడం మధ్యతరగతి కుటుంబాల్లో సాధారణమే. ఏ ఊళ్లో చూసినా అనధికారికంగా చిట్టీల లావాదేవీలు నడిపేవాళ్లు ఇబ్బడి ముబ్బడిగా కనిపిస్తుంటారు. ఇంకా చెప్పాలంటే, దాదాపు అన్ని ఊర్లలోనూ ఈ అనధికారికంగా చిట్టీల వ్యాపారం చేస్తూ జీవిస్తున్న వారు పదుల సంఖ్యలోనే ఉంటారు. సమాజంలో ఈ చిట్టీల వ్యవస్థ అంతలా పాతుకుపోయింది. నిజానికి ఆర్‌బీఐ లేదా సెబీ అనుమతితోనే చిట్ ఫండ్ కంపెనీలు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రోజువారీ వసూళ్లు చేయాలి. కానీ, ఎలాంటి అనుమతులు లేకుండానే ఆకర్షించే పథకాలతో డబ్బులు వసూలు చేస్తున్న కంపెనీలు చాలానే ఉన్నాయి. సాధారణంగా ఈ అనధికారిక చిట్టీల కంపెనీలన్నీ ఒకేరకంగా చెబుతాయి. 5-7 ఏళ్లలో మీరు ఇన్వెస్ట్ చేసిన దానికంటే 10 రెట్లు డబ్బులు ఇస్తామని నమ్మిస్తాయి. వీరు భారీ కమిషన్లు ఇస్తామంటూ ఏజెంట్లను నియమించుకుంటారు. ఈ వ్యాపారం అంతా తెలిసిన వారిచుట్టూ జరుగుతుంది. ఈ ఏజెంట్లు ఊళ్ళన్నీ తిరిగేసి మరీ వసూళ్లు చేస్తారు. ఏజెంట్లు తమకు తెలిసినవారే కాబట్టి జనం నమ్మేస్తారు. పెట్టుబడి పెడతారు. ఆ తర్వాత వివిధ కారణాలను చూపించి ఏజెంట్లు ఉద్యోగాలు మానేస్తారు లేదా ఆ అనధికారిక చిట్టీ కంపెనీలు వారిని మానేసేలా చేస్తాయి. డబ్బులు తిరిగి ఇచ్చే గడువు వచ్చేసరికి సహజంగానే ఈ ఏజెంట్లు పత్తా లేకుండా పోతారు. కొన్ని చిట్ ఫండ్ కంపెనీలు మూతపడతాయి. సాధారణంగా కొత్త ఇన్వెస్టర్ల దగ్గర వసూలు చేసిన డబ్బును పాత ఇన్వెస్టర్లకు సర్దుబాటు చేస్తూ కొంత కాలం గడుపుతారు. అయితే, కొత్త ఇన్వెస్ట్‌మెంట్ల రాక ఆగిపోయినప్పుడు పూర్తిగా దుకాణం ఎత్తేస్తారు. అందుకే ఇటువంటి అనధికారిక చిట్టీల వ్యవస్థలకు దూరంగా ఉండడమే మంచిది. అవతలి వ్యక్తులు ఎంత తెలిసినవారైనా సరే.. ఇటువంటి చిట్టీలు.. డిపాజిట్ల జోలికి పోకుండా ఉండడమే మంచిది అని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.

తెలుసుకోవడం ఎలా?

ప్రస్తుతం బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7-9 శాతం వరకు వడ్డీ ఇస్తున్నాయి. దీనికంటే ఎక్కువ వడ్డీ ఇస్తామన్నా, కొద్ది కాలానికే రెట్టింపు డబ్బు ఇస్తామన్నా వారిని అనుమానించాల్సిందే. అసలు ఆ కంపెనీ రిజిస్టర్ అయి ఉందో లేదో ముందుగా తెలుసుకోవాలి. మీ దగ్గర ఫిక్స్‌డ్ డిపాజిట్లు తీసుకొని ఆ కంపెనీ ఏం చేస్తుందో గమనించాలి. ఏజెంట్లు చెప్పే మాయమాటల్ని నమ్మకూడదు. మోసం జరుగుతున్నట్టు అుమానం ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు. వినియోగదారుల కోర్టును కూడా ఆశ్రయించొచ్చు.

చిట్ ఫండ్‌ కంపెనీల మోసాలకు కొన్ని ఉదాహరణలు

  • 2013, డిసెంబర్‌… హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రాంతానికి చెందిన ప్రతిభ చిట్‌ ఫండ్ కంపెనీ భారీ మోసం. అనేకమంది దగ్గర నుండి డబ్బులు వసూలు చేసి ఆ డబ్బుకు వడ్డీ, బంగారం ఇస్తామని ఆశ పెట్టిన కంపెనీ. ఈ కంపెనీకి రాష్ట్ర వ్యాప్తంగా 26 బ్రాంచులు ఏర్పాటు చేశారు. డబ్బు తమకు ఇవ్వమని ప్రజలు ఒత్తిడి చేయడంతో కంపెనీని మూసివేశారు. ప్రజల నుంచి దాదాపు 100 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశారు. కంపెనీ అధినేత గంటి శ్రీధర్ బాబు పరారీలో ఉన్నారు.
  • 2014, మే… ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేటలో బోర్డు తిప్పేసిన మైత్రీ చిట్ ఫండ్ కంపెనీ ప్రజల నుంచీ 5కోట్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం. ఇక 2018, డిసెంబరు… ఖమ్మం జిల్లాలో ఐపీ పెట్టిన శ్రేష్ట చిట్‌ ఫండ్‌ సంస్థ 4.5 కోట్ల వరకూ ప్రజలను ముంచేసింది.
  • 2020, జూన్‌… విశాఖలో చీటీల పేరుతో రూ.2 కోట్ల టోకరా. చిట్టీల పేరుతో 140 కుటుంబాల వద్ద నుంచీ రెండు కోట్లు వసూలు చేసిన రైల్వే ఉద్యోగి అప్పలరాజు రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి పరారయిపోయారు. అతని చేతిలో మోసపోయినవారిలో అత్యధికులు స్థానికులు, బంధువులే. చీటీ వేసినవారు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
  • 2020, డిసెంబరు… హైదరాబాద్‌, కూకట్‌పల్లి ప్రశాంత్ నగర్ లో కేకేఆర్ చిట్ ఫండ్ మోసం. ప్రజల నుంచి 300 పై చిలుకు మంది నుంచీ రూ.10 కోట్లుకు పైగా చిట్టీల రూపంలో వసూలు చేసిన కంపెనీ. కొన్ని సంవత్సరాల పాటు అధిక వడ్డీ అశ పెట్టి ప్రజల వద్ద నుంచి భారీ డిపాజిట్ల వసూలు చేసిందీ సంస్థ. ఒకరోజు రాత్రికి రాత్రి కార్యాలయం మూసేసి అంతా పరారాయిపోయారు. దీంతో పోలీసులు యజమాని చిత్తూరు జిల్లాకు చెందిన కిరణ్ కుమార్ రెడ్డి, వెంకట రమణారావులపే కేసు నమోదు చేశారు.
  • 2021, మార్చి… మంచిర్యాల జిల్లాలోని చెన్నూరులో వేద వర్షిణి చిట్ ఫండ్ కంపెనీ బోర్డు తిప్పేసింది. కంపెనీ యజమాని సురేష్‌ కోటికి పైగా మోసం చేసి పరారాయిపోయారు.

ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే అనధికారికంగా 23 వేల చిట్ ఫండ్ కంపెనీలు ఉంటాయని అంచనా. ఏటా 20 వేల కోట్ల విలువైన వ్యాపారాన్నిఈ ప్రైవేటు కంపెనీలు చేస్తున్నాయి. కానీ, రాష్ట్రవ్యాప్తంగా చాలా కంపెనీలు చిట్ ఫండ్ యాక్ట్ ను, నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయి. ఈ మోసాలకు చెక్ పెట్టడానికి బ్లాక్ చైన్ టెక్నాలజీని అమలు లోకి తీసుకు వచ్చింది తెలంగాణ ప్రభుత్వం. రిజిస్టర్డ్ చిట్ ఫండ్ కంపెనీలు తమ చిట్ విలువ మొత్తాన్ని డబ్బు రూపంలో డిపాజిట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. చిట్ ఫండ్ కంపెనీలకు సంబంధించిన ట్రాక్ రికార్డ్ అంతా ఎప్పటికప్పుడు మానిటరింగ్‌ సిస్టం ఏర్పాటు చేశారు.

మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అంచనా ప్రకారం… అక్టోబర్ 2014 నాటికి, దేశంలో సుమారు 5000 లిస్టెడ్ చిట్ ఫండ్ కంపెనీలు ఉన్నాయి. అయితే, అధికారికంగా నమోదు కాని చిట్ ఫండ్ సంస్థలు ఎన్నో తమ కార్యకలాపాలు యధేచ్చగా సాగిస్తున్నాయి. అసలు ఈ సంస్థలతోసంబంధం లేకుండా గ్రామాల్లో, పట్టణాలలో వీధికి ఒక్కరు ఇద్దరు చొప్పున చిట్టీ వ్యాపారాలు నడుపుతున్నవారు ఎంతో మంది ఉన్నారు. అనామక సంస్థలు, వ్యక్తులు డిపాజిట్ దారుల నుండి కొల్లగొడుతున్న డబ్బులు కనీసం ప్రభుత్వ రికార్డ్‌లకు కూడా దొరకని పరిస్థితి ఉంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఏప్రిల్ 2016 నాటి అంచనా ప్రకారం చిట్ ఫండ్ సంస్థలు ప్రజల నుండి సుమారు 80,000 కోట్ల రూపాయలను కొల్లగొట్టాయి. 2014లో దేశంలో పెద్ద చిట్‌ ఫండ్‌ సంస్థలలో ఒకటయిన పెరల్ ఇండియా ప్రయివేట్ లిమిటేడ్ చిట్ ఫండ్ సంస్థ చాలా రాష్ట్రాలలోసుమారు 5.5 కోట్ల మంది డిపాజిట్ దారులను మోసగించి, 51,000 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. మన తెలుగు రాష్ట్రాలలోలక్షలాది ప్రజలను మోసం చేసిన సంస్థగా సుపరిచితమైన అగ్రిగోల్డ్ 23 లక్షల మందిని, శారదా చిట్ ఫండ్ సంస్థ 17 లక్షల మంది డిపాజిట్ దారులను మోసగించాయి.

ఎందుకిలా..

చిట్ ఫండ్స్ తో పోలిస్తే, బ్యాకుల్లో డబ్బులు సురక్షితంగా ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, ఆ బ్యాంకులు వారికి అందుబాటులో లేవు. అనుకూలంగా లేవు. ఒక వైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం 2016 నాటికి, దేశంలో 1,30,000 బ్యాంక్ బ్రాంచీలు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధిక బ్యాంక్ బ్రాంచీలు ఉన్న దేశం మనది అని చెపుతున్నప్పటికి, గామీణ ప్రాంతాల ప్రజలకు బ్యాంకులు తగినంత అందుబాటులో లేవు అన్నది వాస్తవం. ప్రజలు బ్యాంకులకు వచ్చి పొదుపు చేయాలంటే, తమ ఒక రోజు పని దినాన్ని కోల్పోయే పరిస్థితి ఉంది. దీంతో ఇంటివద్దకే వచ్చి డబ్బులు కట్టించుకుని వెళ్లే ప్రైవేటు చిట్‌ ఫండ్‌ కంపెనీల ఏజెంట్ల వలలో పేద, మధ్య తరగతి ప్రజలు పడిపోతున్నారు.

నేషనల్‌ క్రైమ్‌ రికార్డు బ్యూరో నివేదిక ప్రకారం చిట్‌ ఫండ్‌ నేరాలు ఇలా ఉన్నాయి..

దేశ వ్యాప్తంగా 2019లో నమోదైన చిట్‌ ఫండ్‌ కంపెనీల నేరాలు 92.

  • ఇందులో మొదటి స్థానంలో హర్యానా(23)
  • తరువాతి స్థానాలలో రాజస్థాన్‌(15), కర్ణాటక(13), తమిళనాడు(13)
  • 2018లో నమోదైన నేరాలు 87
  • ఇందులో రాజస్థాన్‌(16), కర్ణాటక(14) తరువాతి స్థానం తెలంగాణదే (13) దేశంలో 2019 నాటికి దర్యాప్తు దశలో పెండింగ్‌లో ఉన్న చిట్‌ ఫండ్‌ కంపెనీ మోసాలు మొత్తం 378

Also Read: ప్రాణాంతకంగా మారుతున్న కరోనా వైరస్.. పది జిల్లాల్లో నైట్ క‌ర్ఫ్యూ.. కీలక నిర్ణయం తీసుకున్న యూపీ సర్కార్

Viral News: ఇంట్లోని ఓ గుంతలో భారీ సంఖ్యలో గుడ్లు పెట్టిన పాము.. దాని పిల్లలను నీటిలో వదిలిపెట్టిన అధికారులు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu